రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కాక!

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. రెండేళ్లుగా దీనిపై చర్చలు కొనసాగుతున్నా, శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో

Published : 29 May 2022 05:47 IST

నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ

ఈనాడు, జైపుర్‌: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. రెండేళ్లుగా దీనిపై చర్చలు కొనసాగుతున్నా, శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకొన్నాయి. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం జులైలో తన నిర్ణయం ప్రకటించే అవకాశముంది. కొద్దిరోజులుగా ఎమ్మెల్యేలు, దిగువస్థాయి నేతల్లో కదలిక కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్న దాదాపు 100 మంది నేతలు దిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని కలవాలని యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాయకత్వ మార్పును అంగీకరించబోమని వారు అంటున్నారు. తాము నిర్ణయం ప్రకటించే వరకూ ‘లక్ష్మణరేఖ’ దాటవద్దని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అజయ్‌ మకెన్‌ ఇప్పటికే స్థానిక నేతలను హెచ్చరించారు. పార్టీ విధేయునిగా అధిష్ఠానం దృష్టిలో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు మంచి పేరే ఉంది. దీనికి తోడు ఇటీవలి ఉపఎన్నికల్లో పార్టీకి విజయం దక్కేలా చేయటం, ఉదయ్‌పుర్‌లో చింతన్‌ శిబిర్‌ నిర్వహించటం ద్వారా పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆయన మరింత ప్రసన్నం చేసుకోగలిగారు. తరచూ దిల్లీ వెళుతూ అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నారు.

దిల్లీలో పైలట్‌

మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ రెండు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం దిల్లీ వెళ్లారు. అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశముందని చెబుతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నందున... సచిన్‌ మద్దతుదారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈదఫా తమ నేతకు తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని ఆయన మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామని, నాయకత్వ మార్పుపై తీవ్ర వ్యతిరేకత వస్తే మాత్రం... ఆ ఆలోచనను పక్కన పెడతామని అధిష్ఠానం నుంచి సంకేతాలు అందుతున్నట్టు కొందరు నేతలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని