ACC Mens Emerging Cup 2023: నేపాల్‌ను చిత్తుచేసి సెమీస్‌కు

ఏసీసీ పురుషుల ఎమర్జింగ్‌ కప్‌లో భారత్‌-ఎ సెమీస్‌లో అడుగుపెట్టింది. సోమవారం నేపాల్‌తో గ్రూప్‌-బి మ్యాచ్‌లో మన కుర్రాళ్లు చెలరేగారు.

Updated : 18 Jul 2023 09:22 IST

ఏసీసీ ఎమర్జింగ్‌ కప్‌లో భారత్‌ జోరు

కొలంబో: ఏసీసీ పురుషుల ఎమర్జింగ్‌ కప్‌లో భారత్‌-ఎ సెమీస్‌లో అడుగుపెట్టింది. సోమవారం నేపాల్‌తో గ్రూప్‌-బి మ్యాచ్‌లో మన కుర్రాళ్లు చెలరేగారు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అదరగొట్టి 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. దీంతో వరుసగా రెండు వన్డేల్లో విజయాలతో.. గ్రూప్‌లో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే భారత యువ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌.. భారత బౌలర్ల ధాటికి 39.2 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ నిశాంత్‌ సింధు (4/14), పేసర్లు రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌ (3/25), హర్షిత్‌ రాణా (2/16) ప్రత్యర్థిని చుట్టేశారు. నేపాల్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ పాడెల్‌ (65; 85 బంతుల్లో 7×4) అర్ధశతకంతో పోరాడాడు. గుల్షన్‌ జా (38) కూడా మెరిశాడు. అనంతరం స్వల్ప ఛేదనలో భారత్‌- ఎ అదరగొట్టింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (87; 69 బంతుల్లో 12×4, 2×6), సాయి సుదర్శన్‌ (58 నాటౌట్‌; 52 బంతుల్లో 8×4, 1×6) అర్ధసెంచరీలతో సత్తాచాటారు. ఈ ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు 19 ఓవర్లలోనే 139 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేసింది. అభిషేక్‌ ఔటైనా.. ధ్రువ్‌ జూరెల్‌ (21 నాటౌట్‌; 12 బంతుల్లో 1×4, 2×6) వేగంగా ఆడి పని పూర్తిచేశాడు. అతను సిక్సర్‌తో మ్యాచ్‌ ముగించడం విశేషం. చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ బుధవారం పాకిస్థాన్‌-ఎతో తలపడుతుంది. సోమవారం పాక్‌ 184 పరుగుల తేడాతో యూఏఈ-ఎ జట్టును చిత్తుచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని