Womens T20 World Cup: మళ్లీ మళ్లీ.. వాళ్లే

కంగారూలకు ఎదురేదీ? మహిళల క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరో ఐసీసీ ట్రోఫీని ఖాతాలో వేసుకుంది ఆస్ట్రేలియా. ఇప్పటికే ఏడు మహిళల టీ20 ప్రపంచకప్పుల్లో అయిదు తన ఖాతాలో వేసుకున్న ఆ జట్టు.. ఈ మెగా టోర్నీలో టైటిళ్ల సిక్సర్‌ కొట్టేసింది.

Updated : 27 Feb 2023 07:47 IST

కంగారూలకు ఆరో మహిళల టీ20 ప్రపంచకప్‌
మెరిసిన మూనీ
లారా పోరాటం వృథా
ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓటమి

కంగారూలకు ఎదురేదీ? మహిళల క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరో ఐసీసీ ట్రోఫీని ఖాతాలో వేసుకుంది ఆస్ట్రేలియా. ఇప్పటికే ఏడు మహిళల టీ20 ప్రపంచకప్పుల్లో అయిదు తన ఖాతాలో వేసుకున్న ఆ జట్టు.. ఈ మెగా టోర్నీలో టైటిళ్ల సిక్సర్‌ కొట్టేసింది. బ్యాటుతో మూనీ, ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో గార్డ్‌నర్‌ అదరగొట్టిన వేళ.. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి, ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌. దక్షిణాఫ్రికా అవకాశాన్ని సృష్టించుకున్నా.. తన కన్నా బలమైన ఆసీస్‌ ముందు తలవంచక తప్పలేదు. లారా వోల్వార్ట్‌ గొప్పగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది.

స్ట్రేలియాదే అమ్మాయిల టీ20 ప్రపంచకప్‌. మేటి జట్టుగా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్న ఆ జట్టు పొట్టి ఫార్మాట్లో మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. బెత్‌ మూనీ (74 నాటౌట్‌; 53 బంతుల్లో 9×4, 1×6) చెలరేగడంతో ఆదివారం జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆతిథ్య జట్టు మంచి ప్రయత్నమే చేసినా ఫలితం లేకపోయింది. మూనీతో పాటు ఆష్లీ గార్డ్‌నర్‌ (29; 21 బంతుల్లో 2×4, 2×6) మెరవడంతో మొదట ఆసీస్‌ 6 వికెట్లకు 156 పరుగులు సాధించింది. షబ్నిమ్‌ (2/26), మరిజేన్‌ కాప్‌ (2/35) బంతితో రాణించారు. ఓపెనర్‌ లారా వోల్వార్ట్‌ (61; 48 బంతుల్లో 5×4, 3×6) మెరిసినప్పటికీ ఛేదనలో దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. ఆష్లీ (1/20), మెగాన్‌ షట్‌ (1/23), డార్సీ బ్రౌన్‌ (1/25) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. మూనీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఆష్లీ గార్డ్‌నర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచింది.

లారా పోరాడినా..: ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లారా వొల్వార్ట్‌ పోరాట పటిమను ప్రదర్శించింది. కానీ ఆమెకు సరైన సహకారం లభించకపోవడంతో ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు. నిజానికి దక్షిణాఫ్రికా ఆరంభం బాగా లేదు. అయిదో ఓవర్లో ఓపెనర్‌ బ్రిట్స్‌ ఔటయ్యేటప్పటికి స్కోరు 17 పరుగులే. అప్పటికి లారాలో కూడా దూకుడు కొరవడింది. లారాతో రెండో వికెట్‌కు 29 పరుగుల జోడించాక మరిజేన్‌ కాప్‌ (11)తో ఔటైంది. 11వ ఓవర్లో లుజ్‌ వెనుదిరిగేటప్పటికి స్కోరు 54 మాత్రమే. దీంతో దక్షిణాఫ్రికాకు కష్టమే అనిపించింది. ఆ దశలో ట్రయాన్‌ (25) అండగా నిలవగా.. లారా గేర్‌ మార్చింది. చకచకా ఫోర్లు, సిక్స్‌లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ప్రమాదక బ్యాటింగ్‌తో ఆసీస్‌ను కలవర పెట్టింది. చివరి అయిదు ఓవర్లలో దక్షిణాఫ్రికా 59 పరుగులు చేయాల్సిన పరిస్థితి. లారా దూకుడు చూస్తుంటే జట్టును గెలిపిస్తుందనిపించింది. కానీ 16వ ఓవర్లో గార్డ్‌నర్‌ ఆరు పరుగులే ఇవ్వగా.. తర్వాతి ఓవర్లో లారాను ఔట్‌ చేయడం ద్వారా దక్షిణాఫ్రికా ఆశలపై మెగాన్‌ షట్‌ నీళ్లు చల్లింది. ఆ తర్వాత ఆసీస్‌ బౌలర్లు దక్షిణాఫ్రికాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లకు కళ్లెం వేశారు.

చెలరేగిన మూనీ: అంతకుముందు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ బెత్‌ మూనీ ఇన్నింగ్సే హైలైట్‌. బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మిగతా బ్యాటర్లను కట్టడి చేసినా.. ఆసీస్‌ మెరుగైన లక్ష్యాన్నే నిర్దేశించగలిగిందంటే కారణం మూనీనే. చివరికి ఆ జట్టు విజయంలో ఆమె ఇన్నింగ్సే కీలకమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కంగారు జట్టు.. ఓపెనర్‌ అలీసా హీలీ (18) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. అయిదో ఓవర్లో ఆమెను కాప్‌ ఔట్‌ చేసింది. ఏడు ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ స్కోరు 41 పరుగులే. అప్పటికి మూనీ 18 బంతుల్లో 16 పరుగులు చేసింది. కానీ క్రమంగా దూకుడు పెంచిన ఆమె చక్కని షాట్లతో అలరించింది. ఎంలబా బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొటింది. మరోవైపు గార్డ్‌నర్‌ కూడా దూకుడుగా ఆడింది. డి క్లెర్క్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు దంచింది. 12వ ఓవర్లో ఆమెను ట్రియాన్‌ ఔట్‌ చేయడంతో 46 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన బ్యాటర్లెవరూ ఎక్కువ సేపు నిలవలేదు. కానీ మూనీ దూకుడైన ఆటతో స్కోరు బోర్డును నడిపించింది. వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటిస్తూ సాగింది. గ్రేస్‌ హారిస్‌ (10), మెగ్‌ లానింగ్‌ (10) బ్యాట్‌ ఝుళిపించకుండానే వెనుదిరిగారు. 18 ఓవర్లో ఆసీస్‌ 122/4తో నిలవగా.. ఎలీస్‌ పెర్రీ (7)తో అయిదో వికెట్‌కు మూనీ 33 పరుగులు జోడించింది.


ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: అలీసా హీలీ (సి) డి క్లెర్క్‌ (బి) కాప్‌ 18; బేత్‌ మూనీ నాటౌట్‌ 74; ఆష్లీ గార్డ్‌నర్‌ (సి) లుజ్‌ (బి) ట్రియాన్‌ 29; గ్రేస్‌ హారిస్‌ (బి) ఎంలబా 10; లానింగ్‌ (సి) ట్రయాన్‌ (బి) కాప్‌ 10; ఎలిస్‌ పెర్రీ (సి) బ్రిట్స్‌ (బి) షబ్నిమ్‌ 7; జార్జియా వార్‌హోమ్‌ (బి) షబ్నిమ్‌ 0; తాలియా మెక్‌గ్రాత్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156; వికెట్ల పతనం: 1-36, 2-82, 3-103, 4-122, 5-155, 6-155; బౌలింగ్‌: ఎంలబా 3-0-24-1; షబ్నిమ్‌ 4-1-26-2; మరిజేన్‌ కాప్‌ 4-0-35-2; అయబోంగా 4-0-27-0; డిక్లెర్క్‌ 3-0-27-0; ట్రయాన్‌ 2-0-15-1

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: లారా వోల్వార్ట్‌ ఎల్బీ (బి) మెగాన్‌ షట్‌ 61; బ్రిట్స్‌ (సి) తాలియా (బి) బ్రౌన్‌ 10; కాప్‌ (సి) బ్రౌన్‌ (బి) గార్డ్‌నర్‌ 11; లుజ్‌ రనౌట్‌ 2; ట్రయాన్‌ (బి) జొనాసెన్‌ 25; డిక్లెర్క్‌ నాటౌట్‌ 8; అనెకె బోష్‌ రనౌట్‌ 1; సినాలో జఫ్తా నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137; వికెట్ల పతనం: 1-17, 2-46, 3-54, 4-109, 5-121, 6-122; బౌలింగ్‌: మెగాన్‌ షట్‌ 4-0-23-1; గార్డ్‌నర్‌ 4-0-20-1; డార్సీ బ్రౌన్‌ 4-0-25-1; ఎలీస్‌ పెర్రీ 1-0-5-0; జొనాసెన్‌ 3-0-21-1; జార్జియా 2-0-21-0; తాలియా 2-0-17-0


ఆస్ట్రేలియా గెలిచిన ఆరు ప్రపంచకప్‌ల్లోనూ ఎలీస్‌ పెర్రీ సభ్యురాలు.


2009లో తొలి టీ20 ప్రపంచకప్‌లో మాత్రమే సెమీస్‌ చేరలేకపోయిన ఆసీస్‌.. తర్వాత ప్రతి టోర్నీలో ఫైనల్‌ చేరింది. 2016లో వెస్టిండీస్‌ చేతిలో ఓడిన కంగారూలు.. 2010లో న్యూజిలాండ్‌ను.. 2012, 2014, 2018ల్లో ఇంగ్లాండ్‌ను.. 2020లో భారత్‌ను ఓడించి కప్పు సాధించారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు