దక్షిణాఫ్రికాలో గుప్తా బ్రదర్స్‌ భారీ అక్రమాలు.. మాజీ అధ్యక్షుడి అండతో..

గుప్తా బద్రర్స్‌గా ప్రాచుర్యం పొంది, దక్షిణాఫ్రికాలో భారీస్థాయి అక్రమాలకు పాల్పడిన భారతదేశానికి చెందిన ముగ్గురు సోదరుల్లో అతుల్‌ గుప్తా, రాజేశ్‌ గుప్తాలపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ నోటీసులు జారీ చేసింది.

Updated : 02 Mar 2022 12:11 IST

జొహన్నెస్‌బర్గ్‌: గుప్తా బద్రర్స్‌గా ప్రాచుర్యం పొంది, దక్షిణాఫ్రికాలో భారీస్థాయి అక్రమాలకు పాల్పడిన భారతదేశానికి చెందిన ముగ్గురు సోదరుల్లో అతుల్‌ గుప్తా, రాజేశ్‌ గుప్తాలపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల నుంచి బిలియన్లకొద్దీ ర్యాండ్లను (దక్షిణాఫ్రికా కరెన్సీ) దోచుకున్నారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. అక్రమాలపై విచారణలు సాగుతుండగానే ఈ సోదరులు దక్షిణాఫ్రికా నుంచి తమ కుటుంబాలతో సహా ఉడాయించారు. వీరి భార్యలు ఆర్తీ, చేతాలి గుప్తాలకు కూడా నోటీసులు జారీ చేయాలన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వ అభ్యర్థనను ఇంటర్‌పోల్‌ తోసిపుచ్చింది. ఆయా దేశాల్లో వ్యక్తులు ఎవరైనా నేరాలకు పాల్పడి విదేశాలకు పరారైనపుడు ఇంటర్‌పోల్‌ సభ్య దేశాలు అన్నిటికీ ఈ రెడ్‌ నోటీసు జారీ చేస్తారు. ఇది అరెస్టు వారెంటుతో సమానం కాదు. నేరస్థుల అప్పగింతలో బాధిత దేశాలకు సహాయకారిగా ఉంటుంది. ఏడు నెలల కిందటే ఈ నోటీసుల జారీకి దక్షిణాఫ్రికా ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా.. రెండు రోజుల కిందట వారి ప్రయత్నం ఫలించి, సోమవారం నోటీసులు జారీ అయ్యాయి. దక్షిణాఫ్రికా న్యాయశాఖ మంత్రి రొనాల్డ్‌ లమోలా దీన్ని సానుకూలం పరిణామంగా అభివర్ణించారు. ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వారు కచ్చితంగా ఎక్కడున్నారన్నది స్పష్టంగా తెలియకపోయినా.. దక్షిణాఫ్రికా గతేడాది దుబాయ్‌తో అప్పగింత ఒప్పందం చేసుకొంది. ఈ మేరకు దరఖాస్తు కూడా చేసుకొని ఎదురుచూస్తున్న తరుణంలో ఇంటర్‌పోల్‌ నోటీసులు జారీ అయ్యాయి.

ముగ్గురు సోదరులైన అజయ్, అతుల్, రాజేశ్‌ గుప్తాల స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని షహరాన్‌పుర్‌. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరు దుబాయ్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాలోని జాతీయ ప్రాసిక్యూటింగ్‌ అథారిటీ ఈ సోదరుల అప్పగింత కోసం గత కొన్నేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోంది.  దేశ పూర్వ అధ్యక్షుడు జాకబ్‌ జుమాతో తమకున్న సాన్నిహిత్యాన్ని వాడుకొన్న గుప్తా సోదరులు నేషనల్‌ ఎలక్ట్రిసిటీ సప్లయర్‌ ‘ఎస్కాం’ వంటి పలు ప్రభుత్వరంగ సంస్థలను కొల్లగొట్టారు. ఇప్పుడు ఆ సంస్థలన్నీ తీవ్ర ఆర్థికసంక్షోభంలో ఉన్నాయి. గుప్తా సోదరులకు సహకరించిన అప్పటి అధ్యక్షుడు జాకబ్‌ జుమా జైలుకు వెళ్లి, ప్రస్తుతం వైద్యపరమైన కారణాలతో పెరోల్‌పై బయటికి వచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని