Priyanka Chopra: హాలీవుడ్‌కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా

హాలీవుడ్‌కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్‌ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు.

Updated : 27 Apr 2024 13:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతూనే హాలీవుడ్‌లో స్థిరపడ్డారు ప్రియాంక చోప్రా (Priyanka Chopra). అక్కడకు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అక్కడి వారెవరూ కనీస గౌరవం ఇవ్వలేదన్నారు.

‘భారత్‌లో ఉన్నప్పుడు హాలీవుడ్‌ ప్రముఖ మ్యాగజైన్‌ల కవర్‌పై నా ఫొటో ఆరు సార్లు వచ్చింది. విదేశాలకు వచ్చాక ఎవ్వరూ కనీసం నాతో ఒక మీటింగ్‌ కూడా నిర్వహించలేదు. ఎన్నో ఎదురుదెబ్బలు, తిరస్కరణలు అనుభవించాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మౌనంగా నాపని నేను చేశాను. అదే ఈరోజు హాలీవుడ్‌లోనూ నాకు గుర్తింపు రావడానికి కారణమైంది. భారత్‌ నుంచి ఇక్కడకు రాగానే ఎంతో భయపడ్డాను. నాకు తెలియని పరిశ్రమ, పలకరించేవారు ఎవ్వరూ లేరు. ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న భావన మనసును కుంగదీసేది. అయినా ధైర్యంగా ముందుకు సాగాను’ అని చెప్పారు. 

గతంలో ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్‌ (Bollywood)లోని రాజకీయాలకు విసిగిపోవడం వల్లే హాలీవుడ్‌ (Hollywood)లో స్థిరపడ్డాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘‘హిందీ చలన చిత్ర పరిశ్రమలో నన్ను ఓ మూలకు తోసేశారు. ఎవరూ నాకు అవకాశాలు ఇవ్వట్లేదు. పలువురితో విభేదాలు ఏర్పడ్డాయి. అక్కడ రాజకీయాలు ఉంటాయి. వాటితో నేను విసిగిపోయా. అందుకే బాలీవుడ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలనిపించింది. అలా అమెరికా వచ్చేశా’’ అని చెప్పారు. ఇటీవల తన భర్తతో కలిసి ‘లవ్‌ అగైన్‌’ (Love Again)తో అలరించిన ప్రియాంక.. ‘హెడ్‌ ఆఫ్‌ స్టేట్‌’ అనే యాక్షన్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే  త్వరలో విడుదల కానున్న ‘టైగర్‌’ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అందిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని