Updated : 13/10/2020 14:51 IST

రోడ్డు ప్రమాదమే ఆమె దశ మార్చేసింది..!

మానసి జోషి.. నిజమైన ‘షీ’రో   


(Manasi Joshi Facebook Photo)

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే దానికి కచ్చితమైన ఉదాహరణ ఆమె. ఎంతో మంది ప్రత్యేక అవసరాల వారికి నిలువెత్తు నిదర్శనం. రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా రాకెట్‌ పట్టి బరిలోకి దిగింది. తన పట్టుదల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మొండిగా కష్టపడింది. ఈ క్రమంలోనే పారా బ్యాడ్మింటన్‌ విభాగంలో పతకాల జోరు కొనసాగించింది. చివరికి 2019లో ఈ విభాగంలోనే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌గా అవతరించి శభాష్‌ అనిపించుకుంది. ఆమె పేరే మానసి జోషి. సరిగ్గా నిలుచోడానికి కాలు లేకున్నా పరిస్థితులపై పోరాడి నిజమైన విజేతగా నిలిచింది. ఆ పోరాట లక్షణమే ఆమెకు అరుదైన గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవల బార్బీడాల్‌ ‘షీ’రోస్‌ సంస్థ మానసి బొమ్మను పోలిన ఓ మోడల్‌ను విడుదల చేయగా ఆమె సంతోషం వ్యక్తం చేసింది. అసలీ మానసి ఎవరు.. ఆమె కథ ఏంటో తెలుసుకుందాం.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ ఆరంభం
మానసి తండ్రి గిరీష్‌ చంద్ర జోషి. ముంబయిలోని బాబా అటామిక్‌ పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. స్వతహాగా ఆయనో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌. తన కూతురుకు ఆరేళ్ల వయసులోనే ఈ ఆటపై మక్కువ ఏర్పడడంతో ఆమె చేతికి రాకెట్‌ అందించాడు. దాంతో చిన్ననాటి నుంచే మానసి చదువులో ముందుంటూనే క్రీడలపైనా ఆసక్తి పెంచుకుంది. తర్వాత ముంబయిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కెరీర్‌ ఆరంభించింది. 

ఆ రోడ్డు ప్రమాదంతో దశ తిరిగింది

(Manasi Joshi Facebook Photo)

ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే మానసి రోడ్డు ప్రమాదానికి గురైంది. 2011 డిసెంబర్‌లో ఒకరోజు తన ద్విచక్రవాహనంపై ఆఫీసుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆమె కిందపడిపోవడంతో ఎడమకాలిపై నుంచే అది వెళ్లింది. ఆ క్షణంలో ఎవరైనా వెంటనే స్పందించి ఉంటే ఆమె జీవితం మరోలా ఉండేమో! కానీ, ఆస్పత్రికి వెళ్లేసరికి ఆలస్యమైంది. సరైన చికిత్స అందేసరికి సాయంత్రమైంది. వైద్యులు ఎంత కష్టడినా చివరికి ఫలితం లేకుండాపోయింది. 45 రోజుల పాటు ఎన్ని చికిత్సలు చేసినా ఇంటికి వచ్చేసరికి ఆమె ఎడమకాలు కోల్పోయింది. ఇంటికి వచ్చాక అద్దంలో చూసుకొని బాధపడింది. అలా ఉంటే లాభం లేదనుకొని కఠిన పరిస్థితులను అధిగమించాలని ప్రయత్నించింది.

శిక్షణకు పుల్లెల గోపీచంద్‌ అకాడమీకి
ఇంటికి వచ్చాక మానసి నడవడానికి ఓ ప్రోస్థెటిక్‌ కాలును ఏర్పాటు చేసుకుంది. దాంతో తన చిన్ననాటి వ్యాపకమైన బ్యాడ్మింటన్‌పై మనసుపడి మళ్లీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. తన తండ్రితో కలిసి సాధన చేసేది. ఈ క్రమంలోనే ఓ పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రోత్సాహంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆమె ఇప్పుడు పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా విశేషంగా రాణిస్తోంది. ఎన్నో కష్టాలకోర్చి 2015 నుంచి 2019 వరకు వివిధ పతకాలు సాధించింది. ఈ ఆటతో తనకంటూ మరో జీవితం ఉందని తెలుసుకొని ఛాంపియన్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే 2018లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో చేరి అత్యుత్తమ శిక్షణ తీసుకుంది. గోపీ ఆధ్వర్యంలో మెరుగ్గా రాణించి 2019 బాసెల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. తోటి భారత క్రీడాకారిణి పారుల్‌ పార్మాను ఓడించి సత్తా చాటింది. 

(Manasi Joshi Facebook Photo)

మానసి జోషి విజయగాథను తెలుసుకున్న బార్బీడాల్‌ షీరోస్‌ సంస్థ ఆమెకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. తన పోలికలతో ఒక మోడల్‌ బొమ్మను రూపొందించి అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా స్థానం కల్పించింది. దాంతో ఎంతో మంది అమ్మాయిలకు, తనలాంటి ప్రత్యేక అవసరాలున్న వారికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మానసి సామాజిక మాధ్యమాల్లో సంతోషం వ్యక్తం చేసింది. ఉత్తమ విద్యతో పాటు ఇతర కళలను ప్రోత్సహిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రతీ ఒక్కరూ తాము సాధించాలనుకున్నది నెరవేర్చుకుంటారని తెలిపింది. 

పారా బ్యాడ్మింటన్‌లో పతకాల జోరు:
* 2015 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పతకం.
* 2016 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌, డబుల్స్‌లో కాంస్యం.
* 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌లో మరో కాంస్యం.
* 2018 థాయిలాండ్‌ పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో కాంస్యం. 
* 2018 ఆసియా గేమ్స్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో కాంస్యం.
* 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో స్వర్ణ పతకం.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని