తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా ‘పట్టు’దల

పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. అక్కడి నగరాలు, పట్టణాలతో పాటు కీలక గ్రామాలనూ హస్తగతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా లోస్కువిట్కా, రాయ్‌-ఒలెస్కాండ్రివ్కా గ్రామాల్లో

Updated : 24 Jun 2022 06:44 IST

 లుహాన్స్క్‌లో 95% భూభాగం స్వాధీనం!

కీవ్‌: పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. అక్కడి నగరాలు, పట్టణాలతో పాటు కీలక గ్రామాలనూ హస్తగతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా లోస్కువిట్కా, రాయ్‌-ఒలెస్కాండ్రివ్కా గ్రామాల్లో రష్యా బలగాలు పాగా వేశాయి. లుహాన్స్క్‌ ప్రాంత పాలనా నగరమైన సెవిరోదొనెట్స్క్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు దాడులను ముమ్మరం చేశాయి. అక్కడికి సమీపంలోని సిరోటైన్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాడులను ఉధ్ధృతం చేశాయి. ఉక్రెయిన్‌ సైనికులకు సామగ్రిని సరఫరా చేసేందుకు కీలకంగా మారిన లెసిచాన్స్క్‌-బఖ్‌ముత్‌ రహదారిని కూడా మాస్కో బలగాలు దిగ్బంధించాయి. యుద్ధం ఆరంభమైన తర్వాత ఇప్పటివరకూ లుహాన్స్క్‌లో సుమారు 95% భూభాగాన్ని, దొనెట్స్క్‌లో సగం ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకొంది.

ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఖరారు?

బెర్లిన్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో... ఐరోపా కేంద్రంగా వచ్చే వారంలో జరిగే మూడు కీలక శిఖరాగ్ర సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

1) ఐరోపా కూటమి (ఈయూ) నేతలు గురు, శుక్రవారాల్లో బ్రసెల్స్‌లో భేటీ అవుతున్నారు. ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం మంజూరుపై ఈ సందర్భంగా లాంఛనప్రాయంగా ప్రకటనచేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ పొరుగు దేశమైన మాల్దోవాకు సైతం సభ్యత్వాన్ని ఖరారుచేసే అంశంపై నేతలు చర్చిస్తున్నారు.

2) జి-7 దేశాలు ఆదివారం నుంచి మంగళవారం వరకూ జర్మనీలో వార్షిక సమావేశం నిర్వహిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా హాజరయ్యే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో ద్వారా మాట్లాడతారు.

3) నాటో దేశాల నేతలు మంగళవారం నుంచి గురువారం వరకూ మాద్రీద్‌లో సమావేశం కానున్నారు. ఫిన్లాండ్‌, స్వీడన్‌లను కూటమిలో చేర్చుకునే విషయమై ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. వీడియో ద్వారా జెలెన్‌స్కీ కూడా పాల్గొనే ఈ భేటీ చారిత్రక సమావేశం కానుందని నాటో సెక్రటరీ-జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ ఇప్పటికే పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని