మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’

వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు.

Published : 10 May 2024 06:42 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై యువత నిలదీత
సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. పొలాలు, రచ్చబండల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు. పలువురు మేధావులు, ప్రతిపక్షాలు ఈ చట్టంపై వీడియోలు, ట్రోల్స్‌ చేస్తూ వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. యువత, విద్యావంతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ‘ఇప్పటి వరకు మా చేతికి ఇవ్వకముందే టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. ఇప్పుడు మా భూములను కూడా తనఖా పెట్టడానికే పట్టాలు తీసుకుంటున్నారా?’ అంటూ సర్కారును నిలదీస్తున్నారు. వైకాపా నాయకుల దందా స్టైలే అంత అని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకొందరు మా కష్టం మీద మీ ఫొటో ఏంటని మండిపడుతున్నారు. పాస్‌ పుస్తకాలపై వేసే ఫొటోలు.. కరెంట్‌ బిల్లు, చెత్త పన్ను మీద ఎందుకు వేయట్లేదని ప్రశ్నిస్తున్నారు. భూ వివాదాలపై కోర్టుకు కూడా వెళ్లలేని భూభక్షక చట్టం తెచ్చిన వైకాపాకు ఓటేస్తే మీ భూమితో మీకు రుణం తీరినట్లేనని హెచ్చరిస్తున్నారు.


సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ట్రోల్స్‌

  • మీ బిడ్డా మీ బిడ్డా అంటే ఏంటో అనుకున్నాం. ఆస్తి పత్రాల కోసం అనుకోలేదయ్యా!
  • ఒక్క అవకాశం ఇస్తే పట్టాలపై మా ఫొటోలు లేకుండా చేశావు. ఇంకో అవకాశం ఇస్తే మా భూములే లేకుండా చేస్తావేమో..?
  • రజినీకాంత్‌ నటించిన నరసింహ చిత్రంలోని ‘పెళ్లి కొడుకు వీడే కానీ.. వీడు వేసుకున్న డ్రెస్‌ మాత్రం నాదీ అన్నటు’్ల.. ‘పొలం వీడిదే కానీ పత్రాలు ప్రభుత్వానివి’ అంటూ దాన్ని మార్చి విమర్శిస్తున్నారు.
  • ‘జగనన్న కాలనీల పేరుతో సెంట్లు ఇచ్చిండు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో ఎకరాలు లాగేస్తుండు’ అంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు.
  • ప్రతిపక్ష పార్టీలు రూపొందించిన వీడియోలో నటుడు, జనసేన నాయకుడు పృథ్వీ వైకాపా నాయకుడిలా నటిస్తారు. ఓ బాధితుడు వచ్చి నా భూమిని రాత్రికి రాత్రి మీ పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారా అని పృథ్వీని నిలదీస్తారు. దానికి బదులుగా భలే వాడివమ్మా నీ భూమి అయితే నిరూపించుకో అని బాధితుడికి సవాల్‌ చేస్తారు. కోర్టుకు వెళ్లి నిరూపించుకుంటానని బాధితుడు చెబుతుండగా.. ఆ నాయకుడు కలగజేసుకుని కోర్టుల్లో నడవదమ్మా.. మీ లాయర్‌ చెప్పలేదా? ఈ మధ్యల్నే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చాం. భూ వివాదాలేవైనా కోర్టులో నడవవు. దీని కోసం టైటిలింగ్‌ రిజిస్టర్‌ ఆఫీసర్‌ (టీఆర్‌వో) ఉంటారు. భూమి నీదేనని ఆయన దగ్గర నిరూపించుకోవాలి. నువ్వు నిరూపించుకుంటానన్న అది కుదరదు. ఎందుకంటే వాడిని నియమించేది మేమే. కాబట్టి మేం చెప్పిందే వాడు వింటాడు. నువ్వు చేసేదేం లేదు కాబట్టి నువ్వే ఎంతకో కొంతకు సెటిల్‌ చేసుకుంటేే మంచిదని హెచ్చరిస్తారు. దీనితో దారులన్నీ మూసుకుపోయాయని అర్థమైన బాధితుడు నాకు ఆడపిల్ల ఉందయ్యా.. మాకున్న ఆధారం భూమి ఒక్కటే.. మీరేం చెబితే అదేనని తన నిస్సహాయతను వ్యక్తం చేస్తారు. ఇలా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమల్లోకి వస్తే ప్రజలకు జరిగే నష్టాలను వీడియోల రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు.
  • ‘అతడు’ సినిమాలో మహేశ్‌ బాబు తాతగా నటించిన నాజర్‌ తన భూమిని కబ్జా చేసిన తనికెళ్ల భరణిని ‘ఇదేంటి నాయుడు?’   అని ప్రశ్నిస్తాడు. ‘కంచె అంటారు. ఇంగ్లిషులో ఫెన్సింగ్‌ అంటారని ఇప్పుడే ఎమ్మార్వో చెబుతున్నాడు’ అని భరణి బదులిస్తాడు. పక్కనే ఉన్న ఎమ్మార్వో కలగజేసుకుని ‘ఈ భూమి మీదే అనిపిస్తే కోర్టుకెళ్లండి అది సివిల్‌ కేసు అవుతుంది. మా మీద గొడవ చేస్తే క్రిమినల్‌ కేసు అవుతుంది. అదే నాయుడు లాంటోనితోని ఎందుకని భూమిని వదిలేస్తే సమయం మిగులుతుంది’ అని చెబుతారు. వైకాపా అధికారంలోకి వస్తే ఇలాగే ప్రజల భూములు లాక్కుంటారని ఆ సన్నివేశంతో పోల్చి ట్రోల్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని