NED vs BAN: నెదర్లాండ్స్‌ ఆలౌట్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?

ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. 

Updated : 28 Oct 2023 17:58 IST

కోల్‌కతా: ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (68; 89 బంతుల్లో 6 ఫోర్లు), వెస్లీ బరేసి (41; 41 బంతుల్లో 8 ఫోర్లు) రాణించగా.. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (35; 61 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్ (3), మాక్స్‌ ఔడౌడ్ (0) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కోలిన్ అకెర్మాన్‌ (15), బాస్‌ డీ లీడే (17) పరుగులు చేశారు. చివర్లో వాన్‌ బీక్‌ (23; 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో నెదర్లాండ్స్‌ ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షోరిపుల్ ఇస్లామ్ 2, ముస్తాఫిజుర్ రహ్మన్‌ 2, మెహదీ హసన్ 2, షకీబ్‌ అల్ హసన్‌ ఒక వికెట్ పడగొట్టారు.

ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే నెదర్లాండ్స్‌కు వరుసగా రెండు షాక్‌లు తగిలాయి. రెండో ఓవర్‌లో ఓపెనర్ విక్రమ్‌ను తస్కిన్‌ను వెనక్కి పంపాడు. అతడు షకీబ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. షోరిపుల్ వేసిన తర్వాతి ఓవర్‌లో మాక్స్‌ ఔడౌడ్‌ తంజిద్‌ హసన్‌కు చిక్కాడు. ఈ క్రమంలో అకెర్మాన్‌తో జట్టుకట్టిన బరేసి నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ క్రమంలో అర్ధ శతకం దిశగా సాగుతున్న బరేసిని ముస్తాఫిజుర్‌ ఔట్ చేశాడు. షకీబ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో అకెర్మాన్‌ కూడా పెవిలియన్ బాటపట్టాడు. కాసేపు నిలకడగా ఆడిన బాస్‌ డి లీడే.. తస్కిన్ బౌలింగ్‌లో ముస్తాఫిజుర్‌కు చిక్కాడు. దీంతో 107 పరుగులకే నెదర్లాండ్స్ సగం వికెట్లు కోల్పోయింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న ఎడ్వర్డ్స్‌.. సిబ్రాండ్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ నిలకడగా ఆడి ఆరో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఎడ్వర్డ్స్‌, సిబ్రాండ్ వరుస ఓవర్లలో ఔటయ్యారు. తర్వాత వచ్చిన షరీజ్ (6), ఆర్యన్‌దత్ (9) పరుగులు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని