Ravindra Jadeja: టెస్టులకు జడేజా గుడ్‌బై?

టీమ్‌ఇండియాలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తొడ కండరాల గాయంతో రోహిత్‌శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమవగా.. వన్డేలకు అందుబాటులో ఉండనని విరాట్‌ కోహ్లి

Updated : 15 Dec 2021 06:59 IST

వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టిపెట్టేందుకే

దిల్లీ: టీమ్‌ఇండియాలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తొడ కండరాల గాయంతో రోహిత్‌శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమవగా.. వన్డేలకు అందుబాటులో ఉండనని విరాట్‌ కోహ్లి బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో బాంబు పేలింది. ఆల్‌రౌండర్‌  జడేజా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వన్డేలు, టీ20 ఫార్మాట్లలో ఎక్కువ కాలం కెరీర్‌ కొనసాగించడానికి టెస్టులకు వీడ్కోలు పలకాలని 33 ఏళ్ల జడేజా నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహితుడు తెలిపాడు. గత నెలలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జడేజా మోచేతికి గాయమైంది. అదే కారణంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు జడేజాను ఎంపిక చేయలేదు. అయితే వీలైనంత త్వరగా జడేజాను టెస్టు క్రికెట్లో చూడాలనుకుంటున్న అభిమానులకు అతని నిర్ణయం నిరాశ కలిగించేదే. మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియాకు జడేజా తిరుగులేని ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌తో రాణిస్తున్న జడేజాకు ఫీల్డింగ్‌లో ఎదురేలేదు. మెరుపు వేగంతో అతను విసిరిన త్రోలు మ్యాచ్‌లను మలుపు తిప్పిన సందర్భాలు ఎన్నో. ఇప్పటి వరకు 57 టెస్టులాడిన జడేజా 2195 పరుగులు చేసి, 232 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్‌గానూ జడేజా రికార్డు సృష్టించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని