Arvind Kejriwal: జైల్లో కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు..!

Arvind Kejriwal: తిహాడ్‌ జైల్లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు వెల్లడించినట్లు తెలుస్తోంది. వైద్యుల బృందం నేడు సీఎంను పరీక్షించింది. 

Published : 27 Apr 2024 14:34 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Policy Scam Case)లో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. టైప్‌-2 డయాబెటీస్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

దాదాపు అరగంట పాటు ఎయిమ్స్ వైద్యులు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ‘‘కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని మెడికల్‌ బోర్డు సూచించింది. మెడిసిన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్‌ డోసును కొనసాగించాలని తెలిపింది’’ అని సదరు వర్గాలు వెల్లడించాయి. వారం తర్వాత ఈ బృందం సీఎంను మరోసారి పరీక్షించనున్నట్లు పేర్కొన్నాయి.

రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు: కేజ్రీవాల్‌ సర్కారుపై దిల్లీ హైకోర్టు మండిపాటు

తన వ్యక్తిగత వైద్యుడితో రోజూ వీడియో మాధ్యమంలో సంప్రదించే అవకాశాన్ని కల్పించాలని ఇటీవల కేజ్రీవాల్‌ దిల్లీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని ఈడీ వ్యతిరేకించింది. ఆరోగ్య కారణాల కింద బెయిల్‌ పొందేందుకే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే, ఆయనకు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా దిల్లీ ఎయిమ్స్‌ను ఆదేశించింది. ఈ కమిటీ తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని