Cheteshwar Pujara: 100 టెస్టులాడినా.. 10వేల పరుగులు చేసినా.. రంజీల్లో అంతా ఒకటే: పుజారా

జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా (Cheteswar Pujara).. స్థానం చేజార్చుకుని రంజీల్లో కష్టపడుతున్నాడు. మళ్లీ టీమ్‌లోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు.

Published : 14 Feb 2024 11:58 IST

ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్‌లో దుమ్ము రేపుతున్న ఛెతేశ్వర్ పుజారా (Cheteswar Pujara) జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు. కానీ, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడివైపు చూడటం లేదు. యువకులకే అవకాశాలు ఇస్తూ వారికి పరీక్ష పెడుతున్నారు. 36 ఏళ్ల పుజారా మాత్రం నిరుత్సాహానికి గురి కావడం లేదు. వయసు అడ్డంకిగా మారదని.. తనకు త్వరలోనే అవకాశం వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

రంజీ కోసం ఎలా శ్రమించానంటే..

రంజీ ట్రోఫీకి ముందు ముంబయిలో క్లబ్‌ మ్యాచ్‌ ఆడా. ధవళ్ కులకర్ణి, సందీప్ శర్మ, శ్యామ్స్‌ ములాని వంటి బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించా. ప్రత్యర్థితో పోలిస్తే మా జట్టు కాస్త బలహీనంగా ఉంది. దీంతో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. ఆ మ్యాచ్‌లో మేం విజయం సాధించాం. నేను రంజీల్లో సౌరాష్ట్రకు ఆడటానికి కూడా కారణం ఇదే. నాకౌట్‌ దశకు క్వాలిఫై కావాలని భావించాం. క్లబ్‌, సస్సెక్స్, సౌరాష్ట్ర.. ఇలా ఏ జట్టు తరఫునైనా అదే ప్యాషన్‌తో ఆడతా. జాతీయ జట్టుకు ఆడటం ఎప్పటికీ గర్వకారణం. శ్రమిస్తూ ఉంటే తప్పకుండా మళ్లీ అవకాశం వస్తుందనే నమ్మకంతో ఉన్నా.

అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన తర్వాత..

క్రికెటర్‌గా ఎల్లవేళలా కొత్త శిఖరాలను చూస్తూనే ఉంటాం. కఠోర సాధన చేయాలి. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలి. గత ఏడాదిన్నర నుంచి స్వీప్ షాట్లు, రివర్స్ స్వీప్, లాఫ్టెడ్‌ షాట్లపై సాధన చేశా. ఇప్పుడీ రంజీ ట్రోఫీలో కఠిన పిచ్‌లపై ఆడాల్సి వచ్చింది. కొన్ని జట్లు 200 పరుగులకే ఆలౌట్‌ కావడం గమనార్హం. రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌లూ ముగిశాయి. నువ్వు 100 టెస్టులు ఆడినా.. పదివేల పరుగులు చేసినా ఇక్కడ విషయం కాదు. పిచ్‌ను బట్టి ఔటవ్వక తప్పదు. కొన్ని అసాధారణ షాట్లు ఆడాల్సి ఉంటుంది. అప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిందే. క్లిష్టమైన పిచ్‌లపై ఇలాంటి ఫలితాలను చూశా.

జాతీయ జట్టులోకి అవకాశంపై..

తప్పకుండా జాతీయ జట్టులోకి వస్తాననే నమ్మకం ఉంది. నా బ్యాటింగ్‌ నైపుణ్యం మెరుగుపర్చుకుంటున్నా. ఫిట్‌నెస్‌పైనా దృష్టిపెట్టా. రంజీ ట్రోఫీలో పరుగులు చేయడం తేలికేం కాదు. అభిమానులూ అదే చెబుతారు. ఇక్కడ డీఆర్‌ఎస్ ఉండదు. నిర్ణయాలు మనకు అనుకూలంగా వస్తాయని చెప్పలేని పరిస్థితి. తీవ్రంగా శ్రమిస్తూ పరుగులు చేయడమే ఏకైక లక్ష్యం. ఏ స్థాయి మ్యాచ్‌లోనైనా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటా’’ అని పుజారా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని