INDW vs AUSW: అమ్మాయిలకు నిరాశే

278.. ఇదీ భారత్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందున్న లక్ష్యం. మహిళల వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఏ జట్టూ ఇంత లక్ష్యాన్ని అందుకుని విజయం సాధించలేదు. ఇంకేముందీ.. విజయం మనదేననే అంచనాలు కలిగాయి. కానీ టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ మారినా..రాత మారలేదు.

Updated : 20 Mar 2022 06:44 IST

ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓటమి
రాణించిన మిథాలీ, యస్తిక, హర్మన్‌
నిరాశపర్చిన బౌలర్లు
సెమీస్‌లో కంగారూ జట్టు

ఆక్లాండ్‌

278.. ఇదీ భారత్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందున్న లక్ష్యం. మహిళల వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఏ జట్టూ ఇంత లక్ష్యాన్ని అందుకుని విజయం సాధించలేదు. ఇంకేముందీ.. విజయం మనదేననే అంచనాలు కలిగాయి. కానీ టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ మారినా..రాత మారలేదు. ఈ సారి బౌలర్ల వైఫల్యం జట్టును దెబ్బతీసింది. టోర్నీలో మూడో ఓటమిని ఖాతాలో వేసుకున్న మిథాలీ సేన నాకౌట్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన కంగారూ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది.

భారత్‌కు మూడో ఓటమి. శనివారం మ్యాచ్‌లో జట్టు 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మొదట టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిథాలీ (68; 96 బంతుల్లో 4×4, 1×6), యాస్తిక (59; 83 బంతుల్లో 6×4), హర్మన్‌ప్రీత్‌ (57 నాటౌట్‌; 47 బంతుల్లో 6×4) రాణించారు. బ్రౌన్‌ (3/30), అలానా కింగ్‌ (2/52) మెరిశారు. ఛేదనలో ఆసీస్‌ 4 వికెట్లు కోల్పోయి 49.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్‌ లానింగ్‌ (97; 107 బంతుల్లో 13×4), అలీసా (72; 65 బంతుల్లో 9×4) సత్తాచాటారు.

తేలిపోయిన బౌలర్లు..: 200వ వన్డే ఆడిన వెటరన్‌ పేసర్‌ జులన్‌తో సహా ఏ భారత బౌలర్‌ ఆసీస్‌ మీద ఒత్తిడి తేలేకపోయారు. ఛేదనలో ఓపెనర్లు రేచల్‌ (43), అలీసా తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. వరుస ఓవర్లలో వాళ్లను ఔట్‌ చేసినప్పటికీ.. లానింగ్‌ భారత్‌కు పుంజుకునే అవకాశమివ్వలేదు. వర్షం అంతరాయం తర్వాత మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైన వెంటనే పెర్రీ (28)ని పెవిలియన్‌ చేర్చి 103 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యాన్ని పూజ (2/43) విడగొట్టింది. కానీ మూనీ (30 నాటౌట్‌) జతగా లానింగ్‌ జట్టును లక్ష్యం దిశగా నడిపింది. మూనీ చివరి ఓవర్లో రెండు ఫోర్లతో జట్టును గెలిపించింది.

ఆ ముగ్గురు..: అంతకుముందు బ్రౌన్‌ ధాటికి 28 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను మిథాలీ, యాస్తిక, హర్మన్‌ ఆదుకున్నారు. యస్తిక, మిథాలీ మూడో వికెట్‌కు 130 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ నిలబెట్టారు. కానీ మిడిలార్డర్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఓ వైపు హర్మన్‌ క్రీజులో నిలబడ్డా.. మరో ఎండ్‌లో వికెట్లు పడ్డాయి. దీంతో భారత్‌ 213/6తో ఇబ్బందుల్లో పడింది. కానీ సూపర్‌ ఫామ్‌లో ఉన్న హర్మన్‌ జోరు కొనసాగించడంతో జట్టు మెరుగైన స్కోరు చేసింది. హర్మన్‌కు పూజ (34) సహకరించింది. చివరి అయిదు ఓవర్లలో జట్టు 52 పరుగులు పిండుకుంది.

భారత్‌ ఇన్నింగ్స్‌: మంధాన (సి) లానింగ్‌ (బి) బ్రౌన్‌ 10; షెఫాలీ (సి) మూనీ (బి) బ్రౌన్‌ 12; యాస్తిక (సి) పెర్రీ (బి) బ్రౌన్‌ 59; మిథాలీ (సి) పెర్రీ (బి) కింగ్‌ 68; హర్మన్‌ప్రీత్‌ నాటౌట్‌ 57; రిచా (స్టంప్డ్‌) అలీసా (బి) కింగ్‌ 8; స్నేహ్‌ రాణా (బి) జొనాసెన్‌ 0; పూజ రనౌట్‌ 34; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 277; వికెట్ల పతనం: 1-11, 2-28, 3-158, 4-186, 5-212, 6-213, 7-277; బౌలింగ్‌: మెగాన్‌ 10-0-57-0; బ్రౌన్‌ 8-0-30-3; జొనాసెన్‌ 7-0-40-1; పెర్రీ 3-0-24-0; గార్డ్‌నర్‌ 6-1-34-0; తహిలా 6-0-35-0; అలానా కింగ్‌ 10-1-52-2

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: రేచల్‌ (సి) రిచా (బి) పూజ 43; అలీసా (సి) మిథాలీ (బి) స్నేహ్‌ 72; లానింగ్‌ (సి) పూజ (బి) మేఘన 97; పెర్రీ (సి) మిథాలీ (బి) పూజ 28; మూనీ నాటౌట్‌ 30; తహిలా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (49.3 ఓవర్లలో 4 వికెట్లకు) 280; వికెట్ల పతనం: 1-121, 2-123, 3-226, 4-270; బౌలింగ్‌: జులన్‌ 9.3-0-64-0; మేఘన 10-0-68-1; రాజేశ్వరి 10-0-48-0; పూజ 10-0-43-2; స్నేహ్‌ రాణా 10-0-56-1


17
వన్డేల్లో ఆసీస్‌కిది వరుసగా 17వ విజయవంతమైన ఛేదన. ఆ రికార్డులో భారత పురుషుల జట్టు (2005-06)తో సమానంగా నిలిచింది.


278
మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఓ జట్టు ఛేదించిన అత్యధిక  లక్ష్యం ఇదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని