Cricket News : కరోనా కారణంగా తగ్గిపోతున్న ‘క్రికెట్’ చిన్నారులు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి దెబ్బకు అనేక రంగాలు కుదేలయ్యాయి. కోట్ల మంది జీవితాలపై తీవ్ర ప్రభావం..

Published : 04 Aug 2022 15:30 IST

ఆందోళనలో ఆస్ట్రేలియన్‌ క్రికెట్

(ఫొటో సోర్స్‌: ఆస్ట్రేలియన్ క్రికెట్ ట్విటర్)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి దెబ్బకు అనేక రంగాలు కుదేలయ్యాయి. కోట్ల మంది జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక క్రికెట్‌ మీద కూడానూ ఎఫెక్ట్‌ చూపింది. మ్యాచ్‌ల నిర్వహణ సంగతి పక్కనపెడితే.. ఆటను తమ కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య తగ్గిపోయిందని ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొవిడ్‌తో ‘ఒక తరం’  చేజారిపోతోందని ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత సీజన్‌లో జూనియర్ ప్రోగ్రామ్స్‌లో మొదటిసారి పాల్గొనే చిన్నారుల సంఖ్య 15,000కు పడిపోయిందని ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ తెలిపింది. లాక్‌డౌన్స్‌ తర్వాత క్లబ్‌ ప్లేయర్స్‌ అధికంగానే తిరిగి వస్తున్నారని, అయితే 12 ఏళ్లలోపు చిన్నారుల రాక మాత్రం తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేసింది. 

‘‘5-12 ఏళ్ల చిన్నారులు అధికంగా క్రికెట్‌ను ఎంచుకునేలా చేయడమే ఆస్ట్రేలియన్ క్రికెట్‌ వ్యూహం. క్రికెట్ అనేది చాలా కఠినమైన గేమ్‌. అందుకే చిన్న వయస్సులోనే వారిలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. 12 సంవత్సరాల లోపు క్రికెట్‌కు సంబంధించిన అంశాలను నేర్చుకోకపోతే.. టీనేజీ, కాస్త పెద్దయ్యాక క్రికెట్‌ ఆడాలనే ఆసక్తి సన్నగిల్లే అవకాశం ఉందని మా సర్వేలో తేలింది. అందుకోసం మేం కొన్ని ప్రణాళికలను తయారు చేస్తున్నాం. చిన్నారులను క్రికెట్ వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాం. లేకపోతే కొత్తగా వచ్చే తరాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒక సంవత్సరం మిస్‌ అయిపోయాం. రాబోయే 12 నెలల్లో సమస్యకు పరిష్కారం కనుగొంటాం’’ అని ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ కమ్యూనిటీ క్రికెట్ హెడ్‌ జేమ్స్ అలాసోప్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని