బట్లర్‌ సారథ్యంలో ఇంగ్లాండ్‌..

లండన్‌: 2022 టీ20 ప్రపంచకప్‌ను దేశానికి అందించిన జోస్‌ బట్లర్‌ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్‌ అదృష్టం పరీక్షించుకోనుంది.

Published : 01 May 2024 02:09 IST

లండన్‌: 2022 టీ20 ప్రపంచకప్‌ను దేశానికి అందించిన జోస్‌ బట్లర్‌ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్‌ అదృష్టం పరీక్షించుకోనుంది. వెస్టిండీస్‌-అమెరికా ఆతిథ్యమిచ్చే పొట్టి కప్పులో పోటీపడే ఇంగ్లాండ్‌ జట్టును.. ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మంగళవారం ప్రకటించింది. బట్లర్‌ జట్టుకు సారథిగా వ్యవహరించనుండగా.. మోచేతి గాయం కారణంగా ఏడాదికిపైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ పునరాగమనం చేశాడు. యువ ఆటగాడు, ఇంకా అరంగేట్రం చేయని స్పిన్‌ ఆల్‌రౌండర్‌ టామ్‌ హార్ట్‌లీకి కూడా జట్టులో చోటు దక్కింది. ఇప్పటికే ప్రపంచకప్‌లో ఎంపికై ఐపీఎల్‌లో ఆడుతున్న బట్లర్‌ (రాజస్థాన్‌), మొయిన్‌ అలీ (చెన్నై), బెయిర్‌స్టో, సామ్‌ కరన్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌ (పంజాబ్‌), ఫిల్‌సాల్ట్‌ (కోల్‌కతా), విల్‌ జాక్స్‌, రీస్‌ టాప్లీ (బెంగళూరు) ముందే ఐపీఎల్‌ వీడనున్నారు. పాకిస్థాన్‌తో ఆరంభమయ్యే టీ20 సిరీస్‌ (మే 22 నుంచి) వీరు అందుబాటులో ఉండాలని బోర్డు ఆదేశించింది.

ఇంగ్లాండ్‌ జట్టు: బట్లర్‌ (కెప్టెన్‌), మొయిన్‌ అలీ, ఆర్చర్‌, బెయిర్‌స్టో, బ్రూక్‌, సామ్‌ కరన్‌, డకెట్‌, టామ్‌ హార్ట్‌లీ, విల్‌ జాక్స్‌, క్రిస్‌ జోర్డాన్‌, లివింగ్‌స్టన్‌, రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, రీస్‌ టాప్లీ, మార్క్‌ వుడ్‌.

దక్షిణాఫ్రికా జట్టులో నోకియా: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో పేసర్‌ అన్రిచ్‌ నోకియా చోటు దక్కించుకున్నాడు. గాయంతో జట్టుకు దూరమైన అతడు తొమ్మిది నెలల విరామం తర్వాత ఈ కప్‌తో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయనున్నాడు. సఫారీ జట్టుకు మార్‌క్రమ్‌ సారథ్యం వహించనున్నాడు. ఒక ప్రపంచకప్‌లో జట్టును నడిపించనుండడం అతడికిదే తొలిసారి.  

దక్షిణాఫ్రికా జట్టు: మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), బార్ట్‌మ్యాన్‌, కొయెట్జీ, డికాక్‌, ఫౌర్టీన్‌, హెండ్రిక్స్‌, మార్కో యెన్సెన్‌, క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, నోకియా, రబాడ, రికిల్‌టన్‌,     షంసి, స్టబ్స్‌; రిజర్వ్‌ ఆటగాళ్లు: బర్గర్‌, ఎంగిడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని