WTC Final: నేనంటే ఇష్టం లేదు కదా..? ‘ఓవల్‌ పిచ్‌ డాక్టర్‌’తో అశ్విన్‌ చిట్‌చాట్‌

ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ (WTC Final) జరగనుంది. పిచ్‌ పరిస్థితిపై అనేక రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, టీమ్‌ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ మాత్రం పిచ్‌ ఎలా ఉండనుందో రాబట్టాడు.

Published : 06 Jun 2023 21:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం (WTC Final) సర్వం సిద్ధమైంది. ఇంగ్లాండ్‌లో ఓవల్ మైదానం వేదిక. పిచ్‌ ఎలా ఉంటుందనే ఆందోళన టీమ్‌ఇండియా అభిమానుల్లో నెలకొంది. పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉంటే ఆసీస్‌ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు తట్టుకోగలరా..? అనే  సందిగ్ధంలో ఉన్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ పిచ్‌ రిపోర్ట్‌ గురించి ఓ కీలక వ్యక్తితో మాట్లాడాడు. ఇంతకీ అతడెవరనేగా మీ అనుమానం. ఓవల్‌ మైదానం ‘పిచ్‌ డాక్టర్’ లీజ్‌. ఈయనదే పిచ్‌ను తయారు చేయడంలో కీలక పాత్ర. పిచ్‌ ఎలా స్పందిస్తుంది..? దేనికి అనుకూలంగా ఉంటుందనే విషయాలను అశ్విన్‌ రాబట్టాడు.  ఈ వీడియోను తన యూట్యూబ్‌లో ఉంచాడు. వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇలా.. 

అశ్విన్‌: మన దగ్గర ‘పిచ్‌ డాక్టర్‌’ ఉన్నారు. ఓవల్‌ మైదానం పిచ్‌ బాధ్యతలు ఈయనే చూసుకుంటాడు. హాయ్‌, లీజ్‌ ఎలా ఉన్నారు? 

లీజ్‌: నేను చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు రవి? 

అశ్విన్‌: ఐయామ్‌ గుడ్. నన్ను పక్కకు ఎందుకు తోస్తావు? (సరదాగా). ఇంకేంటి సంగతులు? 

లీజ్‌: ఓవల్ పిచ్‌ చాలా అద్భుతంగా ఉంది. అంతకంటే విషయమేమీ లేదు. 

అశ్విన్‌: నువ్వు ఎప్పుడూ మంచి పిచ్‌లనే తయారు చేయిస్తావు. అయితే, ఇవాళ మా వాళ్లు కొందరికి ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బంతులు తాకాయి. మ్యాచ్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందా..? 

లీజ్‌: బౌన్స్‌ గురించి అడుగుతున్నావా..? ఇవాళ బంతి బాగా బౌన్స్‌ అయిందా..? 

అశ్విన్‌: అవును. ఇవాళ బంతి బాగా బౌన్స్‌ అయింది. అసలు నేనంటే నీకు ఇష్టం లేదు కదా..? అస్సలు స్పిన్‌కు సహకరించలేదు. కరక్టేనా..? 

లీజ్‌: నువ్వు గతంలో ఇక్కడ సర్రే కౌంటీ తరఫున ఆడావు. ఎన్ని వికెట్లు తీశావు? 

అశ్విన్‌: 8 వికెట్లు తీశా. (మనలో మన మాట).. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ గురించి నీ అభిప్రాయం ఏంటి..? ‘బౌన్సీ బ్రెట్‌ లీ పిచ్‌’ను మేం ఆశించొచ్చా..?

లీజ్‌: తప్పకుండా బౌన్స్‌ ఉంటుంది. నేను దానికి గ్యారంటీ ఇవ్వగలను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని