Chennai Super Kings: ప్లేఆఫ్స్‌ దిశగా..

పిచ్‌ కఠినంగా ఉంది.  పరుగులు చేయడం కష్టమైంది. జట్టులో ఒక్కరూ కనీసం 30 పరుగులు చేయలేదు. అలాంటి పిచ్‌ మీదా 167 పరుగులు చేసింది చెన్నై.

Updated : 11 May 2023 07:51 IST

చెన్నై ఖాతాలో ఏడో విజయం
ఏడో ఓటమితో దిల్లీ అవకాశాలు సంక్లిష్టం

పిచ్‌ కఠినంగా ఉంది.  పరుగులు చేయడం కష్టమైంది. జట్టులో ఒక్కరూ కనీసం 30 పరుగులు చేయలేదు. అలాంటి పిచ్‌ మీదా 167 పరుగులు చేసింది చెన్నై. గత మ్యాచ్‌లో 182 పరుగుల లక్ష్యాన్ని 20 బంతులుండగానే ఛేదించిన దిల్లీని 140/8కే కట్టడి చేసి ఏడో విజయాన్ని ఖాతాలో  వేసుకున్న సూపర్‌కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు మరింత  చేరువైంది. ఏడో ఓటమితో డీసీ.. ప్లేఆఫ్స్‌కు దాదాపుగా దూరం అయింది.

ఐపీఎల్‌-16లో చెన్నై సూపర్‌కింగ్స్‌ నిలకడను కొనసాగించింది. 12 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఏడో విజయం సాధించింది. బుధవారం సీఎస్కే 27 పరుగుల తేడాతో దిల్లీని ఓడించింది. బౌలర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్‌లో మొదట చెన్నై 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. 25 పరుగులు చేసిన శివమ్‌ దూబెనే టాప్‌స్కోరర్‌. మిచెల్‌ మార్ష్‌ (3/18), అక్షర్‌ పటేల్‌ (2/27) చెన్నైని దెబ్బ తీశారు. అనంతరం పతిరన (3/37), దీపక్‌ చాహర్‌ (2/28), జడేజా (1/19)ల ధాటికి దిల్లీ 8 వికెట్లకు 140 పరుగులే చేయగలిగింది. రొసో (35; 37 బంతుల్లో 2×4, 1×6), మనీష్‌ పాండే (27; 29 బంతుల్లో 1×4, 2×6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

దిల్లీ ఆపసోపాలు..: లక్ష్యం పెద్దది కాకపోయినా.. దిల్లీ ఏ దశలోనూ ఛేదన దిశగా సాగలేదు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే వార్నర్‌ (0)ను ఔట్‌ చేసిన దీపక్‌ చాహర్‌.. తన తర్వాతి ఓవర్లో సాల్ట్‌ (17)ను పెవిలియన్‌ చేర్చాడు. మనీష్‌తో సమన్వయ లోపంతో మిచెల్‌ మార్ష్‌ రనౌటవడంతో 25/3తో దిల్లీ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో రొసో, మనీష్‌ పాండే వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కానీ పరుగుల వేగం పడిపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిపోయింది. మరీ నెమ్మదిగా ఆడుతున్న పాండే రెండు సిక్సర్లు బాది ఊపందుకున్నా.. ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ పతిరన అతణ్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో దిల్లీ పతనానికి మళ్లీ గేట్లెత్తినట్లయింది. షాట్ల కోసం గట్టిగా ప్రయత్నించి విఫలమైన రొసో.. చివరికి జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అప్పటి 33 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి రావడంతో దిల్లీ ఓటమి ఖరారైపోయింది. అక్షర్‌ (21), లలిత్‌ (12) ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించారు.

ఆ రెండు ఓవర్లు మినహా..: మొదట చెన్నై ఇన్నింగ్స్‌లో రెండు ఓవర్లలో (14వ, 19వ) మాత్రమే మెరుపులు కనిపించాయి. మిగతా అంతా చెన్నై బ్యాటర్ల తడబాటే సాగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన చెన్నై.. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై తడబడింది. దిల్లీ స్పిన్‌ త్రయం అక్షర్‌, కుల్‌దీప్‌, లలిత్‌.. చెన్నైని బాగా ఇబ్బంది పెట్టారు. ఈ ముగ్గురూ కలిపి 11 ఓవర్లు వేస్తే.. అందులో 89 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. రుతురాజ్‌ (24) దూకుడుగా ఆడుతూ చెన్నైకి మంచి ఆరంభమే (4 ఓవర్లలో 32/0) ఇచ్చినా.. తడబడుతూ సాగిన కాన్వే (10)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ప్రత్యర్థిని తొలి దెబ్బ కొట్టాడు అక్షర్‌. కాసేపటికే రుతురాజ్‌ను సైతం అతనే ఔట్‌ చేశాడు. రహానె (20 బంతుల్లో 21) చాలాసేపు క్రీజులో ఉన్నా ధాటిగా ఆడలేకపోయాడు. అతణ్ని లలిత్‌ కళ్లు చెదిరే రిటర్న్‌ క్యాచ్‌తో ఔట్‌ చేశాడు. 13 ఓవర్లకు 84/4తో చెన్నై కష్టాల్లో పడింది. లలిత్‌ వేసిన 14వ ఓవర్లో దూబె (25; 12 బంతుల్లో 3×6) రెండు సిక్సర్లు బాదగా.. రాయుడు (23) ఒక్కో ఫోర్‌, సిక్సర్‌ బాదడంతో 23 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్‌ గాడిన పడిందనుకుంటుండగా.. దూబె, రాయుడు  ఔటైపోయారు. తర్వాత జడేజా (21), ధోని (20)ల పోరాటంతో స్కోరు 170కి చేరువైంది. ఖలీల్‌ వేసిన 19వ ఓవర్లో ధోని రెండు మెరుపు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి.

చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) అమన్‌ (బి) అక్షర్‌ 24; కాన్వే ఎల్బీ (బి) అక్షర్‌ 10; రహానె (సి) అండ్‌ (బి) లలిత్‌ 21; మొయిన్‌ (సి) మార్ష్‌ (బి) కుల్‌దీప్‌ 7; దూబె (సి) వార్నర్‌ (బి) మార్ష్‌ 25; రాయుడు (సి) రిపల్‌ (బి) ఖలీల్‌ 23; జడేజా (సి) అక్షర్‌ (బి) మార్ష్‌ 21; ధోని (సి) వార్నర్‌ (బి) మార్ష్‌ 20; దీపక్‌ చాహర్‌ నాటౌట్‌ 1; తుషార్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167; వికెట్ల పతనం: 1-32, 2-49, 3-64, 4-77, 5-113, 6-126, 7-164, 8-166; బౌలింగ్‌: ఖలీల్‌ 4-0-32-1; ఇషాంత్‌ 2-0-23-0; లలిత్‌ 3-0-34-1; అక్షర్‌ 4-0-27-2; కుల్‌దీప్‌ 4-0-28-1; మార్ష్‌ 3-0-18-3

దిల్లీ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రహానె (బి) డి.చాహర్‌ 0; సాల్ట్‌ (సి) రాయుడు (బి) డి.చాహర్‌ 17; మార్ష్‌ రనౌట్‌ 5; పాండే  ఎల్బీ (బి) పతిరన 27; రొసో (సి) పతిరన (బి) జడేజా 35; రిపల్‌ రనౌట్‌ 10; అక్షర్‌ (సి) రహానె (బి) పతిరన 21; అమన్‌ నాటౌట్‌ 2; లలిత్‌ (బి) పతిరన 12; కుల్‌దీప్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 140; వికెట్ల పతనం: 1-0, 2-20, 3-25, 4-84, 5-89, 6-116, 7-125, 8-140; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-28-2; తుషార్‌ 3-0-18-0; తీక్షణ 2-0-16-0, జడేజా 4-0-19-1; మొయిన్‌ 4-0-16-0; పతిరన 4-0-37-3

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని