రన్నరప్‌గా షన్విత జోడీ

ఐటీఎఫ్‌ జూనియర్‌ సర్క్యూట్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్‌గా నిలిచింది.

Published : 28 Apr 2024 01:47 IST

కిగాలి: ఐటీఎఫ్‌ జూనియర్‌ సర్క్యూట్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్‌గా నిలిచింది. అండర్‌-18 డబుల్స్‌ తుది పోరులో షన్విత-లారా చానోవా (చెక్‌) జంట 3-6, 1-6తో సెల్లా జిమోవిచ్‌ (సెర్బియా)-నేహా కృష్ణన్‌ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. సెమీస్‌లో షన్విత ద్వయం 6-2, 6-3తో సిల్వియా కాలిమన్‌ (స్పెయిన్‌)-కరీనా వోజ్నియాక్‌ (పోలెండ్‌) జంటపై గెలిచింది. పటాన్‌చెరుకు చెందిన షన్విత.. విజయ్‌ టెన్నిస్‌ అకాడమీలో శిక్షణ పొందుతోంది.


ప్రపంచకప్‌ జట్టు ఎంపిక ఆలస్యం

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత   జట్టు ప్రకటన ఆలస్యం కానుంది. శనివారం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దిల్లీలో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడగా.. సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ కూడా   ఆ నగరంలోనే ఉన్నాడు. ఇదే రోజు సెలక్షన్‌ కమిటీ సమావేశం జరుగుతుందని.. అందులో రోహిత్‌తో పాటు కోచ్‌ ద్రవిడ్‌ కూడా పాల్గొంటాడని.. జట్టును కూడా ప్రకటిస్తారని వార్తలొచ్చాయి. కానీ జట్టు ఎంపికకు ఇంకా సమయం పడుతుందని.. తుది గడువు అయిన మే 1లోపు ఎప్పుడైనా జట్టును ప్రకటించవచ్చని తెలిసింది. ఐపీఎల్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనను మరింతగా పరిశీలించేందుకే సెలక్టర్లు సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే  టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 2న ఆరంభమవుతుంది.


ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించాలంటే..

దిల్లీ: భారత యువ సంచలనం గుకేశ్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ మధ్య ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించాలని ఆశిస్తున్న భారత్‌ అందుకోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫిడె ఈ విషయం వెల్లడిస్తూ.. ఈవెంట్‌ నిర్వహణకు బిడ్‌లు ఆహ్వానించింది. టోర్నీ బడ్జెట్‌ కింద సుమారు రూ.71 కోట్లు ఖర్చయితే.. నిర్వహణ వ్యయం పేరిట ఫిడేకు రూ.9 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గుకేశ్‌-డింగ్‌ లిరెన్‌ మధ్య ఈ 14 మ్యాచ్‌ల ఈ సమరం నవంబర్‌ 20-డిసెంబర్‌ 15 మధ్య జరిగే అవకాశం ఉంది. విజేతకు ప్రైజ్‌మనీగా రూ.20 కోట్లు దక్కుతాయి. 2023తో పోలిస్తే మూడు కోట్లు ఎక్కువ. గుకేశ్‌-లిరెన్‌ మధ్య ప్రపంచ చెస్‌ టైటిల్‌ పోరుకు ఆతిథ్యమిచ్చేందుకు బిడ్‌ దాఖలు చేస్తామని అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) కొత్త కార్యదర్శి దేవ్‌ పటేల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కితే.. నిరుడు చెస్‌ ప్రపంచకప్‌ జరిగిన గుకేశ్‌ సొంత నగరం చెన్నైలోనే ఈ ఈవెంట్‌ను కూడా నిర్వహించే అవకాశాలున్నాయి.


భారత్‌కు మరో 5 పతకాలు

ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌

దిల్లీ: ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. శనివారం ఈ పోటీల్లో భారత్‌కు మరో అయిదు పతకాలు దక్కాయి. మహిళల   5 వేల మీట ట్రాక్‌ రేసులో ఏక్తా డే   (16:49.70 సె) రజతం నెగ్గగా.. సునీతా దేవి (16:52.54 సె) కాంస్యం సాధించింది. పురుషుల 3 వేల మీటర్ల పరుగులో గౌరవ్‌ భాస్కర్‌ (8:31.20 సె) రజతం, వికాస్‌ (8:33.00 సె) కాంస్యం గెలిచారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఉన్నతి అయ్యప్ప (13.65 సె) కాంస్యం సాధించింది.


ఆర్యన్‌, జితేశ్‌ విజయాలు

అస్తానా (కజకిస్థాన్‌): ఆసియా అండర్‌-22, యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు ఆర్యన్‌, జితేశ్‌ శుభారంభం చేశారు. శనివారం ఆరంభమైన టోర్నీలో ఆర్యన్‌ 51 కేజీల విభాగంలో 5-0తో జో హైయాన్‌ (దక్షిణ కొరియా)ను చిత్తు చేశాడు. జితేశ్‌ సైతం 5-0తోనే చెన్‌ యు (చైనీస్‌ తైపీ)ని మట్టికరిపించాడు. మిగతా భారత బాక్సర్లు ఆదివారం తమ తొలి బౌట్‌ ఆడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని