Dilip Vengsarkar: విరాట్‌ను అప్పుడు అందుకే ఎంపిక చేశాం..

ప్రస్తుత తరం క్రీడాకారుల్లో రారాజుగా వెలుగొందుతున్నాడు విరాట్‌ కోహ్లీ. అతడు సాధించిన ఘనతలే ఇందుకు కారణం. మొత్తంగా 71 సెంచరీలతో పాటు మరెన్నో రికార్డులు అతడి సొంతం..........

Published : 23 Sep 2022 21:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత తరం క్రీడాకారుల్లో రారాజుగా వెలుగొందుతున్నాడు విరాట్‌ కోహ్లీ. అతడు సాధించిన ఘనతలే ఇందుకు కారణం. మొత్తంగా 71 సెంచరీలతో పాటు మరెన్నో రికార్డులు అతడి సొంతం. అంతకుముందు 2008లో అండర్‌-19 జట్టును కూడా విజయవంతంగా నడిపించి ప్రపంచకప్‌ సాధించిపెట్టాడు. ఆపై అదే ఏడాది సీనియర్‌ జట్టులోకి అడుగుపెట్టాడు. అయితే అప్పుడు సెలెక్టర్ల ఛైర్మన్‌గా ఉన్న మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్.. యువ కోహ్లీని భారత జట్టుకు ఎందుకు ఎంపిక చేశాడో తాజాగా వివరించాడు.

‘2008లో న్యూజిలాండ్‌-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌కు భారత్‌-ఎ జట్టుకు మొదటిసారి కోహ్లీని ఎంపిక చేశాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మేం మాత్రం 23 ఏళ్లలోపు ఉన్న యువ ఆటగాళ్లనే ఎంపిక చేశాం. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన పలువురు అనుభవమున్న బౌలర్లు న్యూజిలాండ్‌ జట్టులో ఉన్నారు. ఆ మ్యాచ్‌లో ఆ జట్టు నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఛేదించాల్సి ఉంది. ఓపెనింగ్‌కి దిగుతావా అని కోహ్లీని అడిగా. అందుకు అతడు ఓకే అని సమాధానం చెప్పాడు. ఆపై సెంచరీ సాధించి జట్టును గెలిపించాడు’ అని మాజీ క్రికెటర్‌ డబ్ల్యూవీ రామన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో వెంగ్‌సర్కార్ నాటి విషయాలను గుర్తుచేసుకున్నాడు.

‘విరాట్‌ అద్భుతంగా ఆడాడు. 123 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు. కోహ్లీ ప్రతిభతోపాటు పరిణతి చెందాడని అప్పుడే గుర్తించా. అండర్‌-16తోపాటు అండర్‌-19 జట్ల తరఫున ఆడుతున్నప్పటి నుంచి అతడిని నేను చూస్తున్నా. టీమ్‌ఇండియాకు ఆడేందుకు విరాట్‌ సిద్ధంగా ఉన్నాడని, అతడి ఎంపిక చేయాలని అప్పుడే అనుకున్నాం. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు ఎంపిక చేసి అతడి ప్రతిభకు మెరుగులుదిద్దాం’ అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని