Benstokes: విరాట్‌ కోహ్లీ గొప్ప ఆటగాడిగా నిలిచిపోతాడు: బెన్‌స్టోక్స్

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ అతిగొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిపోతాడని ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. సోమవారం అతడు వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు...

Published : 20 Jul 2022 01:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిపోతాడని ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. సోమవారం అతడు వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు పోస్టు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దానికి స్పందించిన కోహ్లీ.. ‘నేను ఆడిన ప్రత్యర్థుల్లో అత్యంత పోటీ ఇచ్చిన క్రికెటర్‌ నువ్వే’ అంటూ కామెంట్‌ చేశాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం దక్షిణాఫ్రికాతో ఆడే తన చివరి వన్డేకు ముందు స్టోక్స్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన రిటైర్మెంట్‌ విషయానికి స్పందించిన విరాట్‌ను అతడు మెచ్చుకున్నాడు.

‘ఫార్మాట్లకు అతీతంగా కోహ్లీ గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిపోతాడు. అతడితో ఆడిన ప్రతిసారీ ఆస్వాదించాను. ఆటపట్ల అతడు చూపించే శ్రద్ధ, అంకితభావం నన్నెప్పుడూ ఆకట్టుకుంటాయి. కోహ్లీ లాంటి ఆటగాడితో ఆడితేనే టాప్‌ లెవెల్‌ ఆటంటే ఏంటో అర్థమవుతుంది. నా రిటైర్మెంట్‌ పోస్టుపై అతడు స్పందించడం ముచ్చటేసింది’ అని స్టోక్స్‌ ప్రశంసలు కురిపించాడు. అయితే, ఈ ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌ ఆడేటప్పుడే ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తొలి వన్డే తర్వాత తాను జట్టుకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాననే భావన కలిగిందని, దాంతో పాటు ఇతరుల అవకాశాలను కూడా తాను లాగేసుకుంటున్నట్లు అనిపించిందని స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని