Mouse Deer: మూషిక జింక.. బతికేందుకు తంటా

మూషిక జింకలు..జింకల జాతిలో అతి చిన్న ప్రాణి. రెండు దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో అంతరించిన ఈ మౌస్‌డీర్‌ల జాతిని సంరక్షించి సంతానోత్పత్తి పెంచేందుకు అటవీశాఖ చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లో జూలో పెంచిన

Updated : 25 Jun 2022 08:45 IST

రెండు దశాబ్దాల క్రితం అంతరించిన జీవులు
జూలో పెంచి అడవుల్లో వదిలిపెట్టిన అటవీశాఖ
204లో బతికినవి 20 శాతం వరకే?

ఈనాడు, హైదరాబాద్‌: మూషిక జింకలు..జింకల జాతిలో అతి చిన్న ప్రాణి. రెండు దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో అంతరించిన ఈ మౌస్‌డీర్‌ల జాతిని సంరక్షించి సంతానోత్పత్తి పెంచేందుకు అటవీశాఖ చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లో జూలో పెంచిన వాటిలో 204 మూషిక జింకల్ని గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో వివిధ అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. అందులో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో వదిలినవే 132 ఉన్నాయి. అయితే ఇందులో దాదాపు 20 శాతం మాత్రమే బతికి ఉన్నట్లు సమాచారం. కిన్నెరసానిలో 28, నిర్మల్‌లో 10, జన్నారంలో 10, హయత్‌నగర్‌ మృగవని నేషనల్‌ పార్కులో 8, పోచారం వైల్డ్‌లైఫ్‌ శాంక్చువరీలో 16 వదిలిపెట్టగా ఇంచుమించుగా అక్కడా ఇదే రకమైన పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

జూలో మరో 170

రాష్ట్రంలో మూషిక జింకలు అంతరించడంతో 2009, 2010లో గుజరాత్‌ నుంచి రెండు మగ, నాలుగు ఆడ మూషిక జింకల్ని తీసుకువచ్చారు. ‘హైదరాబాద్‌ జూపార్క్‌లో వీటిని సంరక్షిస్తున్నాం.  సంతానోత్పత్తితో మూషిక జింకల సంఖ్య బాగా పెరిగింది. వాటిలో 204 జింకల్ని అడవుల్లో వదిలిపెట్టగా ప్రస్తుతం ఇంకా జూలో 170 ఉన్నాయి’అని హైదరాబాద్‌ జూ క్యూరేటర్‌ రాజశేఖర్‌ తెలిపారు. వీటిలో కొన్నింటిని వర్షాకాలంలో వివిధ అటవీ ప్రాంతాల్లో విడిచి పెట్టేందుకు అటవీశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

బరువు తక్కువ..చురుకు ఎక్కువ

మూషిక జింకల బరువు ఐదారు కిలోలకు మించదు. రాత్రి పూట చురుగ్గా పరుగులు తీస్తాయివి. పండ్లు, పుట్టగొడుగుల్ని తింటాయి. సహజ అడవుల్లో వీటి సంతతి పెరగాలన్నది లక్ష్యం. జూలో పెరుగుతున్న వీటిని తొలుత ఎన్‌క్లోజర్‌లో విడిచిపెట్టి వాటికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటివి ఇస్తున్నారు. నెల రోజుల పర్యవేక్షణ తర్వాత అడవిలో స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.

భయమే చంపేస్తోందా?

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో 132 మూషిక జింకల్ని ఫర్హాబాద్‌ ప్రాంతంలో వదిలారు. అక్కడ వేటకుక్కలు, గద్దలు, చిరుతలు బాగా ఉండటంతో వాటికి బలవుతున్నాయి. వదిలిన వాటిలో 20 శాతం వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ అగ్నిప్రమాదాల్లో వీటి ఆవాసాలు కాలిపోతున్నాయి. వేగంగా పరిగెత్తలేని ఇవి వేటకుక్కలు, గద్దలకు సులభంగా ఆహారం అయిపోతున్నాయి.

మూషిక జింకలకు భయం ఎక్కువగా ఉంటుంది.. వీటి మరణాలకు భయం కూడా ప్రధాన కారణమన్న అభిప్రాయం అటవీ అధికారుల నుంచి వినిపిస్తోంది. ఎండాకాలంలో వీటి మరణాలు ఎక్కువ ఉంటాయని చెబుతున్నారు.

మూషిక జింకల్ని అడవిలో వదిలిపెట్టాక అవి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీటి శరీరానికి చిన్న రేడియో కాలర్‌(చిప్‌) పెట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ ప్రయత్నించింది. దీనికి నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని