ప్రాణాలు పోతున్నా మీమాంసే

అమెరికాలో మరోసారి పాఠశాల విద్యార్థులపై కాల్పులు జరగడంతో రాజ్యాంగంలోని రెండవ సవరణ మళ్లీ చర్చకు వచ్చింది. అగ్రరాజ్యంలో తుపాకీ సంస్కృతిపైనా భిన్న వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. అమెరికా పాఠశాలల్లో, మాల్స్‌లో, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో దుండగులు

Published : 27 May 2022 05:56 IST

అమెరికాలో మారని తుపాకీ సంస్కృతి
కొనుగోళ్ల నిషేధానికి అడ్డుకట్ట

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి పాఠశాల విద్యార్థులపై కాల్పులు జరగడంతో రాజ్యాంగంలోని రెండవ సవరణ మళ్లీ చర్చకు వచ్చింది. అగ్రరాజ్యంలో తుపాకీ సంస్కృతిపైనా భిన్న వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. అమెరికా పాఠశాలల్లో, మాల్స్‌లో, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం సాధారణమైపోయింది. టెక్సాస్‌ ఘటన నిందితుడు రామోస్‌ ఈ నెల 17, 20 తేదీల్లో రెండు ఏఆర్‌ రైఫిళ్లను, 18వ తేదీన 350 తూటాలనూ చట్టబద్ధంగా కొనుగోలు చేశాడు. ప్రతిపక్ష రిపబ్లికన్ల ఏలుబడిలోని టెక్సాస్‌ రాష్ట్రంలో 18-21 ఏళ్లవారు కూడా తుపాకులు కొనడానికి చట్టం అనుమతిస్తుంది. తుపాకీ కాల్పుల్లో ఏటా వేలమంది మరణిస్తున్నా ఆయుధాలను నిషేధించడానికి రెండో రాజ్యాంగ సవరణ అడ్డువస్తోంది. రైఫిళ్లు, పిస్తోళ్ల వంటి మారణాయుధాలను కొనడానికి ఇది రాజ్యాంగపరంగా హక్కునిస్తోందని అమెరికన్లు భావిస్తారు.

రెండో సవరణ కథాకమామీషు

‘స్వతంత్ర రాజ్య రక్షణ కోసం సైన్యానికి తోడుగా సాయుధ పౌరులతో ఏర్పడిన దళం (మిలీషియా) అవసరం. తదనుగుణంగా వ్యక్తులకు ఆయుధాలను ధరించే హక్కు ఉంది. ఆ హక్కుకు భంగం కలిగించకూడదు’ అని నిర్దేశిస్తూ 1791లో అమెరికా రాజ్యాంగానికి రెండవ సవరణ తెచ్చారు. పౌరులు ఆయుధాలు కలిగి ఉండడానికి దీనిని ముడిపెడుతూ వక్రభాష్యం చెబుతున్నారనీ, నిజానికి ఈ సవరణలో పేర్కొన్న మిలీషియా అనే పదం నేషనల్‌ గార్డ్స్‌ వంటి జాతీయ భద్రతా దళాలకు మాత్రమే వర్తిస్తుందనే వాదన ఉంది. అందరూ తుపాకులు కొనడం వల్లనే కాల్పులు పెరిగిపోతున్నాయనీ, ఈ ధోరణిని నిరోధించాలని పౌర హక్కుల సంఘాలు ఎప్పటికప్పుడు డిమాండ్‌ చేస్తున్నాయి. తుపాకులను నిషేధించకుండా జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏ) తదితర గ్రూపులు పైరవీలు చేస్తున్నాయి. దీనికి తుపాకీ ఉత్పత్తిదారుల నుంచే కాకుండా, ఆయుధధారులైన అమెరికన్‌ పౌరుల నుంచీ విరాళాలు వస్తుంటాయి. కొవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలో దాడుల భయంతో అమెరికా ప్రజలు పెద్దఎత్తున తుపాకులు కొన్నారు.

వాదనలతోనే సరిపెడుతున్నారు

తుపాకీ కాల్పుల వెనుక సామాజిక కారణాలున్నాయని డెమోక్రటిక్‌ పార్టీ వారు భావిస్తే, వ్యక్తుల మనస్తత్వంలోని లోపాలు కాల్పులకు దారితీస్తాయని రిపబ్లికన్లు వాదిస్తారు. ప్రజల్లో ఎక్కువమంది వద్ద తుపాకులు ఉంటే, వారు దుండగులను సమర్థంగా ఎదుర్కోగలుగుతారని రిపబ్లికన్‌ నాయకులు భావిస్తారు. తుపాకీ హింసను అరికట్టడానికి 2021లో అధ్యక్షుడు బైడెన్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసినా, పార్లమెంటు నుంచి వాటికి సరైన మద్దతు లభించలేదు. తుపాకీ చట్టాలను కఠినతరం చేయాలని డెమోక్రాట్లు పిలుపు ఇవ్వగా, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించాలనీ, పాఠశాలల వద్ద సెక్యూరిటీ గార్డుల నియామకం వంటి భద్రతా చర్యలను పెంచాలని రిపబ్లికన్లు కోరారు. దీనిమధ్య పౌరుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది.

శాసనాల విషయంలో విభేదాలు

తుపాకుల విక్రయాలు, వాడకంపై కఠిన ఆంక్షలు విధిస్తూ కొత్త చట్టం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా అమెరికా చట్టసభల్లో పాలక, ప్రతిపక్ష విభేదాల వల్ల అది సాధ్యపడేలా లేదు. పాలక డెమోక్రాట్లకు దిగువ సభలో మెజారిటీ ఉన్నా, ఎగువసభ సెనెట్‌లో తగినంత మెజారిటీ లేదు. కనీసం 10 మంది ప్రతిపక్ష రిపబ్లికన్ల మద్దతు ఉంటే తప్ప తుపాకులపై కఠినమైన చట్టం తీసుకురావడం సాధ్యపడదు. తుపాకుల చట్టాలను కఠినతరం చేయాలని 52% అమెరికన్లు ఆశిస్తున్నట్లు 2021 అక్టోబరులో ప్రజాభిప్రాయ సేకరణలో తేలినా అది ప్రభుత్వ విధానాలను మార్చలేకపోతోంది. తమ ఓటర్లు తుపాకీ ప్రియులు కాబట్టి కఠిన చట్టం తీసుకురాలేమన్నది రిపబ్లికన్‌ సెనెటర్ల వాదం. తుపాకుల నియంత్రణకు పాలక డెమోక్రాట్ల ఏలుబడిలోని రాష్ట్రాల్లోనే ముందడుగు పడుతోంది. రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న 30 రాష్ట్రాల శాసనసభలలో ఒక్కటి కూడా తుపాకుల నియంత్రణకు సుముఖంగా లేదు. కాల్పులు జరిగి పెద్ద సంఖ్యలో జనం మరణించినప్పుడల్లా తుపాకీ చట్టాలను కఠినతరం చేయడానికి విధానకర్తలు హడావిడి చేస్తారు. బిల్లులు ప్రవేశపెడతారు. కథ అంతటితో ముగిసిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని