ప్లేఆఫ్స్‌ లక్ష్యంగా పోరుకు సిద్ధం

అబుదాబి మరో రసవత్తరపోరుకు సిద్ధమైంది. టీ20 క్రికెట్‌ లీగ్‌లో భాగంగా 35వ మ్యాచ్‌ హైదరాబాద్‌, కోల్‌కతా మధ్య జరగనుంది. గత మ్యాచుల్లో ఓటమి చవిచూసిన రెండు జట్లు ప్లేఆఫ్స్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

Published : 18 Oct 2020 11:26 IST

నేడు కోల్‌కతాతో తలపడనున్న హైదరాబాద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అబుదాబి మరో రసవత్తరపోరుకు సిద్ధమైంది. టీ20 క్రికెట్‌ లీగ్‌లో భాగంగా 35వ మ్యాచ్‌ హైదరాబాద్‌, కోల్‌కతా మధ్య జరగనుంది. గత మ్యాచుల్లో ఓటమి చవిచూసిన రెండు జట్లు ప్లేఆఫ్స్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓసారి చూద్దాం.

గత సీజన్‌ను గుర్తు చేయాలి..
హైదరాబాద్‌ జట్టులో గత సీజన్‌కు.. ఈ సీజన్‌కు తేడా ఏంటంటే..? ఓపెనింగ్‌ భాగస్వామ్యం. 2019లో డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో కలిసి సృష్టించిన వీరంగం అంతాఇంతా కాదు. కానీ.. ఇప్పుడు ఆ విధ్వంసకరమైన ఓపెనింగ్‌ ఇన్నింగ్స్‌ కనిపించడం లేదు. ప్లేఆఫ్స్ దగ్గరపడుతున్నాయి. వార్నర్‌సేన ముందుకు వెళ్లాలంటే ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి. అందుకే.. ఈ ఓపెనింగ్‌ జోడీ తమ విధ్వంసం పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. మిడిల్‌ ఆర్డర్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శనల్లేవు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నది నలుగురు మాత్రమే. ప్రియం గార్గ్‌ ఒక్క మ్యాచ్‌లో తప్పితే మరోసారి తన ప్రతిభ చూపించలేకపోయాడు. దీంతో అతని స్థానంలో అభిషేక్‌శర్మ లేదా విరాట్‌సింగ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ఆడిన ఎనిమిదింట్లో మూడు విజయాలు, ఐదు ఓటములతో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. 

ఆరు మ్యాచుల్లో వికెట్‌ తీయని కమిన్స్‌..
కెప్టెన్‌ను మార్చినా కోల్‌కతా తీరు మారలేదు. జట్టు నిండా ప్రతిభావంతులైన క్రికెట్లున్నప్పటికీ ఆ జట్టు ఓటమికి దాసోహమంటోంది. దినేశ్‌ కార్తిక్‌ నుంచి సారథ్య బాధ్యతలను అందుకున్న ఇయాన్‌ మోర్గాన్‌ తొలి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నిజానికి కోల్‌కతాలో ప్రధాన లోపం బౌలింగ్‌. ఎన్నో అంచనాలతో తీసుకున్న ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కమిన్స్‌ తన స్థాయి ప్రదర్శన చేయడం లేదు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. కోల్‌కతా ఈ విషయంపై దృష్టి పెడితే మరో పేసర్‌ ఫెర్గుసన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్‌లో దినేశ్‌ కార్తిక్‌, నితీశ్‌ రాణా తిరిగి ఫామ్‌ అందుకోవాల్సిన అవసరం ఉంది. వార్నర్‌సేనతో పోలిస్తే కోల్‌కతాది మెరుగైన పరిస్థితి. ఆ జట్టు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలోనూ నాలుగోస్థానంలో ఉంది. 

రికార్డుల మాట..
ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచుల్లో తలపడ్డాయి. వాటిలో 11 విజయాలతో కోల్‌కతా పైచేయి సాధించింది. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా విజయం సాధించింది. ఈ రోజు మ్యాచ్‌ జరుగనున్న అబుదాబి మైదానంలో హైదరాబాద్‌ గతంలో మూడు మ్యాచులాడి ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. రెండింట్లో ఓటమిపాలైంది. మరోవైపు కోల్‌కతా ఈ వేదికపై ఎనిమిది మ్యాచ్‌లాడింది. అందులో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు నమోదు చేసింది. 

అర్థంకాని అబుదాబి పిచ్‌..
అబుదాబి మైదానంలో సీజన్‌ ప్రారంభంలో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువ ఉండేవి. తర్వాత పరిస్థితి తారుమారైంది. ఛేదన జట్లు గెలవడం ప్రారంభించాయి. పిచ్‌ పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియని ఈ మైదానంలో టాస్‌ గెలిచిన జట్టు ఏం తీసుకుంటుందన్నదీ కీలకమే.

జట్లు (అంచనా)
హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), బెయిర్‌స్టో, మనీశ్ పాండే, విలియమ్సన్, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌శర్మ/విరాట్‌ సింగ్‌, రషీద్‌ఖాన్‌, షాబాజ్‌ నదీమ్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌.

కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, క్రిస్‌ గ్రీన్‌/ఫెర్గుసన్‌, కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని