బాక్సింగ్‌ డే టెస్టుకు ‘ఆ నలుగురు’ 

అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత టీమ్‌ఇండియా బలంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. సిరీస్‌లో నిలవాలంటే రెండో టెస్టు కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది...

Published : 21 Dec 2020 14:14 IST

రెండో టెస్టులో మార్పులు అనివార్యం..!

అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత టీమ్‌ఇండియా బలంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. సిరీస్‌లో నిలవాలంటే రెండో టెస్టు కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అభిప్రాయం అభిమానుల్లోనూ బలంగా వినిపిస్తోంది. అయితే, బాక్సింగ్‌డే టెస్టులో విజయం సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియాకు అంత తేలిక కాదు. మరోవైపు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి సైతం జట్టుకు దూరమవ్వడంతో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులో నాలుగు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అదే.. కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌ జట్టులోకి రావడం. మరి ఈ నలుగురు ఇటీవల ఎలాంటి ప్రదర్శన చేశారనే విషయాలు చూద్దాం..


కోహ్లీ స్థానంలో రాహుల్‌.. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఏకైక ఆటగాడు కేఎల్‌ రాహుల్‌. సహజంగా మిడిల్‌ఆర్డర్‌లో జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్‌ కోహ్లీది. అయితే, ఇప్పుడతడు పితృత్వపు సెలవుల మీద భారత్‌కు తిరిగి వస్తున్న నేపథ్యంలో కెప్టెన్సీ రహానె చేపడుతున్నాడు. కానీ బ్యాట్స్‌మన్‌గా అతడి స్థానాన్ని భర్తీ చేయడంలో రాహుల్‌ ప్రధానంగా కనిపిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ఆడిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు ఫర్వాలేదనిపించాడు. రెండో వన్డేలో 76, తొలి రెండు టీ20ల్లో 80 పరుగులు చేశాడు. ఇక అంతకన్నా ముందు ఐపీఎల్లో 670 పరుగులు చేసి ఈ సీజన్‌లో నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 


సాహాకు బదులు పంత్‌..

ఇక టెస్టుల్లో నాణ్యమైన కీపర్‌గా ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్న వృద్ధిమాన్‌ సాహా తొలి టెస్టులో నిరాశపరిచాడు. రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లోనూ అతడు పెద్దగా ఆకట్టుకోకపోయాడు. అయితే, అనుభవం కలిగిన ఆటగాడిగా జట్టు యాజమాన్యం అడిలైడ్‌ టెస్టుకు అతడిని ఎంపిక చేసింది. మరోవైపు రిషభ్‌ పంత్‌ (103 నాటౌట్‌; 73 బంతుల్లో, 9x4, 6x6) రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించినా అతడిని పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు సాహాకు బదులు పంత్‌ను తీసుకునే వీలుంది. అతడు మిడిల్‌ ఆర్డర్‌లో ధాటిగా ఆడితే టీమ్‌ఇండియా వేగంగా పరుగులు చేయగలదనే అభిప్రాయం కూడా అభిమానుల్లో ఉంది. ఇక అంతకుముందు ఆడిన ఐపీఎల్లో ఈ యువ బ్యాట్స్‌మన్‌ 343 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. 


పృథ్వీని కాదని శుభ్‌మన్‌గిల్‌..

పృథ్వీషా చాలా కాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలిసినా టీమ్‌ఇండియా అతడిని తొలి టెస్టులో ఆడడానికి అవకాశం ఇచ్చింది. అందులో అతడు దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుతిరగ్గా.. రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులే చేశాడు. అంతకుముందు ఆడిన రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లోనూ రాణించలేకపోయాడు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రెండో టెస్టుకు శుభ్‌మన్‌గిల్‌ను ఎంపిక చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. గిల్‌ రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌ అందుకోవడంతో మయాంక్‌తో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా దిగుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లోనూ అతడు ఆకట్టుకున్నాడు. అక్కడ 3 అర్ధశతకాలతో మొత్తం 440 పరుగులు చేశాడు. ఒకవేళ శుభ్‌మన్‌గిల్‌ను టెస్టుల్లోకి తీసుకుంటే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇదే అతడి అరంగేట్ర మ్యాచ్‌ అవుతుంది. 


షమీ గాయంతో సిరాజ్‌..

టీమ్‌ఇండియా సిరీస్‌లో నిలవాలంటే పేసర్లు అత్యంత కీలకం. అలాంటిది తొలి టెస్టులో మహ్మద్‌ షమిలాంటి అనుభవజ్ఞుడు గాయం బారిన పడ్డాడు. దాంతో మిగతా టెస్టులకు దూరమై తిరిగి స్వదేశం బయలుదేరాడు. అతడి స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను ఎంపిక చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే శుభ్‌మన్‌లాగే సిరాజ్‌ కూడా టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. సిరాజ్‌ ఇటీవల జరిగిన రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించాడు. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అతడు, రెండో మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. ఇక అంతకుముందు ఐపీఎల్‌లో ఆడిన సందర్భంగా 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన సిరాజ్‌.. ఎలాగైనా టీమ్‌ఇండియాలో అవకాశం వస్తే నిరూపించుకోవాలనే కసితో ఉన్నాడు. 

మరి ఐదు రోజుల్లో ప్రారంభమయ్యే బాక్సింగ్‌డే టెస్టులో ఈ నలుగురూ ఎంపికైతే ఎలా ఆడతారో వేచి చూడాలి.

-ఇంటర్నెట్‌డెస్క్‌

ఇవీ చదవండి..

కిం కర్తవ్యం..!

విహారిని ముందు పంపించాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని