IPL: ఆడాలా వద్దా అనేది అప్పుడే నిర్ణయిస్తాం!

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడాలా వద్దా అనే విషయంపై ఇంకా చర్చించలేదని, తమ ఆటగాళ్లు ఈరోజే క్వారంటైన్‌ పూర్తిచేసుకొని కుటుంబాలతో కలిశారని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) సోమవారం పేర్కొంది...

Published : 01 Jun 2021 01:40 IST

సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడటంపై సీఏ

మెల్‌బోర్న్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడాలా? వద్దా అనే విషయంపై ఇంకా చర్చించలేదని, తమ ఆటగాళ్లు ఈరోజే క్వారంటైన్‌ పూర్తిచేసుకొని కుటుంబాలతో కలిశారని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) సోమవారం పేర్కొంది. సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఈరోజే బాధ్యతలు స్వీకరించిన నిక్‌హాక్లే.. సెప్టెంబర్‌లో యూఏఈలో నిర్వహించే మిగిలిన మ్యాచ్‌ల్లో ఆడే విషయంపై తమ ఆటగాళ్లతో చర్చించాల్సి ఉందన్నారు.

కరోనా వైరస్‌ కారణంగా ఇటీవల జరిగిన 14వ సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించడంతో అన్ని జట్ల ఆటగాళ్లు స్వస్థలాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ఇతర సిబ్బంది సుమారు 40 మంది స్వదేశం చేరుకునే వీలు లేకపోవడంతో మాల్దీవులకు వెళ్లారు. అనంతరం కంగారూలు విదేశీ ప్రయాణాలకు అనుమతించడంతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. అయితే, వాళ్లంతా మరో రెండు వారాలు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆ గడువు పూర్తి చేసుకొని తిరిగి కుటుంబసభ్యులతో కలిశారు.

‘ఒకసారి మేమంతా కలిస్తే అప్పుడు ఐపీఎల్‌ గురించి నిర్ణయం తీసుకునే వీలుంది. మా క్రికెటర్లు భారత్‌లో ఐపీఎల్‌ ఆడొచ్చాక ఇవాళే కుటుంబాలతో కలిశారు. ఇప్పుడు వారంతా తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకే మేం ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే మా జట్టు జులైలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. దాంతో త్వరలోనే జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఆటగాళ్లంతా కలుసుకుంటారు. అప్పుడు మేం మాట్లాడుకొని ఓ నిర్ణయం తీసుకుంటాం. అయితే, ఇదివరకు బయో బుడగలోకి వైరస్‌ ప్రవేశించడంతో కాస్త భయపడ్డారు. ఇప్పుడు ఇళ్లకు చేరడంతో సంతోషంగా ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసేందుకు ఎంత ఆశగానో ఎదురుచూశారు’ అని హాక్లే ఓ క్రీడాఛానెల్‌తో పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని