మాక్సీ ఖరీదైన ఓ చీర్‌లీడర్‌‌: సెహ్వాగ్‌

దిగ్విజయంగా ముసిగిన టీ20 లీగ్‌లో జట్లు, ఆటగాళ్ల ప్రదర్శనలపై మాజీలు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్‌ లీగ్‌లో విఫలమైన అయిదుగురు ఆటగాళ్ల గురించి మాట్లాడాడు.

Published : 14 Nov 2020 01:47 IST

లీగ్‌లో విఫలమైన ఆటగాళ్లు గురించి వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌డెస్క్: దిగ్విజయంగా ముగిసిన టీ20 లీగ్‌లో జట్లు, ఆటగాళ్ల ప్రదర్శనలపై మాజీలు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్‌ లీగ్‌లో విఫలమైన అయిదుగురు ఆటగాళ్ల గురించి మాట్లాడాడు. ‘వీరూకి బై తక్‌’ కార్యక్రమంలో తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు విసిరాడు. ఆరోన్‌ ఫించ్‌, రసెల్, మాక్స్‌వెల్, షేల్ వాట్సన్‌, డేల్ స్టెయిన్‌ గురించి సెహ్వాగ్‌ ఏమన్నాడో ఆయన మాటల్లో చదివేయండి.

‘‘ఆరోన్‌ ఫించ్‌... కోహ్లీసేనలో అతడు వీరూ అవుతాడని నా ముద్దుపేరుని అతడికిచ్చాను. కానీ బెంగళూరుకు ఉన్న శాపం అతడిపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ సీజన్‌లో అతడి బ్యాటింగ్‌ ఇంజిన్‌ పనిచేయలేదు’’

‘‘ఆండ్రూ రసెల్‌.. కండల వీరుడు ఈ సీజన్‌లో సోమరిగా ఉన్నాడు. చెలరేగుతానని మనకి హామీలు ఇచ్చి నిద్రపోయాడు. అందుకే కోల్‌కతా ప్లేఆఫ్‌కు చేరలేదు’’

‘‘షేన్ వాట్సన్.. ఈ డిజిల్‌ ఇంజిన్‌పై చెన్నై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నో కిక్‌స్టార్ట్‌ల తర్వాత ఈ సీజన్‌లో ఇంజిన్‌ పనిచేయడం ప్రారంభించింది. అయితే తన వాహనాన్ని ఇకపై లాగలేనని సీజన్‌ ముగిశాక రిటైర్మెంట్‌ ప్రకటించాడు’’

‘‘గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. పంజాబ్‌ జట్టులో రూ.10 కోట్ల ఖరీదైన చీర్‌లీడర్‌. లీగ్‌లో గత కొన్ని సీజన్లుగా తన ప్రదర్శన పేలవంగా కొనసాగుతోంది. అయితే ఈ సారి ఆ రికార్డులు కూడా బద్దలు కొట్టి మరింత విఫలమయ్యాడు. ఇది అతడికి అత్యంత ఖరీదైన విహారయాత్రగా భావించవచ్చు’’

‘‘డేల్‌ స్టెయిన్‌.. ఒకప్పుడు ‘స్టెయిన్ గన్‌’లో నుంచి వచ్చే బుల్లెట్లను చూసి అందరూ భయపడేవారు. కానీ ఈ సీజన్‌లో స్టెయిన్ గన్‌.. బొమ్మ గన్‌గా మారింది. అతడి ప్రదర్శన చూసి నా కళ్లను నేనే నమ్మలేకపోయా. కానీ ఓ విషయంపై స్పష్టత వచ్చింది. భవిష్యత్‌లో లీగ్‌ మార్కెట్‌లో అతడిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు’’ అని సెహ్వాగ్ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని