Published : 18 Aug 2020 02:26 IST

ధోనీ వీడ్కోలు.. ఇక నేనూ రిటైర్‌ అవుతా!

ఇకపై క్రికెట్‌ చూడనంటున్న పాక్‌ అభిమాని బషీర్‌

(సచిన్‌ అభిమాని సుధీర్‌తో బషీర్‌)

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందులో కొందరు ఆయనంటే ప్రాణమిస్తారు. అతనాడే మ్యాచుల కోసం ఏ దేశమైనా వెళ్తారు. టికెట్లు కోసం ఆరాటపడతారు. అలాంటి అభిమానుల్లో ఒకరు మహ్మద్‌ బషీర్‌ బొజాయ్‌ (చాచా చికాగో అని ముద్దుపేరు). పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించిన ఆయన వృత్తిరీత్యా షికాగోలో స్థిరపడ్డారు. ఆగస్టు 15న ధోనీ వీడ్కోలు పలికాడని తెలిసి ఇకపై తాను క్రికెట్ వీక్షణకు ముగింపు పలుకుతానని అంటున్నారు. కరోనా పరిస్థితులు సర్దుకున్నాక రాంచీ వచ్చి మహీని కలుసుకుంటానని పీటీఐతో చెప్పారు.

‘మహీ వీడ్కోలు పలికాడు. నేనూ రిటైర్‌ అవుతా. అతను ఆడటం లేదు కాబట్టి మ్యాచులు చూసేందుకు నేనిక విదేశాలకు వెళ్లను. అతడిని నేను ప్రేమించా. అతడు నన్ను ప్రేమించాడు. ఎంత గొప్ప ఆటగాళ్లైనా ఏదో ఒకరోజు ముగించాల్సిందే. కానీ అతడి వీడ్కోలు నాకెన్నో మధురస్మృతులను గుర్తుకు తెస్తోంది. మహీ వీడ్కోలు మ్యాచ్‌ ఆడివుంటే బాగుండేది’ అని చాచా అన్నారు.

వాంఖడే వేదికగా 2011లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ పోరుకు బషీర్‌కు టికెట్‌ దొరకలేదు. అప్పుడు ధోనీయే అతడికి టికెట్‌ ఇప్పించాడు. బషీర్‌కు ఇప్పుడు 65+ ఏళ్లు ఉంటాయి. మూడుసార్లు గుండెపోటు నుంచి బయటపడ్డారు. కరోనా కారణంగా భారత్‌కు రాలేకపోతున్నానని పరిస్థితులు కుదుటపడ్డాక రాంచీకి వెళ్తానని అంటున్నారు. మహీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటానని పేర్కొన్నారు. మరో అభిమాని అయిన రాంబాబునూ వెంట తీసుకెళ్తానని తెలిపారు. ఐపీఎల్‌ కోసం దుబాయ్‌ వెళ్లి మహీని చూసే అవకాశమున్నా ఆరోగ్య కారణాలతో వెళ్లడం లేదన్నారు.

గతంలో చాలాసార్లు  మహీతో మాట్లాడేవాడినని 2019 నుంచీ కుదరడం లేదని బషీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొన్ని సందర్భాల్లో అతడితో మాట్లాడే అవకాశం ఉండేది. 2019 నుంచి కష్టంగా ఉంది. అయితే నిరుడు ప్రపంచకప్‌ పోరులోనూ మహీ నాకు టికెట్‌ ఇప్పటించాడు. 2018 ఆసియాకప్‌ సందర్భంలో తన గదికి తీసుకెళ్లి జెర్సీ అందజేశాడు. నన్ను కలిసే సమయం లేనప్పుడు ఎవరితోనైనా టికెట్లు పంపిస్తాడు. 2015 ప్రపంచకప్‌ సమయంలో జరిగిన సంఘటనను నేనెప్పటికీ మర్చిపోలేను. సిడ్నీలో మ్యాచు చూస్తున్నాను. ఎండ బాగా ఉంది. అప్పుడు సురేశ్ రైనా వచ్చి నాకు కళ్లద్దాలు ఇచ్చాడు. మహీ పంపించాడని చెప్పాడు. నేను చిరునవ్వు నవ్వాను’ అని బషీర్‌ అన్నారు.

ధోనీ కోసం చప్పట్లు కొడుతున్నప్పుడు కొందరు పాక్‌ అభిమానులు తనను వెన్నుపోటుదారుడని అవమానిస్తారని బషీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తాను పట్టించుకోవడం మానేశానని అన్నారు. 2019లోనూ బర్మింగ్‌హామ్‌లో ఇలా జరిగిందని అయితే దేశాల కన్నా మానవత్వానికే తాను ఓటేస్తానని పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts