logo

అందుకే విజయవాడ పశ్చిమ సీటు ఇచ్చేశా: పవన్‌ కల్యాణ్‌

‘విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది. కానీ.. భాజపా అధినాయకత్వం నన్ను ఒక్కటే అడిగింది.

Updated : 10 May 2024 09:36 IST

బెజవాడలో అభిమానుల బ్రహ్మరథం

 కూటమి శ్రేణుల సమరోత్సాహం

 

అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, డిజిటల్‌, అమరావతి - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్‌: ‘విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది. కానీ.. భాజపా అధినాయకత్వం నన్ను ఒక్కటే అడిగింది. మీకు అమరావతి కావాలంటే.. దానిలో మా ప్రాధాన్యం ఉండాలి కదా.. అన్నారు. విజయవాడలోని మూడు సీట్లలో ఇద్దరు తెదేపా నేతలు ఎప్పటి నుంచో ఉన్నారు.

అందుకే నేను త్యాగం చేశాను. కానీ.. పశ్చిమ సీటు వదిలేసేటప్పుడు రెండే అడిగాను. ఒకటి అమరావతి, రెండు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడాలని. వాళ్లు అంగీకరించడం వల్లే సీటును వదులుకున్నాను. పశ్చిమలో నేను తీర్చిదిద్దిన నాయకుడే ఇప్పుడు వైకాపా మాయలో పడి నన్ను తిడుతున్నారు. కానీ.. నేను ఇలాంటి వాటికి భయపడను. నేను అతడిని క్షమిస్తున్నానని’ పోతిన వెంకట మహేశ్‌ గురించి పరోక్షంగా ఆయన పేరు పలకకుండా పవన్‌ ప్రస్తావించారు.

మిద్దెనెక్కిన అభిమానం


పంజాసెంటర్‌ను గంజాయి కేంద్రం చేశారు..

రాష్ట్రంలో అరాచక పాలన పోవాలనే.. పవన్‌ కల్యాణ్‌ కూటమిని ఏర్పాటు చేశారు. మేమేం పదవులపై ఆశతో రాలేదు. ప్రజా సేవ చేయడానికి వచ్చాం. విజయవాడలోని ఈ పంజాసెంటర్‌ను.. గంజాయికి కేంద్రంగా వైకాపా మూకలు మార్చాయి. చీడ పురుగులు మనల్ని పాలిస్తున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో జీవనం దుర్భరంగా మార్చారు. దుష్టపాలన పోగొట్టాలంటే.. మే 13న కూటమికి ఓటేయాలి. కూటమిని గెలిపించండి.
- యలమంచిలి సత్యనారాయణచౌదరి, విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి


కూటమి రాకతో రాష్ట్రం బాగుపడుతుంది..

పవన్‌ కల్యాణ్‌ వల్లే ఈరోజు కూటమి ఏర్పాటు సాధ్యమైంది. రాష్ట్రం బాగు కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నగరానికి ఆయన రాకతో డబుల్‌ జోష్‌ వచ్చింది. పవన్‌కు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి. ఆయన త్యాగం వల్ల.. రాష్ట్రంలోని ప్రజలందరి మనస్సులో స్థిరంగా నిలిచిపోతారు. మళ్లీ కూటమి రాకతోనే.. ఈ రాష్ట్రం బాగుపడుతుంది.
- కేశినేని శివనాథ్‌(చిన్ని), కూటమి విజయవాడ లోక్‌సభ అభ్యర్థి


జగన్‌ ఎంత నొక్కారో చెప్పాలి

గత ఐదేళ్లలో.. తాను 130 సార్లు బటన్‌ నొక్కానంటూ చెప్పుకొంటున్న జగన్‌.. అసలు తానెంత నొక్కారో బయటపెట్టాలి. ఇది పార్టీలతో ఏర్పడిన కూటమి కాదు.. ప్రజా కూటమి. రాష్ట్రంలో జనసేన అధినేత పిలిస్తే.. 175 నియోజకవర్గాల్లోనూ జనసైన్యమే కదలి వస్తోంది. అదీ ఆయన స్థాయి. వైకాపా అరాచక పాలనను అంతమొందించడానికే.. ఈ కూటమి చేయిచేయి కలిపింది.
- వంగవీటి రాధాకృష్ణ, తెదేపా నేత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని