Jasprit Bumrah: బుమ్రా రాకతో మా బలం పెరిగింది: భారత బౌలింగ్ కోచ్

కొంతకాలంగా వెన్నుగాయంతో బాధపడిన జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. 

Published : 14 Sep 2023 17:19 IST

ఇంటర్నెట్ డెస్క్: జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పునరాగమనంతో తమ పేస్ బౌలింగ్ యూనిట్ బలంగా మారిందని, వచ్చే నెలలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)నకు నలుగురు ఫాస్ట్ బౌలర్లు పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉండటం సంతోషకరమని భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే (Paras Mhambrey) అన్నాడు. వెన్నుగాయంతో బాధపడిన బుమ్రా ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అక్టోబర్‌ 5 నుంచి స్వదేశంలో ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. 

బంగ్లాదేశ్‌తో సూపర్‌ మ్యాచ్‌.. రోహిత్, కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతి!

‘‘మేము ఎన్‌సీఏ నుంచి బుమ్రా పురోగతిని గమనిస్తున్నాం. ప్రస్తుతం అతడు జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. ఇప్పుడు మాకు నలుగురు నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇలాంటి బౌలింగ్ ఆప్షన్స్‌ ఉండటం బాగుంది. బుమ్రా, సిరాజ్‌, హార్దిక్‌లకు ఎక్కువ అవకాశాలిచ్చి షమిని పక్కన పెడుతున్నామని చర్చ జరుగుతోంది. దాంట్లో నిజం లేదు. షమి అనుభవజ్ఞుడు, దేశం కోసం ఎన్నోసార్లు అసాధారణ ప్రదర్శన చేశాడు. షమి లాంటి ఆటగాడిని పక్కనపెట్టడం అంత సులభం కాదు. మేం ఆటగాళ్లతో మాట్లాడాం. వారు మాపై విశ్వాసం. మేం ఏ నిర్ణయం తీసుకున్నా అది జట్టుకు ప్రయోజనం కోసమే అని ఆటగాళ్లకు తెలుసు.

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బౌలర్‌గా రాణించడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా. దీని కోసం మేం చాలా కాలం కృషి చేశాం. అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్‌ చేస్తున్నాం. హార్దిక్‌ ఫిట్‌గా ఉన్నాడని,  ఆశించిన మేరకు రాణిస్తాడని నిర్ధారించుకున్నాం. గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలడు. భిన్నమైన బౌలర్. అతడు మాకు వికెట్ టేకింగ్ బౌలర్‌’’ అని టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నాడు. ప్రస్తుతం ఆసియా కప్‌లో ఆడుతున్న హార్దిక్ పాండ్య పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. కీలకమైన సమయాల్లో వికెట్లు పడగొడుతున్నాడు. ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని