ఐపీఎల్‌కు చైనా స్పాన్సర్‌.. ప్రజలేమో బహిష్కరించాలా?

ఐపీఎల్‌కు చైనా స్పాన్సర్‌ను కొనసాగించటంపై జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ధ్వజమెత్తారు.

Updated : 03 Aug 2020 17:22 IST

విమర్శలు కురిపించిన ఒమర్‌ అబ్దుల్లా

ఇంటర్నెట్‌ డెస్క్‌: లద్దాఖ్‌ ఘర్షణల నేపథ్యంలో ప్రజలు చైనా వస్తువులను బహిష్కరిస్తుంటే.. ఐపీఎల్‌కు మాత్రం చైనా స్పాన్సర్‌ను కొనసాగించటంపై జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ధ్వజమెత్తారు. ‘‘చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెప్తూ.. చైనాకు చెందిన సెల్‌ఫోన్‌ ఉత్పత్తిదారులను ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగిస్తున్నారు. చైనాను ఎలా నియంత్రించాలో అని మనం అయోమయంలో ఉంటే... ఆ దేశం మనను అపహాస్యం చేయడంలో ఆశ్చర్యం లేదు’’ అని ఆయన ట్విటర్‌ మాధ్యమంలో విమర్శించారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు నిర్వహించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లు దుబాయ్‌, అబుదాబ్‌, షార్జాలోని మైదానాల్లో జరగనున్నాయి. అంతేకాకుండా ఐపీఎల్‌ స్పాన్సర్స్‌లో ఏ మార్పూ లేదని, చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్‌నే కొనసాగించాలని పాలక మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంత తక్కువ సమయంలో మరో కొత్త స్పాన్సర్‌ లభ్యం కావడం ఇంచుమించు అసాధ్యమని బోర్డు అభిప్రాయపడింది.

కాగా, చైనా స్పాన్సర్లను బీసీసీఐ అంగీకరించటం పట్ల ఒమర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా చైనాలో తయారైన టీవీలను తమ ఇళ్లల్లోంచి బయటకు విసిరేసిన బుద్ధిహీనుల పట్ల తనకు జాలిగా ఉందని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని