Indian Army: భారత సైన్యం చేతికి అధునాతన స్నైపర్‌ రైఫిళ్లు

భారత సైన్యం అమ్ములపొదిలో అధునాతన స్నైపర్‌ రైఫిళ్లు చేరాయి. 

Updated : 29 Mar 2022 12:23 IST

పల్లన్‌వాలా: భారత సైన్యం అమ్ములపొదిలో అధునాతన స్నైపర్‌ రైఫిళ్లు చేరాయి. ఫిన్లాండ్‌ నుంచి సమకూర్చుకున్న ఈ ఆయుధాలను జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి మోహరించిన సైనికులకు వీటిని అందించారు. మాటువేసి, దూరం నుంచే శత్రువుపైకి గురి తప్పకుండా కాల్పులు జరిపే సైనికులను ‘స్నైపర్‌’గా పేర్కొంటారు. పోరులో వీరి పాత్ర కీలకం. ఆధునికీకరణలో భాగంగా భారత్‌ తన సైనికులకు ‘సాకో .338 టీఆర్‌జీ-42’ అనే ఈ స్నైపర్‌ తుపాకులను అందించింది. ప్రత్యర్థుల వద్ద ఉన్న ఆయుధాలతో పోలిస్తే ఇవి చాలా మెరుగైనవని అధికారులు వివరించారు.

నియంత్రణ రేఖ వెంబడి ఉన్న స్నైపర్‌ సైనికులు వీటిపై శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఎల్‌వోసీ వద్ద మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన సత్తాను మరింత పెంచుకోవడానికి వీటిని అందించినట్లు పేర్కొన్నారు. అక్కడ గస్తీ తిరుగుతున్న సైనికులకు శత్రు స్నైపర్ల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా 2018, 2019లో పాక్‌ స్నైపర్ల కార్యకలాపాలు పెరిగాయి. దీంతో మెరుగైన తుపాకులను సమకూర్చుకునే కసరత్తును భారత్‌ చేపట్టింది. సాకో టీఆర్‌జీ-42 స్నైపర్‌ రైఫిల్‌.. శక్తిమంతమైన ‘లాపువా మ్యాగ్నమ్‌’ తూటాలను ప్రయోగించగలదు. ఈ తుపాకీ బరువు 6.55 కిలోలు. 1,500 మీటర్ల దూరంలోని లక్ష్యంపైకి అత్యంత కచ్చితత్వంతో తూటాను ప్రయోగించగలదు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన ఆయుధాల్లో ఒకటిగా ఇది నిలిచింది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని