WTC Final - IND vs AUS: వాళ్లతో అంత వీజీ కాదు!

ఇంకో రెండు రోజుల్లో మొదలయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియా ఉత్సాహంగా సిద్ధమవుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో భారత్‌ బలంగానే ఉంది. మరి.. ప్రత్యర్థి సంగతి? అటు వైపు పటిష్టమైన ఆస్ట్రేలియా... అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ఆటగాళ్లతో సమరానికి సై అంటోంది.

Updated : 05 Jun 2023 07:37 IST

ఇంకో రెండు రోజుల్లో మొదలయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియా ఉత్సాహంగా సిద్ధమవుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో భారత్‌ బలంగానే ఉంది. మరి.. ప్రత్యర్థి సంగతి? అటు వైపు పటిష్టమైన ఆస్ట్రేలియా... అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ఆటగాళ్లతో సమరానికి సై అంటోంది. బ్యాటింగ్‌లో లోతుతో.. బౌలింగ్‌లో పదునుతో.. రోహిత్‌ సేనను దెబ్బకొట్టాలని చూస్తోంది. పరిస్థితులూ ఆ జట్టుకే అనుకూలం! మరి భారత్‌కు ఎదురు నిలిచే కంగారూల బృందం ఎలా ఉందో చూసేద్దాం పదండి!

ఈనాడు క్రీడావిభాగం

దైనా పోరులో తలపడే ముందు ప్రత్యర్థి గురించి తెలుసుకోవాలని చెబుతుంటారు. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ప్రత్యర్థి ఆస్ట్రేలియాను చూస్తుంటే.. టీమ్‌ఇండియాకు కఠిన పరీక్ష తప్పదనిపిస్తోంది. కెప్టెన్‌ కమిన్స్‌తో పాటు ఖవాజా, వార్నర్‌, లబుషేన్‌, స్మిత్‌, ట్రేవిస్‌ హెడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ కేరీ, స్టార్క్‌, లైయన్‌, బోలాండ్‌.. ఇలా జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి పరిస్థితులే ఉండే ఓవల్‌లో పేస్‌ దాడితో భారత్‌ను హడలెత్తించేందుకు కంగారూ జట్టు సిద్ధమవుతోంది. 2021లోనూ ఇలాగే ఇంగ్లాండ్‌ (సౌథాంప్టన్‌) గడ్డపై మొట్టమొదటి డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్‌ పేస్‌ ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. మరి ఈ సారి ఆసీస్‌ పేస్‌ దళాన్ని ఎలా ఎదుర్కుంటారన్నది చూడాలి. ఈ డబ్ల్యూటీసీ చక్రం (2021- 23)లో ఆసీస్‌ జోరు మామూలుగా లేదు. 19 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 5 డ్రాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకూ అత్యధిక పరుగులు చేసిన టాప్‌-7 బ్యాటర్లలో నలుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లున్నారు. అత్యధిక వికెట్లు పడగొట్టింది ఆసీస్‌ బౌలరే.

బలంగా.. లోతుగా

ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ లోతుగా, బలంగా ఉంది. ప్రధానంగా ఖవాజా, లబుషేన్‌, స్మిత్‌, హెడ్‌లు మూల స్తంభాలుగా మారారు. ముఖ్యంగా ఖవాజా తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ డబ్ల్యూటీసీ చక్రంలో ఈ ఓపెనర్‌ ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో 69.91 సగటుతో 1608 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల్లో రూట్‌ (1915) తర్వాత ఖవాజాది రెండో స్థానం. చివరగా భారత్‌లో ఆడిన బోర్డర్‌- గావస్కర్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు (333) చేసింది అతనే. ఇక క్రీజులో కుదురుకుంటే చాలు అలవోకగా శతకాలు బాదేసే లబుషేన్‌ కూడా జోరుమీదున్నాడు. ఈ డబ్ల్యూటీసీలో అతను 19 మ్యాచ్‌ల్లో 1509 పరుగులు చేశాడు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడడం, బౌలర్ల లయను దెబ్బతీసి పరుగులు సాధించే నైపుణ్యాలతో లబుషేన్‌ సాగుతున్నాడు. భారత్‌కు కొరకరాని కొయ్య స్మిత్‌తో ఎప్పుడూ ప్రమాదమే. ఈ డబ్ల్యూటీసీ చక్రంలో 19 మ్యాచ్‌ల్లో 1252 పరుగులు చేసిన అతను.. టీమ్‌ఇండియాతో మ్యాచ్‌ అంటే చాలు ఏ స్థాయిలో చెలరేగుతాడో తెలిసిందే. భారత్‌పై 18 టెస్టుల్లో 65.06 సగటుతో 1887 పరుగులు సాధించాడు. ఈ సగటు అతని కెరీర్‌ సగటు (59.80) కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఇంగ్లాండ్‌లోనూ అతని రికార్డు (16 టెస్టుల్లో 1727) గొప్పగా ఉంది. ఇక ఓవల్‌ అతనికి అచ్చొచ్చిన వేదిక అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 3 టెస్టుల్లో ఏకంగా 97.75 సగటుతో 391 పరుగులు సాధించాడు. స్మిత్‌ను క్రీజులో కుదురుకోనిస్తే భారత్‌ మూల్యం చెల్లించుకోవాల్సిందే. పైగా స్మిత్‌, లబుషేన్‌ కౌంటీల్లో ఆడుతూ ఈ ఫైనల్‌ కోసం బాగానే సన్నద్ధమయ్యారు. మిడిలార్డర్‌లో ఆసీస్‌కు హెడ్‌ కీలకంగా మారాడు. ఈ డబ్ల్యూటీసీలో 17 మ్యాచ్‌ల్లో 1208 పరుగులు చేసిన అతను.. జట్టు భారీ స్కోరు చేయడంలో, ఛేదనలో లక్ష్యాన్ని అందుకోవడంలో సాయపడుతున్నాడు.

కళ్లన్నీ అతనిపై..

కామెరూన్‌ గ్రీన్‌.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న క్రికెటర్ల పేర్లలో ఇదొకటి. ఈ ఆస్ట్రేలియా సంచలన పేస్‌ ఆల్‌రౌండర్‌.. బ్యాట్‌, బంతితో ఉత్తమ ప్రదర్శన చేస్తూ తక్కువ కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇప్పటివరకూ 20 టెస్టులాడిన ఈ పొడగరి 941 పరుగులు చేయడంతో పాటు 23 వికెట్లూ తీశాడు. ఈ ఏడాదే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గ్రీన్‌.. ఓ శతకం సహా 452 పరుగులతో సత్తాచాటాడు. ఫార్మాట్‌కు తగ్గట్లుగా బ్యాటింగ్‌లో పరుగులు రాబడుతూ.. మంచి వేగంతో బౌలింగ్‌ చేస్తూ గ్రీన్‌ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో అతనిపై ఆస్ట్రేలియా భారీ ఆశలే పెట్టుకుంది. అతని కారణంగా జట్టుకు సమతూకం కూడా వచ్చింది. అదనంగా ఓ బ్యాటర్‌ లేదా బౌలర్‌ను ఆడించే వెసులుబాటు కలగనుంది. ఇక కొంతకాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో నిలకడలేమితో సతమతమవుతున్న వార్నర్‌ కూడా ఐపీఎల్‌-16తో లయ అందుకున్నట్లే కనిపించాడు. అతను క్రీజులో నిలబడితే ప్రత్యర్థికి ఎంతటి నష్టం చేయగలడో తెలిసిందే. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ కూడా అవసరమైనప్పుడు జట్టుకు ఉపయోగపడుతున్నాడు.

హేజిల్‌వుడ్‌ లేకున్నా..

ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ అనే చర్చ రాగానే.. మొదట కంగారూల బౌలింగ్‌ బలం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. గాయం నుంచి కోలుకోని హేజిల్‌వుడ్‌ దూరమవడం ఆ జట్టుకు దెబ్బే. కానీ ఆ లోటు తెలియకుండా చేసే బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలు ఆసీస్‌కు ఉన్నాయి. కమిన్స్‌, స్టార్క్‌.. ఇంగ్లాండ్‌లోని పిచ్‌లపై ఈ పేస్‌ ద్వయం ఎలాంటి ప్రత్యర్థికైనా వణుకు పుట్టించేదే. ఈ డబ్ల్యూటీసీ చక్రంలో కమిన్స్‌ 15 మ్యాచ్‌ల్లో 53 వికెట్లు తీయగా.. స్టార్క్‌ 16 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లిష్‌ గడ్డపై స్వింగ్‌ అనుకూల పరిస్థితుల్లో సారథి కమిన్స్‌ మరింత ప్రభావవంతంగా రాణించగలడు. కాస్త విరామం తర్వాత తాజాగా వస్తున్న అతను.. జట్టును నడిపించడంతో పాటు తన బౌలింగ్‌తో భారత బ్యాటర్లపై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాడు. టీమ్‌ఇండియాపై 12 టెస్టుల్లో 46 వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లాండ్‌లో అయితే 5 మ్యాచ్‌ల్లో 19.62 సగటుతో 29 వికెట్లు పడగొట్టడం విశేషం. మరోవైపు స్టార్క్‌ ఎప్పటికీ ప్రమాదకర బౌలరే. అంతర్జాతీయ క్రికెట్‌పై దృష్టి పెట్టడం కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లకు దూరంగా ఉంటున్న అతను వికెట్ల ఆకలితో ఉన్నాడు. వేగమే అతని ఆయుధం. మంచి పేస్‌తో బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు. పాత బంతితోనూ సమర్థంగా రివర్స్‌ స్వింగ్‌ రాబడతాడు. బోలాండ్‌, హేజిల్‌వుడ్‌ స్థానంలో వచ్చిన నెసర్‌ కూడా నైపుణ్యాలున్న పేసర్లే. ఇక స్పిన్‌ విషయానికి వస్తే ఆసీస్‌ ఒక్క స్పిన్నర్‌నే ఆడించే అవకాశం ఉంది. ఆ ఒక్కడు.. లైయన్‌. ఈ డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు (83) సాధించింది అతనే. ఫైనల్‌ చివరి రెండు రోజుల ఆటలో అతను కీలకం కానున్నాడు. పిచ్‌ అనుకూలిస్తే ఈ ఆఫ్‌స్పిన్నర్‌ ఎంతలా విజృంభిస్తాడో తెలిసిందే. ఇంగ్లాండ్‌లోనూ అతనికి (13 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు) మంచి రికార్డే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని