SL vs BAN: శ్రీలంకపై బంగ్లాదేశ్‌ విజయం

వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ ఎట్టకేలకు రెండో విజయాన్ని నమోదు చేసింది. దిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 06 Nov 2023 22:59 IST

దిల్లీ: వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ ఎట్టకేలకు రెండో విజయాన్ని నమోదు చేసింది. దిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిజామ్‌ ఉల్ హుస్సేన్‌ (90; 101 బంతుల్లో 12×4), షకీబ్‌ అల్‌ హసన్‌ (82; 65 బంతుల్లో 12×4, 2×6) అర్ధశతకాలతో చెలరేగిన వేళ... 41.1 ఓవర్లలోనే బంగ్లాదేశ్‌ లక్ష్యాన్ని పూర్తి చేసింది. శ్రీలంక బౌలర్లలో మధుశనక 3 వికెట్లు పడగొట్టగా, మహీశ్‌ తీక్షణ, మ్యాథ్యూస్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్‌ తొలి బంతికే ఓపెనర్‌ తన్జిద్‌ హసన్‌  (9) ఔటయ్యాడు. మధుశనక బౌలింగ్‌లో పాథుమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  అక్కడికి నాలుగు ఓవర్ల వ్యవధిలోనే మరో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (23) కూడా మధుశనక బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరాడు.  దీంతో ఒక్కసారిగా జట్టు కష్టాల్లో పడినట్లయింది. అయితే, తొలి డౌన్‌లో వచ్చిన  నిజామ్‌ ఉల్‌ హస్సేన్‌,  షకీబ్‌ అల్‌ హసన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ప్రారంభంలో ఆచితూచి ఆడిన వీరిద్దరూ క్రమంగా చెలరేగిపోయారు. క్రీజులో నిలదొక్కుకుంటూ వరుస బౌండరీలు బాదారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మ్యాథ్యూస్‌ విడగొట్టాడు. జట్టు స్కోరు 210 పరుగుల వద్ద హుస్సేన్‌ బౌల్డయ్యాడు. అదే ఓవర్‌లో షకీబ్‌ కూడా  అసలంకకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన  మహ్మదుల్లాహ్‌ (22), ముష్ఫికర్‌ రహీమ్‌ (10) పరుగులు చేయడంతో బంగ్లా విజయం లాంఛనమైపోయింది. హిడ్రోయ్‌ (15*),హసన్‌ షకీబ్‌ (5*) నాటౌట్‌గా నిలిచారు. 

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక  49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. అసలంక (108; 105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో రాణించాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు ఆరంభంలోనే కుశాల్‌ పెరీరా (4) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కుశాల్‌ మెండిస్‌ (19)తో కలిసి ఓపెనర్‌ నిశంక ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆ తర్వాత నిశంక (41) కూడా ఔట్‌ కావడంతో సమర విక్రమ (41), అసలంక కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. ఏంజిలో మాథ్యూస్‌ (0) ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే ‘టైమ్‌డ్‌ ఔట్‌ (timed out)’గా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో కొద్దిసేపు మైదానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ధనంజయ డిసిల్వా (34), తీక్షణ (22), రజిత (0), చమీర (4), మధుశనక (0*) పెద్దగా మెరుపులేమీ మెరిపించలేదు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తంజీమ్‌ మూడు వికెట్లు తీయగా... షోరిఫుల్‌ ఇస్లామ్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. మెహిదీ హసన్‌ మిరాజ్‌కు ఒక వికెట్‌ దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని