డోపింగ్‌కు పాల్పడలేదు

తాను డోపింగ్‌కు పాల్పడలేదని.. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ చెప్పింది.

Published : 05 Feb 2023 02:38 IST

ఆ ఉత్ప్రేరకం ఎలా వచ్చిందో తెలియదు

దిల్లీ: తాను డోపింగ్‌కు పాల్పడలేదని.. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ చెప్పింది. తనపై 21 నెలల నిషేధం పడిన నేపథ్యంలో ఆమె ఇలా పేర్కొంది. ‘‘నిషేధిత ఉత్రేరకాన్ని తీసుకోవాలనే ఆలోచనే ఎప్పుడూ రాలేదు. జిమ్నాస్టిక్సే నా లోకం. దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఏనాడూ ప్రవర్తించలేదు. 2017, 19ల్లో రెండు శస్త్ర చికిత్సలు చేయించుకున్నా. కోలుకుని మళ్లీ ఫ్లోర్‌ మీదకు రావాలని అనుకున్నా. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. కానీ ఇంతలోనే ఈ షాక్‌. నాపై సస్పెన్షన్‌ 2021 అక్టోబర్‌ 11 నుంచి అమల్లోకి రావడం కొంచెం ఉపశమనాన్ని ఇస్తోంది. కేసు త్వరగా పరిష్కారం కావడం కోసమే సస్పెన్షన్‌ను అంగీకరించా’’ అని దీప చెప్పింది. తన శరీరంలోకి నిషేధిత ఉత్ప్రేరకాలు ఎలా వచ్చాయో దీపకు తెలియదని.. ఒకవేళ ఆమె ఉద్దేశపూర్వకంగా ఇలా చేసుంటే నాలుగేళ్ల నిషేధం ఎదుర్కొనేదని ఆమె కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది అన్నాడు. త్వరలోనే ఆమె మళ్లీ ఫ్లోర్‌ మీదకు వస్తుందని చెప్పాడు. డోప్‌ పరీక్షలో విఫలం కావడంతో అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య (ఎఫ్‌ఐజీ) నిబంధనలను అనుసరించి అంతర్జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఐటీఏ) దీపకు శిక్ష విధించింది. తొలిసారి శాంపిల్‌ తీసుకున్న 2021 అక్టోబర్‌ 11 నుంచి అమల్లోకి రానున్న ఈ నిషేధం ఈ ఏడాది జులై 10న పూర్తి కానుంది. ‘‘2021లో దీప నుంచి సేకరించిన శాంపిల్‌లో హైజెన్‌మైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం బయటపడింది. దీంతో అప్పటి నుంచి ఆమె పోటీపడిన అన్ని టోర్నీల ఫలితాలపై అనర్హత వేటు పడింది’’ అని ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ ఆధ్వర్యంలో పని చేసే ఐటీఏ వెల్లడించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయిన దీప.. ఆ తర్వాత 2017లో గాయంతో ఆటకు దూరమైంది. మోకాలి శస్త్ర చికిత్స తర్వాత పునరాగమనంలోనూ పెద్దగా రాణించలేదు. టోక్యో ఒలింపిక్స్‌కూ దూరమైంది. 2019 బాకూలో జరిగిన ప్రపంచకప్‌ ఆమె చివరి అంతర్జాతీయ టోర్నీ. గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య దీప పేరును ‘సస్పెండ్‌’ విభాగంలో చేర్చింది. ఆమెపై సస్పెన్షన్‌ విధించినట్లు ప్రపంచ సమాఖ్య నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని అప్పట్లో భారత జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడు సుధీర్‌ మిత్తల్‌ చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని