Archer Sheetal Devi: నీకు నచ్చిన కారు ఎంచుకో ‘బంగారు’ తల్లీ.. ఆర్చర్‌ శీతల్‌ దేవికి ఆనంద్‌ మహీంద్రా ఆఫర్‌!

Archer Sheetal Devi: పారా ఆసియా క్రీడల్లో శీతల్‌ దేవి అదరగొట్టింది. రెండు చేతులు లేని ఈ ఆర్చర్‌ రెండు పసిడి పతకాలతో పాటు ఓ రజతం నెగ్గి రికార్డు సృష్టించింది.

Updated : 29 Oct 2023 12:42 IST

Archer Sheetal Devi | ముంబయి: ప్రతిభను గుర్తించడంలో మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ముందుంటారు. గతంలో ఆయన పలుసార్లు క్రీడాకారులు, సామాన్యుల్లోని ప్రతిభను గుర్తించి బహుమానాలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన పారా ఆసియా క్రీడ (Asian Para Games)ల్లో తనదైన ప్రతిభతో సత్తా చాటిన శీతల్‌ దేవి (Archer Sheetal Devi)కి సైతం ప్రత్యేక కారును బహూకరిస్తామని మాటిచ్చారు. తమ కంపెనీ అందిస్తున్న కార్లలో దేన్నైనా ఆమె ఎంచుకోచ్చవని ఆఫర్‌ ఇచ్చారు. దాన్ని ఆమె ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది అందజేస్తామని హామీ ఇచ్చారు.

పారా ఆసియా క్రీడ (Asian Para Games)ల్లో శీతల్‌ దేవి (Archer Sheetal Devi) ఆర్చరీలో పలు విభాగాల్లో భారత్‌కు మూడు పతకాలు (2 స్వర్ణం, 1 రజతం) సాధించి పెట్టింది. ఆమె స్ఫూర్తి, ప్రతిభకు మంత్రముగ్ధుడైన ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ప్రశంసలు కురిపిస్తూ.. శీతల్‌ జీవిత కథను చెప్పే ఓ ప్రత్యేక వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఆమె ప్రతిఒక్కరికీ ఒక టీచర్‌ అని వ్యాఖ్యానించారు. ఇకపై తాను చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదు చేయబోనని తెలిపారు. పరోక్షంగా ఆమెకు ఉన్న అవరోధాల ముందు మన సమస్యలు చాలా చిన్నవని చెప్పకనే చెప్పారు. వాటన్నింటినీ సునాయాసంగా అధిగమించి పతకాలు నెగ్గిన తీరుకి మహీంద్రా మంత్రముగ్ధులయ్యారు.

పారా ఆసియా క్రీడ (Asian Para Games)ల్లో శీతల్‌ దేవి (Archer Sheetal Devi) అదరగొట్టింది. రెండు చేతులు లేని ఈ ఆర్చర్‌ ఈ క్రీడల్లో రెండు పసిడి పతకాలతో రికార్డు సృష్టించింది. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అలీమ్‌ సహిదా (సింగపూర్‌)ను ఓడించి పసిడి సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ టీమ్‌లో స్వర్ణం గెలిచింది. ఈ జమ్ముకశ్మీర్‌ ఆర్చర్‌ ఒకే క్రీడల్లో రెండు పసిడి పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా ఘనత సాధించింది. మహిళల డబుల్స్‌లోనూ శీతల్‌ (Archer Sheetal Devi) రజతం గెలిచింది. మొత్తంగా హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడ (Asian Para Games)ల్లో మూడు పతకాలు సాధించింది.

ఆమె ఓ అద్భుతం..

విలువిద్యలో ఆర్చర్లు విల్లుని ఒక చేత్తో పట్టుకుని.. మరో చేత్తో బాణాలు సంధిస్తారు. అలాంటిది రెండు చేతులు లేకుండా బాణాలు వేయడమంటే! ఆ ఊహే కష్టంగా ఉంది కదా! కానీ శీతల్‌ దేవి (Archer Sheetal Devi) దీన్ని నిజం చేసింది. రెండు చేతులు లేకపోయినా ఈ జమ్ముకశ్మీర్‌ అమ్మాయి కాళ్లనే చేతులుగా చేసుకుని పతకాలు కొల్లగొట్టింది. ప్రపంచంలో ప్రస్తుతం రెండు చేతులు లేకుండా పోటీపడుతున్న ఏకైక ఆర్చర్‌ శీతలే (Archer Sheetal Devi). 16 ఏళ్ల శీతల్‌ అసలు విల్లు పట్టడమే గొప్ప విషయం. పేద కుటుంబంలో పుట్టిన ఆమెకు ఫొకోమేలియా అనే రుగ్మత కారణంగా చేతులు ఎదగలేదు. అయినా కాళ్లతోనే పనులు చేసుకోవడం నేర్చుకుంది. భారత సైన్యం పెట్టిన ఓ క్రీడా శిబిరంలో పాల్గొనడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆటలపై ఆసక్తి పెంచుకున్న శీతల్‌.. ఆర్చరీని ఇష్టపడింది.

కోచ్‌ కుల్‌దీప్‌ వేద్వాన్‌ శిక్షణలో ఓనమాలు నేర్చుకున్న శీతల్‌ దేవి (Archer Sheetal Devi)... రెండు చేతులు లేకపోయినా కాళ్లతోనే బాణాలు వేయడం సాధన చేసింది. నెమ్మదిగా సాధారణ ఆర్చర్లతో పోటీపడే స్థాయికి ఎదిగిన ఆమె గుజరాత్‌లో జరిగిన అండర్‌-18 టోర్నీలోనూ పాల్గొని సత్తా చాటింది. చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన ఐరోపా పారా ఆర్చరీ కప్‌లో రజతం గెలవడం శీతల్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే జోరుతో పిల్సన్‌లో జరిగిన ప్రపంచ పారా ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది ఈ ఆర్చర్‌. 2012 పారాలింపిక్స్‌లో రెండు చేతులు లేకపోయిన ఆర్చరీలో రజతం నెగ్గిన మాట్‌ సుట్జ్‌మ్యాన్‌... శీతల్‌ (Archer Sheetal Devi) టెక్నిక్‌ను మెరుగుపరిచింది. తాజాగా పారా ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలతో సహా మూడు పతకాలు నెగ్గి శీతల్‌ మరోసారి సత్తా చాటింది. 2024 పారిస్‌ పారాలింపిక్స్‌లోనూ అదరగొట్టి పతకం గెలవాలనేది శీతల్‌ లక్ష్యం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని