Virat Kohli:..తర్వాతేంటి?

పనిభారం కారణంగా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు  కోహ్లి ప్రకటించినప్పుడు అంతా ఆశ్యర్యపోయారు. అయితే టెస్టులు, వన్డేల్లో భారత జట్టును నడిపించేది విరాటే కదా అని అభిమానులు సర్దుకున్నారు. నిజానికి కోహ్లి నాయకత్వానికి పోటీ లేకపోయినా.. భిన్న సారథులు ఉండాలన్న చర్చ మొదలవకపోయినా ధోని బాటలోనే అతనూ నడిచాడు. గౌరవపూర్వకంగా టీ20 సారథ్య బాధ్యతల అప్పగింతకు ముందుకొచ్చాడు.

Updated : 09 Nov 2021 08:42 IST

ఈనాడు క్రీడావిభాగం

పనిభారం కారణంగా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు  కోహ్లి ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అయితే టెస్టులు, వన్డేల్లో భారత జట్టును నడిపించేది విరాటే కదా అని అభిమానులు సర్దుకున్నారు. నిజానికి కోహ్లి నాయకత్వానికి పోటీ లేకపోయినా.. భిన్న సారథులు ఉండాలన్న చర్చ మొదలవకపోయినా ధోని బాటలోనే అతనూ నడిచాడు. గౌరవపూర్వకంగా టీ20 సారథ్య బాధ్యతల అప్పగింతకు ముందుకొచ్చాడు. ఇదంతా ఐపీఎల్‌ యూఏఈ దశకు మూడు రోజుల ముందు సంగతి. ఆ తర్వాత ఐపీఎల్‌ పూర్తయింది. పొట్టి కప్పులో భారత్‌ పోరాటం కూడా ముగిసింది. సూపర్‌ 12 దశలోనే జట్టు ఇంటిముఖం పట్టింది. టీ20 కప్పులో జట్టు వైఫల్యం నేపథ్యంలో పరిస్థితుల్లో చాలా మార్పొచ్చింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓడటం.. కనీసం సెమీస్‌ చేరకపోవడం ప్రతి ఒక్క అభిమానిని తీవ్ర నిరాశకు గురిచేసింది. కోహ్లి ఇంకాస్త ముందుగానే వైదొలగి ఉంటే బాగుండేదన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. పొట్టి కప్పులో జట్టు వైఫల్య ప్రభావం కోహ్లి వన్డే సారథ్యంపైనా పడుతుందా? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.

రానున్న రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనుంది. 2023లో వన్డే ప్రపంచకప్‌కు భారత్‌లో నిర్వహిస్తారు. సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించాలని.. జట్టును విజేతగా నిలపాలని కోహ్లి కోరుకుంటాడనడంలో సందేహం లేదు. కానీ బయో బబుల్‌ వాతావరణం ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీస్తుంది. తాజా ప్రపంచకప్పులో టీమ్‌ఇండియా ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. ఐపీఎల్‌లో సత్తాచాటిన భారత ఆటగాళ్లు విశ్వవేదికపై పూర్తిగా తేలిపోయారు. ఈ నేపథ్యంలో సారథ్య ప్రభావం బ్యాటింగ్‌పై పడకుండా టీ20 జట్టు పగ్గాలు విడిచిపెట్టిన కోహ్లి.. రానున్న రోజుల్లో వన్డే కెప్టెన్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తికరం. 2014లో పగ్గాలు చేపట్టిన కోహ్లి..జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, దృక్పథంలో ఎంతో మార్పు తీసుకొచ్చాడు. గత ఏడేళ్లలో టెస్టుల్లో భారత్‌ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది.


లక్ష్యం 2023 ప్రపంచకప్‌  

కెప్టెన్‌గా, ఆటగాడిగా కోహ్లి అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే టెస్టుల మాదిరే వన్డేల్లో టీమ్‌ఇండియా విజయవంతమైందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం! 2019 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీస్‌లో ఓడింది. వన్డేల్లో బ్యాటర్‌గా కోహ్లీకి మంచి రికార్డే ఉన్నా.. కెప్టెన్‌గా అద్భుతమైన ఘనతలేమీ లేవు. సారథ్యం, బయో బబుల్‌ వాతావరణం తన బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందని టీ20 కెప్టెన్సీ వదులుకున్న కోహ్లి.. వన్డే సారథ్యం నుంచి కూడా తప్పుకోవాల్సి వస్తుందేమోనన్న వ్యాఖ్యలూ  వినిపిస్తున్నాయి. భారత్‌లో 2023 వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో కొత్త కెప్టెన్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే కోహ్లి పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవచ్చు. అయితే అతడి టెస్టు కెప్టెన్సీకి మాత్రం.. వచ్చే టెస్టు  ఛాంపియన్‌షిప్‌ వరకు ఎలాంటి ప్రమాదం, పోటీ లేవు.


ఇక రోహిత్‌ చూసుకుంటాడు

‘‘టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గౌరవం.కానీ ఇప్పుడు పగ్గాలు వదిలేసి ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడిక ఈ జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తర్వాతి  కెప్టెన్‌దే. అందుకు రోహిత్‌ ఉన్నాడు. టీ20ల్లో కెప్టెన్‌గా తప్పుకున్నంత మాత్రాన నా ఆటలో తీవ్రత తగ్గిపోదు. ఒకవేళ అలా ఆడలేకపోతే అప్పటి నుంచే క్రికెట్‌ మానేస్తా. నేను కెప్టెన్‌ కాకముందు కూడా ఆటపైనే ధ్యాస పెట్టా’’

- కోహ్లి


మరి ఎవరు?

కోహ్లి 2023 ప్రపంచకప్‌ వరకు ఉంటాడా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమే. కానీ ప్రస్తుతానికి టీ20 జట్టు కెప్టెన్‌ సీటు మాత్రమే ఖాళీ అయింది. కాబట్టి ఈ ఫార్మాట్లో కోహ్లి వారసుడు ఎవరు అన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం. తాత్కాలిక ప్రాతిపదికన చూసుకుంటే రోహిత్‌ పేరే ముందు వరుసలో ఉంటుంది. పొట్టి క్రికెట్లో సారథిగా అతడికి మంచి రికార్డే ఉంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ను 5 సార్లు విజేతగా నిలిపిన ఘనత అతని సొంతం. కోహ్లి నుంచి అతడు టీ20 పగ్గాలు అందుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కానీ ఇది తాత్కాలిక ఏర్పాటేనా? ఒకవేళ కొత్త వన్డే కెప్టెన్‌ను నియమించాల్సి వస్తే ఆ బాధ్యతలు కూడా అతడికే అప్పగిస్తారా అన్నది ప్రశ్న. రోహిత్‌కు ఇప్పుడు 34 ఏళ్లు. కోహ్లి శుక్రవారమే 33వ ఏట అడుగుపెట్టాడు. టెస్టు, వన్డే జట్లలోని సీనియర్ల సగటు వయసు 33-34 ఏళ్లు. 2023 ప్రపంచకప్‌ నాటికి వాళ్ల వయసు మరింత పెరుగుతుంది. కరోనా పూర్తిగా కనుమరుగయ్యేంత వరకు బయో బబుల్‌ వాతావరణంలో ఆడక తప్పకపోవచ్చు. ప్రపంచకప్‌కు ముందు ఎక్కువ సంఖ్యలో వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. సుదీర్ఘ కాలం బుడగలో ఆడుతూ అలసిపోకుండా ఉండడం సీనియర్లకు సాధ్యమేనా? ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లి లేదా రోహిత్‌ జట్టును నడిపించగలరా? సారథ్యం వారి బ్యాటింగ్‌పై ప్రభావం చూపదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భిన్న సారథ్యం భారత్‌కు నప్పుతుందా? అన్నది మరో ముఖ్యమైన ప్రశ్న. ఒక జట్టుకు కోహ్లి.. మరో జట్టుకు రోహిత్‌ నాయకత్వం వహిస్తే జట్టులో గ్రూపులు తయారవుతాయేమోనన్న అనుమానాలు కూడా లేకపోలేదు! అయితే ఇద్దరూ సీనియర్లే కాకుండా ఒక సీనియర్‌, ఒక జూనియర్‌కు రెండు జట్ల బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. 2014లో ధోని టెస్టు సారథ్యాన్ని విరాట్‌కు అప్పగించాడు. సుమారు ఏడాది పాటు వన్డేలు, టీ20 జట్లకు కెప్టెన్‌గా కొనసాగాడు. సీనియర్‌, జూనియర్‌ కావడంతో ధోని.. కోహ్లీల మధ్య విభేదాలు తలెత్తలేదు. నాయకత్వ బదిలీ సాఫీగా సాగిపోయింది. అలాంటి వ్యూహమే అనుసరిస్తే మాత్రం యువ ఆటగాడికి భారత టీ20 జట్టు పగ్గాలు అప్పగించొచ్చు. తర్వాత వన్డే జట్టు నాయకత్వాన్ని కూడా అప్పజెప్పొచ్చు. ఈ బాధ్యతకు రాహుల్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని