Shami: ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్‌ అయినా.. అతడి బౌలింగ్‌ ఎదుర్కొనే సాహసం చేయరు: గౌతమ్‌ గంభీర్‌

టీమ్ఇండియా సీనియర్ పేసర్‌ మహమ్మద్‌ షమిపై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోని ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్‌ అయినా.. షమి బౌలింగ్‌ ఎదుర్కొనే సాహసం..

Updated : 13 Jan 2022 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్ఇండియా సీనియర్ పేసర్‌ మహమ్మద్‌ షమిపై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోని ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్‌ అయినా.. షమి బౌలింగ్‌ ఎదుర్కొనే సాహసం చేయరని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో షమి ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

‘ఈ సిరీస్‌లో షమి గొప్పగా బౌలింగ్‌ చేస్తున్నాడు. మెరుపు వేగంతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. కచ్చితత్వంతో సరైన లెంగ్త్‌లో బంతులేస్తూ బ్యాటర్లకు సవాల్‌ విసురుతున్నాడు. ప్రపంచంలోని ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్‌ను అయినా అడగండి. అతడు ఎంత ప్రమాదకర బౌలరో చెబుతారు. ఎవరూ అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనే సాహసం చేయరు. అతడు వేసే బంతులు వికెట్లకు చాలా సమీపంలోంచి వెళ్తుంటాయి. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి ఆటగాళ్లను భయపెట్టగలడు. అందుకే, ప్రపంచంలోని అత్యుత్తమ  టెస్టు బౌలర్లలో షమి ఒకడిగా నిలిచాడు’ అని గంభీర్‌ ప్రశంసించాడు.

ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించడంలో షమి కీలకంగా వ్యవహరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. డ్రాగా ముగిసిన రెండో టెస్టులో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కేప్‌టౌన్‌లో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకోవాలని చూస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైన భారత జట్టు.. దక్షిణాఫ్రికాను 210 పరుగులకే పరిమితం చేసింది. దీంతో భారత్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. రెండో రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని