IND vs WI: ముంచేసిన పూరన్‌

మందకొడి పిచ్‌పై తిలక్‌ వర్మ  పోరాటంతో మొదట భారత్‌ కష్టంగా 150 దాటింది. గత మ్యాచ్‌లో ఓటమి నుంచి పాఠాలు నేర్వని సహచర బ్యాటర్లు మళ్లీ విఫలమైన చోట.. హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ మాత్రం అర్ధశతకంతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.

Updated : 07 Aug 2023 07:08 IST

రెండో టీ20లోనూ భారత్‌ ఓటమి
తిలక్‌ పోరాటం వృథా
సిరీస్‌లో విండీస్‌కు 2-0 ఆధిక్యం

మందకొడి పిచ్‌పై తిలక్‌ వర్మ  పోరాటంతో మొదట భారత్‌ కష్టంగా 150 దాటింది. గత మ్యాచ్‌లో ఓటమి నుంచి పాఠాలు నేర్వని సహచర బ్యాటర్లు మళ్లీ విఫలమైన చోట.. హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ మాత్రం అర్ధశతకంతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.


ఛేదనలో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను  భారత్‌ చుట్టేసేలా కనిపించింది. కానీ పూరన్‌ ఒక్కడే సునామీలా ముంచెత్తాడు. ఎడాపెడా బాదేసి ఆతిథ్య జట్టును గెలిపించాడు. ఆఖర్లో ఉత్కంఠ రేగినా, విజయానికి దగ్గరగా వెళ్లినా.. మరోసారి పట్టు విడిచిన భారత్‌కు ఓటమి తప్పలేదు.


మిగతా ఫార్మాట్లలో ప్రదర్శన ఎలా ఉన్నా.. టీ20ల్లో మాత్రం తామెంత ప్రమాదకరమో మరోసారి వెస్టిండీస్‌ చాటింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నికోలస్‌ పూరన్‌ (67; 40 బంతుల్లో 6×4, 4×6) విధ్వంసంతో ఆదివారం రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. తిలక్‌ వర్మ (51; 41 బంతుల్లో 5×4, 1×6) పోరాటంతో భారత్‌ మొదట 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. కరీబియన్‌ బౌలర్లలో అల్జారి జోసెఫ్‌ (2/28), అకీల్‌ హోసీన్‌ (2/29), రొమారియో షెఫర్డ్‌ (2/28) ఆకట్టుకున్నారు. అనంతరం ఛేదనలో విండీస్‌ 8 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. హార్దిక్‌ పాండ్య (3/35), చాహల్‌ (2/19) మెరిశారు. నెట్స్‌లో గాయపడ్డ కుల్‌దీప్‌ స్థానంలో యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ జట్టులోకి వచ్చాడు. ఈ విజయంతో 2-0తో నిలిచిన విండీస్‌.. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ దక్కించుకోవాలంటే మరో మ్యాచ్‌ నెగ్గితే సరిపోతుంది. కానీ టీమ్‌ఇండియా వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాల్సిందే. మూడో టీ20 మంగళవారం జరుగుతుంది.

బాదేశాడు..: ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌. హార్దిక్‌ బౌలింగ్‌లో కింగ్‌ (0) కవర్‌డ్రైవ్‌ ఆడాలని చూడగా.. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని కుడి వైపు డైవ్‌ చేస్తూ సూర్య అద్భుతంగా అందుకున్నాడు. నాలుగో బంతికి ఛార్లెస్‌ (2) ఔట్‌. ఇంకేముందీ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై విండీస్‌ బ్యాటర్లు నిలబడడం కష్టమే అనిపించింది. కానీ పూరన్‌ కథ మొత్తం మార్చేశాడు. ఆరంభంలోనే సమీక్షతో బతికిపోయిన అతను.. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. రవి బిష్ణోయ్‌ ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌ రాబట్టాడు. దీంతో ఆరు ఓవర్లకే విండీస్‌ స్కోరు 60 దాటింది. భారత బ్యాటర్లు తడబడ్డ పిచ్‌పై పూరన్‌ అలవోకగా భారీ షాట్లు ఆడాడు. 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్‌.. పావెల్‌ (21)ను వెనక్కి పంపడంతో 10 ఓవర్లకు విండీస్‌ 91/4తో నిలిచింది. కానీ విజయానికి ఆ జట్టుకు అప్పటికీ 60 బంతుల్లో 62 పరుగులే కావాలి. జట్టు విజయాన్ని వేగవంతం చేసేలా పూరన్‌ విధ్వంసాన్ని కొనసాగించాడు. మరోవైపు హెట్‌మయర్‌ (22) కూడా ఆకట్టుకున్నాడు. ముకేశ్‌ (1/35) బౌలింగ్‌లో సిక్సర్‌ తర్వాత పూరన్‌ ఔటవడం, 15వ ఓవర్లో బిష్ణోయ్‌ ఒక్క పరుగే ఇవ్వడం, చాహల్‌ బౌలింగ్‌లో షెఫర్డ్‌ (0) రనౌట్‌, హోల్డర్‌ (0) స్టంపౌట్‌, హెట్‌మయర్‌ ఎల్బీగా వెనుదిరగడంతో ఉత్కంఠ రేగింది. ముకేశ్‌ ఓవర్లో (17వ) 3 పరుగులే రావడంతో సమీకరణం 18 బంతుల్లో 21గా మారింది. కానీ అకీల్‌ (16 నాటౌట్‌), జోసెఫ్‌ (10 నాటౌట్‌) పట్టుదలగా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18వ ఓవర్లో అర్ష్‌దీప్‌ (1/34) ఫోర్‌తో సహా 9 పరుగులు ఇవ్వడం భారత్‌ను దెబ్బతీసింది. ముకేశ్‌ బౌలింగ్‌లో జోసెఫ్‌ సిక్సర్‌ కొట్టడంతో భారత్‌ ఆశలకు తెరపడింది. అకీల్‌ ఫోర్‌తో లాంఛనం పూర్తిచేశాడు.

మళ్లీ అతనే..: భారత్‌ ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ బ్యాటింగ్‌ తప్ప చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. విండీస్‌తో తొలి టీ20లో అరంగేట్రంలోనే ఆకట్టుకున్న తిలక్‌.. మరోసారి సత్తాచాటాడు. విలువైన అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. 34/2.. పవర్‌ప్లేలో టీమ్‌ఇండియా స్కోరిది. తడబడుతూనే బ్యాటింగ్‌ చేసిన శుభ్‌మన్‌ (7), లేని పరుగుకు ప్రయత్నించిన సూర్యకుమార్‌ (1) రనౌట్‌గా వెనుదిరిగాడు. బంతిని దగ్గరే ఆడిన ఇషాన్‌ (27) పరుగు కోసం సూర్యను పిలిచాడు. కానీ స్క్వేర్‌లెగ్‌లో ఉన్న మేయర్స్‌ మెరుపు వేగంతో నేరుగా స్టంప్స్‌కు విసిరిన త్రోకు సూర్య పెవిలియన్‌ చేరక తప్పలేదు. అక్కడి నుంచి ఇషాన్‌, తిలక్‌ కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశారు. పిచ్‌ను చక్కగా ఉపయోగించుకుంటూ.. తెలివిగా బౌలింగ్‌ వేసిన విండీస్‌ పేసర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టే అవకాశం ఇవ్వలేదు. దీంతో నెమ్మదిగానే స్కోరుబోర్డును నడిపించారు. ఇక ఇలా అయితే లాభం లేదని.. మేయర్స్‌ బౌలింగ్‌లో చెరో ఫోర్‌తో తిలక్‌, ఇషాన్‌ గేరు మార్చాలని చూశారు. ఫోర్‌ రాబట్టేందుకు తిలక్‌ ఆడిన స్కూప్‌ షాట్‌ ఆకట్టుకుంది. కానీ స్వల్ప వ్యవధిలో ఇషాన్‌ (27), శాంసన్‌ (7) పెవిలియన్‌ చేరడంతో జట్టు 12 ఓవర్లకు 79/4తో నిలిచింది. కష్టాల్లో ఉన్న జట్టుకు మరోసారి తిలక్‌ ఆపద్బాంధవుడిగా మారాడు. తనదైన శైలిలో బౌండరీలు రాబట్టాడు. మెకాయ్‌ క్యాచ్‌ వదిలేయడం తిలక్‌కు కలిసొచ్చింది. ఆ వెంటనే మెకాయ్‌ బౌలింగ్‌లోనే అతను సిక్సర్‌ కొట్టాడు. 39 బంతుల్లో తొలి అంతర్జాతీయ అర్ధశతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తిలక్‌ జోరుతో 15 ఓవర్లలో 106/4తో జట్టు కోలుకున్నట్లే కనిపించింది. కానీ కీలక దశలో తిలక్‌ను బుట్టలో వేసుకున్న అకీల్‌.. భారత్‌ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత సిక్సర్‌ కొట్టి హార్దిక్‌ (24) కూడా నిష్క్రమించాడు. చివరి ఓవర్లో అర్ష్‌దీప్‌ (6 నాటౌట్‌) ఫోర్‌, బిష్ణోయ్‌ (8 నాటౌట్‌) సిక్సర్‌ కొట్టడంతో జట్టు స్కోరు 150 దాటింది. చివరి 5 ఓవర్లలో భారత్‌ 46 పరుగులు పిండుకుంది.

భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (బి) షెఫర్డ్‌ 27; శుభ్‌మన్‌ (సి) హెట్‌మయర్‌ (బి) జోసెఫ్‌ 7; సూర్య రనౌట్‌ 1; తిలక్‌ (సి) మెకాయ్‌ (బి) అకీల్‌ 51; శాంసన్‌ (స్టంప్డ్‌) పూరన్‌ (బి) అకీల్‌ 7; హార్దిక్‌ (బి) జోసెఫ్‌ 24; అక్షర్‌ (సి) పూరన్‌ (బి) షెఫర్డ్‌ 14; రవి బిష్ణోయ్‌ నాటౌట్‌ 8; అర్ష్‌దీప్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152; వికెట్ల పతనం: 1-16, 2-18, 3-60, 4-76, 5-114, 6-129, 7-139; బౌలింగ్‌: మెకాయ్‌ 4-0-25-0; అకీల్‌ 4-0-29-2; అల్జారి జోసెఫ్‌ 4-0-28-2; హోల్డర్‌ 4-0-29-0; షెఫర్డ్‌ 3-0-28-2; మేయర్స్‌ 1-0-12-0

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: కింగ్‌ (సి) సూర్య (బి) హార్దిక్‌ 0; మేయర్స్‌ ఎల్బీ (బి) అర్ష్‌దీప్‌ 15; ఛార్లెస్‌ (సి) తిలక్‌ (బి) హార్దిక్‌ 2; పూరన్‌ (సి) శాంసన్‌ (బి) ముకేశ్‌ 67; పావెల్‌ (సి) ముకేశ్‌ (బి) హార్దిక్‌ 21; హెట్‌మయర్‌ ఎల్బీ (బి) చాహల్‌ 22; షెఫర్డ్‌ రనౌట్‌ 0; హోల్డర్‌ (స్టంప్డ్‌) కిషన్‌ (బి) చాహల్‌ 0; అకీల్‌ నాటౌట్‌ 16; జోసెఫ్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (18.5 ఓవర్లలో 8 వికెట్లకు) 155; వికెట్ల పతనం: 1-0, 2-2, 3-32, 4-89, 5-126, 6-128, 7-128, 8-129; బౌలింగ్‌: హార్దిక్‌ 4-0-35-3; అర్ష్‌దీప్‌ 4-0-34-1; ముకేశ్‌ 3.5-0-35-1; రవి బిష్ణోయ్‌ 4-0-31-0; చాహల్‌ 3-0-19-2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని