Dinesh Karthik: టీ20 ప్రపంచకప్‌ కప్‌.. దినేశ్‌ కార్తీక్‌కి ప్లేస్‌ ఫిక్స్‌: ఆశిశ్ నెహ్రా

ఇటీవల ముగిసిన భారత టీ20 లీగ్‌లో అదరగొట్టి చాలాకాలం తర్వాత టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్నాడు దినేశ్ కార్తీక్. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అతడు ఫినిషర్‌ పాత్రని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు.

Published : 20 Jun 2022 02:20 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన భారత టీ20 లీగ్‌లో అదరగొట్టి చాలాకాలం తర్వాత టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్నాడు దినేశ్ కార్తీక్. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అతడు ఫినిషర్‌ పాత్రని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. ముఖ్యంగా నాలుగో టీ20లో టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ దినేశ్‌ కార్తీక్ అర్ధ శతకం బాది జట్టు మంచి స్కోరును సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్‌పై భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఆశిశ్ నెహ్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా జట్టులో దినేశ్‌ కార్తీక్ ఇప్పటికే చోటు ఖాయం చేసుకున్నాడని పేర్కొన్నాడు. సాధారణంగా దినేశ్‌ కార్తీక్‌ ఆఖరి ఓవర్లలో చెలరేగి ఆడతాడు. అతడి దూకుడైన ఆటతీరు కఠినమైన ఆస్ట్రేలియా పిచ్‌లపై కూడా టీమ్‌ఇండియా 200 కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించేందుకు తోడ్పాడుతుందన్నాడు.

‘దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో దినేశ్ కార్తీ్క్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం  నచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడు హాఫ్ సెంచరీ సాధించడంతోపాటు పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడి నుంచి ఆశించినది కూడా ఇదే. జట్టులో తిరిగి స్థానం సంపాదించుకున్న అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు దినేశ్‌ కార్తీక్. అతడు చివరి 3-4 ఓవర్లలో మంచి పరుగులు చేస్తాడు. అతడు అనుభవజ్ఞుడు కూడా. సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ అందరూ సంతోషంగా ఉండాలి. ఈ హాఫ్‌ సెంచరీ అతడికి కచ్చితంగా నమ్మకాన్ని ఇస్తుంది. ఇలానే ముందుకు సాగుతాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్‌, జడేజా తర్వాత దినేశ్‌ కార్తీక్ ఉంటాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై 200 కంటే ఎక్కువ లక్ష్యాలను కూడా ఛేదించేందుకు దినేశ్‌ కార్తీక్‌ ఆటతీరు ఉపయోగపడుతుంది’ అని ఆశిశ్‌ నెహ్రా వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని