Sachin-Lara: ఆసీస్‌ వాళ్లకు లారానే బెస్ట్‌.. కానీ, అందనంత ఎత్తులో సచిన్‌: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్

సచిన్‌ తెందూల్కర్‌, బ్రియాన్‌ లారా దాదాపు ఒకే సమయంలో క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అయితే, లారా త్వరగానే కెరీర్‌ను ముగించగా.. సచిన్‌ మాత్రం రెండు దశాబ్దాలకుపైగా క్రికెట్‌ను శాసించాడు. 

Published : 01 Jan 2024 10:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ క్రికెట్‌లో సచిన్‌ తెందూల్కర్‌, బ్రియాన్‌ లారా పేర్లు తెలియని వారుండరు. 90ల్లో క్రికెట్‌ను శాసించిన దిగ్గజ క్రికెటర్లు వీరు. ఒకరు భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే.. మరొకరు వెస్టిండీస్‌ తరఫున రికార్డులు సృష్టించారు. వీరిద్దరిలో ఎవరు ఉత్తమం అంటే.. అందరూ సచిన్‌ (Sachin Tendulkar) పేరే చెబుతారు. కానీ, ఆసీస్‌ ఆటగాళ్లు, అభిమానులు మాత్రం బ్రియాన్‌ లారానే (Brian Lara) ఉత్తమమని భావిస్తారట. ఇదే విషయంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌, దిగ్గజం అలీ బచర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘సచిన్‌ ఓ అద్భుతం. అతడు వేరే ప్లానెట్‌ నుంచి వచ్చాడా? అనిపిస్తుంది. అతడు ఆడిన చాలా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు చూశా. ఇక వ్యక్తిగతంగానూ ఉత్తమం. ఎప్పుడైనా మీరు మైదానంలో అతడు వాగ్వాదం చేయడం చూశారా? అందుకే, అతడు అత్యుత్తమం, సంతోషంగా ఉండే వ్యక్తి. కానీ, చాలామంది ఆస్ట్రేలియా అభిమానులు సచిన్‌ కంటే లారా ఉత్తమమని భావిస్తుంటారు. నా వరకు అవన్నీ చెత్తమాటలు అంటాను. ఎందుకంటే లారా కేవలం 40 లక్షల మంది ముందు మాత్రమే మ్యాచ్‌లు ఆడాడు. కానీ, సచిన్‌ 140 కోట్ల మంది అభిమానుల కోసం భారత్‌ తరఫున బరిలోకి దిగాడు. ఇలాంటి సమయంలో ఒత్తిడి ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో ఊహించగలరా? అందుకే, సచిన్‌ కంటే లారా ఉత్తమం అని నాకు చెప్పొద్దు’’ అని బచర్‌ తెలిపాడు. 

మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ తెందూల్కర్‌ పేరిట చాలా రికార్డులు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌. టెస్టుల్లో 15,921 పరుగులు, వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వన్డే ప్రపంచ కప్‌లను ఆరుసార్లు ఆడాడు. 2011 విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బ్రియాన్‌ లారా కూడా టెస్టుల్లో అద్భుతమైన రికార్డులు సాధించాడు. టెస్టుల్లో క్వాడ్రపుల్‌ (400) బాదిన క్రికెటర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని