Tennis News: రోజర్‌ ఫెదరర్‌లా వీడ్కోలు మ్యాచ్‌ ఆడేందుకు అర్హుడిని కాను: ఆండీ ముర్రే

స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ ఇటీవలే ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. లావెర్‌ కప్‌లో చివరిసారిగా రోజర్‌తో కలిసి...

Published : 26 Sep 2022 20:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ ఇటీవలే ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. లావెర్‌ కప్‌లో చివరిసారిగా రోజర్‌తో కలిసి స్పెయిన్‌ బుల్‌ రఫేల్ నాదల్‌ బరిలోకి దిగాడు. అయితే సోక్, టియాఫో జోడీ చేతిలో 6-4, 6(2)-7, 9-11 తేడాతో ‘ఫెదల్’ జోడీ ఓడింది. అయితే కెరీర్‌లో ఆఖరిగా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ మ్యాచ్‌ ఆడిన తర్వాత ఫెదరర్‌, రఫేల్‌ సహా టెన్నిస్‌ అభిమానులు కన్నీళ్లు పెట్టుకొన్నారు. ఈ క్రమంలో బ్రిటన్‌ టెన్నిస్‌ ఆటగాడు ఆండీ ముర్రే కూడా ‘భవిష్యత్తు మరింత ఆనందంగా ఉండాలని’ ఆకాంక్షిస్తూ ఫెదరర్‌కు శుభాకాంక్షలు చెప్పాడు. 

రోజర్‌కు ప్రొఫెషనల్‌గా చివరి మ్యాచ్‌ కావడంతో రఫేల్‌ నాదల్‌తో కలిసి బరిలోకి దిగడం విశేషం. అయితే ఇలాంటి అద్భుత వీడ్కోలు మ్యాచ్‌ ఆడేందుకు తనకు అర్హత లేదని ఆండీ ముర్రే పేర్కొన్నాడు. ఫెదరర్‌ చివరి మ్యాచ్‌ను చూడటమే ప్రత్యేకమని తెలిపాడు. ‘‘రిటైర్‌మెంట్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు.. అయితే నేను వీడ్కోలు పలికేటప్పుడు ఇలాంటి స్పెషల్‌ మ్యాచ్‌కు అర్హత లేదని మాత్రం తెలుసు. దీనికి రోజర్‌ మాత్రమే అర్హుడు. అయితే ఇలా దిగ్గజం చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడమే ప్రత్యేకతను సాధించినట్లు. నేను కూడా తప్పకుండా రిటైర్‌మెంట్‌ గురించి ప్రకటిస్తా. కానీ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను. ఇప్పటికీ కాంపిటేటివ్ టెన్నిస్‌ ఆడతా. శారీరకంగానూ బాగానే ఉన్నా. అయితే విజయం వరకు వచ్చి ఆఖర్లో ఓడిపోతున్న సందర్భాల నుంచి బయటపడాలి’’ అని ఆండీ ముర్రే తెలిపాడు. లావెర్‌ కప్‌లో ఆండీ ముర్రే 7-5, 3-6, 7-10 తేడాతో అలెక్స్ డి మినౌర్‌ చేతిలో ఓడిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని