BAN vs NZ: న్యూజిలాండ్‌ విజయలక్ష్యం 246

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 245 పరుగులు చేసింది.

Published : 13 Oct 2023 18:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్‌ (66; 75 బంతుల్లో 6×4,2×6) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్‌  షకీబ్‌ అల్‌ హసన్‌ (40), హసన్‌ మిరాజ్‌ (30) ఫర్వాలేదనిపించారు. మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు. చివర్లో మహ్మదుల్లా (41*) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో బంగ్లా మంచి స్కోరే చేసింది.
 
బ్యాటింగ్‌ ప్రారంభించిన బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ డకౌట్‌ అయ్యాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే మత్‌ హెన్రీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  తొలిడౌన్‌లో వచ్చిన  హసన్‌ మిరాజ్‌తో కలిసి, మరో ఓపెనర్‌ తన్‌జిద్‌ హసన్‌ ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే, జట్టు స్కోరు 40 పరుగుల వద్ద ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి హసన్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే మిరాజ్‌ కూడా ఫెర్గూసన్‌ బౌలింగ్‌లోనే హెన్రీ చేతికి చిక్కాడు. దీంతో జట్టు ఒక్కసారిగా కష్టాల్లోకి పడింది.  

కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌,  రహీమ్‌ ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. జోరు పెంచిన ఈ జోడీని ఫెర్గూసన్‌ విడగొట్టాడు. జట్టు స్కోరు  152 పరుగుల వద్ద కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి షకీబ్‌ అల్‌ హసన్‌ పెవిలియన్‌కు చేరాడు. కొద్దిసేపటికే 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెన్రీ బౌలింగ్‌లో రహీమ్‌ వెనుదిరిగాడు. చివర్లో మహ్మదుల్లా బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో బంగ్లా మంచి స్కోరు చేసినట్లయింది.  కివీస్‌ బౌలర్లలో ఫెర్గుసన్‌ 3 వికెట్లు తీయగా.. ట్రెంట్‌ బౌల్ట్‌, మత్‌ హెన్రీ చెరో 2 వికెట్లు, మిచెల్‌ శాట్నర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని