బంగారం... ఇలా కొందామా?!

‘ఎంతైనా బంగారం...బంగారమే’ మెరిసే గిల్టు నగలెన్ని కొన్నా... పసిడికి సాటేదీ రాదు. అందుకే, పాపాయికి చెవులకు కుట్టించింది మొదలు... జీవితంలోని ప్రతి దశలోనూ ఆడపిల్ల పుత్తడితో ప్రేమలో పడుతూనే ఉంటుంది.

Updated : 10 May 2024 08:52 IST

‘ఎంతైనా బంగారం...బంగారమే’ మెరిసే గిల్టు నగలెన్ని కొన్నా... పసిడికి సాటేదీ రాదు. అందుకే, పాపాయికి చెవులకు కుట్టించింది మొదలు... జీవితంలోని ప్రతి దశలోనూ ఆడపిల్ల పుత్తడితో ప్రేమలో పడుతూనే ఉంటుంది. అందుకేనేమో ఏటికేడు పసిడి కూడా ‘తగ్గేదేలే’ అంటూ కొండెక్కి కూర్చుంటోంది. ఇలాంటప్పుడిక బంగారం కొనలేమా అనేవారికోసం అక్షయ తృతీయ సందర్భంగా...

సిరి సంపదలతో పాటు అక్షయమైన సంతోషాన్నీ, పుణ్యాన్నీ ఇచ్చే పర్వదినమే అక్షయ తృతీయ. వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. అక్షయం అంటే నాశనం కానిది. తరగనిది, దినదినాభివృద్ధి చెందేదని అర్థాలున్నాయి. సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని లక్ష్మి అనుగ్రహించిన దినమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే, బంగారం కొంటే అది రెట్టింపు అవుతుందని నమ్ముతారు. ఈ నమ్మకాల్ని ఆధారంగా చేసుకునే దుకాణదారులు బంగారం కొనేవారికి ఆఫర్లూ ప్రకటిస్తుంటారు. నెలవారీ వాయిదాలతో నచ్చిన నగ కొనుక్కోవచ్చని ఒప్పించేస్తారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రాము కొనాలన్నా వేలకు వేలు ఖర్చు చేయాల్సిందే. అలాగని దానిపై ఉన్న మక్కువను వదిలేసుకోలేం కదా! ఇలాంటివారికోసమే ఇప్పుడు ప్రముఖ నగల దుకాణాలు సైతం తక్కువ క్యారట్ల బంగారంతో చేసిన నగల డిజైన్లను ఎక్కువగా మార్కెటింగ్‌ చేస్తున్నాయి. మరి వీటిని కొనడం వల్ల ప్రయోజనం ఉంటుందా? అసలు ఇవి బంగారమేనా? వీటిని అమ్మితే డబ్బులు తిరిగి వస్తాయా? వంటి బోలెడు సందేహాలు మన మనసుల్లో మెదులుతుంటాయి. ఆ అనుమానాలను తీర్చే ప్రయత్నమే ఇది.

పుత్తడి తక్కువైనా...

బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి.మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది కాయిన్స్‌, బార్స్‌, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది. ఇందులో ఇతర లోహాలేమీ కలవకపోవడం వల్ల మృదువుగా ఉంటుంది. కాబట్టి నగల తయారీకి వాడరు. ఇక, 22 క్యారట్ల బంగారంలో 22 వంతుల బంగారం ఉంటే...రెండువంతుల రాగి, జింక్‌ లాంటి మెటల్స్‌ ఉంటాయి. సాధారణంగా నగల తయారీకి 22 క్యారట్లు బంగారాన్నే ఎక్కువగా వాడతారు. అయితే, ధర పెరగడంతో ఇప్పుడు తక్కువ క్యారట్లలోనూ నగలు చేస్తున్నారు.

22 క్యారట్ల కంటే తక్కువలోనూ అంటే 18, 14తో పాటు...1 క్యారట్‌ వరకూ వాడిన పసిడి ఆభరణాలు ఇప్పుడు మార్కెట్‌లో ప్రాచుర్యంలో ఉన్నాయి. నచ్చిన నగల్లా కొనుక్కోవాలనుకునేవారూ, గోల్డ్‌ రేటు ఎక్కువ కావడం వల్ల కొనుగోలు చేయలేకపోతున్నాం అనుకునేవారికి ఇవి చక్కటి ప్రత్యామ్నాయం. ముఖ్యంగా 18 క్యారట్ల బంగారంలో 75శాతం పసిడి, 25శాతం జింక్‌, రాగి, నికెల్‌ వంటి లోహాలు ఉంటాయి. దీన్నే 750 గ్రాముల బంగారం అని కూడా పిలుస్తారు. ఇది 24, 22 క్యారట్ల బంగారం కంటే దృఢంగా, మన్నికగా ఉంటుంది. దీన్ని డైమండ్‌ జ్యూయెలరీ మేకింగ్‌లోనూ, బరువైన, నగిషీలు చెక్కాల్సిన ఆభరణాల డిజైన్లకూ ఎక్కువగా వాడతారు. అలానే, 14 క్యారట్ల గోల్డ్‌లో 58.33శాతం స్వచ్ఛమైన బంగారం, 41.67శాతం వెండి, జింక్‌, రాగి... వంటి ఇతర లోహాలు కలవడం వల్ల బంగారం 58.33శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. ఇది కాస్త చౌకగానూ లభిస్తుంది. ఈ 18, 14 తక్కువ క్యారట్ల బంగారు నగలు... ఉత్తరాదిన ఎంతో పాపులర్‌. సాధారణంగా రాళ్ల నగలు ఎక్కువగా చేస్తుంటారు. గోల్డ్‌ఫిల్డ్‌, షీట్‌లతో చేసే జ్యూయెలరీ తయారీకి వినియోగిస్తారు. ఇందులో వాడిన పసిడి స్వచ్ఛతను బట్టే దీని ధర నిర్ణయమవుతుంది కాబట్టి...రీసేల్‌ వాల్యూ కూడా ఉంటుంది. ఆ ప్యూరిటీని హాల్‌మార్కింగ్‌ ద్వారా ధృవీకరించుకోవచ్చు. లేదంటే యాసిడ్‌ పరీక్ష, ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ టెస్టర్‌లను వాడి కూడా నిర్ధారించుకోవచ్చు. మరి ఇంకెందుకాలస్యం... తక్కువలోనే పుత్తడిని ఇంటికి పట్టుకొచ్చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్