Cricket: క్రికెట్‌లో చరిత్రలో అరుదైన ఫీట్‌.. 6 బంతుల్లో 6 వికెట్లు..

క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఫీట్‌ నమోదైంది. ఆస్ట్రేలియాలోని ఓ క్లబ్ క్రికెటర్ ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు.

Published : 14 Nov 2023 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఒక్కోసారి కచ్చితంగా గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోతుంది. ఓటమి అంచుల వరకూ వెళ్లిన జట్టు అనుహ్యంగా పుంజుకుని విజయ తీరాలకు చేరుతుంది. ఆస్ట్రేలియాలోని ఓ క్లబ్‌ క్రికెట్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓటమి ఖాయమనుకున్న తరుణంలో ఓ బౌలర్‌ ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు పడగొట్టి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ 3 పోటీల్లో ఈ అరుదైన ఫీట్ నమోదైంది. 

సర్ఫర్స్ ప్యారడైజ్‌ జట్టుపై ముద్గీరాబా నెరంగ్ & డిస్ట్రిక్ట్స్ టీమ్‌ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. 40 ఓవర్లలో 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్‌ జట్టు 39 ఓవర్లకు 174/4 స్కోరుతో నిలిచింది. ఆరు బంతుల్లో ఐదు పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. ఈ తరుణంలో ముద్గీరాబా నెరంగ్ కెప్టెన్ గారెత్‌ మోర్గాన్ (Gareth Morgan) చివరి ఓవర్‌లో ఒక్క పరుగూ ఇవ్వకుండా ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఎవరూ ఊహించనివిధంగా మలుపు తిప్పాడు. ఈ దెబ్బతో సర్ఫర్స్ ప్యారడైజ్‌ జట్టు ఆలౌట్‌ కాగా.. ముద్గీరాబా నెరంగ్ జట్టు నాలుగు రన్స్‌ తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో ఔటైన వారిలో మొదటి నలుగురు బ్యాటర్లు క్యాచ్‌  ఔట్‌ కాగా.. మిగతా ఇద్దరు క్లీన్‌బౌల్డ్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో గారెత్ ఏడు ఓవర్లు వేసి  7/16 గణాంకాలు నమోదు చేశాడు. ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు పడగొట్టడానికి ముందు సర్ఫర్స్ ప్యారడైజ్ ఓపెనర్ జేక్ గార్లాండ్‌ని ఔట్‌ చేశాడు. గారెత్‌ బ్యాటింగ్‌లోనూ రాణించాడు. 39 పరుగులు చేసి జట్టులో టాప్‌ స్కోరర్‌గానూ నిలిచాడు. 

పలు నివేదికల ప్రకారం.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇదివరకు పలువురు ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టారు. 2011లో వెల్లింగ్టన్‌పై ఒటాగో తరఫున న్యూజిలాండ్‌కు చెందిన నీల్ వాగ్నర్, 2013లో అభానీ లిమిటెడ్‌పై యూసీబీ- బీసీబీ XI తరఫున బంగ్లాదేశ్ అల్ అమీన్ హోస్సేన్ ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీశారు. భారత్‌ విషయానికొస్తే.. కర్ణాటక తరఫున 2019లో అభిమన్యు మిథున్‌ హరియాణాపై ఈ ఘనత సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని