Gujarat: గుజరాత్‌ తన్నుకుపోయె..

బాగానే ఆడినా.. విజయం చిక్కినట్లే చిక్కి హైదరాబాద్‌  చేజారింది. గుజరాత్‌కు వరుసగా నాలుగో విజయం. బుధవారం ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్‌లో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. అభిషేక్‌ శర్మ (65; 42 బంతుల్లో 6×4, 3×6), మార్‌క్రమ్‌ (56; 40 బంతుల్లో 2×4, 3×6), శశాంక్‌ సింగ్‌ (25 నాటౌట్‌; 6 బంతుల్లో 1×4, 3×6) మెరుపులతో మొదట సన్‌రైజర్స్‌ 6 వికెట్లకు 195 పరుగులు సాధించింది. సాహా (68; 38 బంతుల్లో 11×4, 1×6), తెవాతియా (40 నాటౌట్‌; 21 బంతుల్లో 4×4, 2×6), రషీద్‌ ఖాన్‌ (31 నాటౌట్‌; 11 బంతుల్లో 4×6) చెలరేగడంతో లక్ష్యాన్ని గుజరాత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Updated : 28 Apr 2022 06:40 IST

ఉమ్రాన్‌ శ్రమ వృథా
సాహా, తెవాతియా, రషీద్‌ సంచలన బ్యాటింగ్‌
హైదరాబాద్‌ ఓటమి

వారెవా ఉమ్రాన్‌ మాలిక్‌. ఏమా వేగం.. ఏమా కచ్చితత్వం..!
టెక్నిక్‌లో తిరుగులేని గిల్‌.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న హార్దిక్‌.. విధ్వంసక మిల్లర్‌.. మిగతా బౌలర్లందరూ ఉతికారేసిన సాహా.. వీళ్లెవ్వరి వల్లా కాలేదు అతడికి ఎదురు నిలవడం!
గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడితే.. అన్నీ అతడి ఖాతాలోనే. అందులో నాలుగు బౌల్డ్‌!
గుజరాత్‌లో కాస్త ఆశలు రేగిన ప్రతిసారీ ఉమ్రాన్‌ వచ్చాడు. తన బుల్లెట్‌ బంతులతో ఆ ఆశల్ని తుంచేశాడు.
కానీ అతడి కోటా అయిపోయింది.  హైదరాబాద్‌ కొంప మునిగింది.   ఆశలు సన్నగిలిల్లిన స్థితిలో అసాధారణంగా చెలరేగిపోయిన రాహుల్‌ తెవాతియా, రషీద్‌ గుజరాత్‌కు ఊహించని విజయాన్నందించారు.
ఉమ్రాన్‌ మాలిక్‌ టీ20 చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన చేసినా.. అతడి జట్టు మాత్రం ఓటమి మూటగట్టుకుంది.
అయిదు వరుస విజయాల తర్వాత హైదరాబాద్‌ ఓటమి రుచి చూసింది. జైత్రయాత్రను కొనసాగిస్తూ గుజరాత్‌ 8 మ్యాచ్‌ల్లో ఏడో విజయంతో మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

ముంబయి

బాగానే ఆడినా.. విజయం చిక్కినట్లే చిక్కి హైదరాబాద్‌  చేజారింది. గుజరాత్‌కు వరుసగా నాలుగో విజయం. బుధవారం ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్‌లో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. అభిషేక్‌ శర్మ (65; 42 బంతుల్లో 6×4, 3×6), మార్‌క్రమ్‌ (56; 40 బంతుల్లో 2×4, 3×6), శశాంక్‌ సింగ్‌ (25 నాటౌట్‌; 6 బంతుల్లో 1×4, 3×6) మెరుపులతో మొదట సన్‌రైజర్స్‌ 6 వికెట్లకు 195 పరుగులు సాధించింది. సాహా (68; 38 బంతుల్లో 11×4, 1×6), తెవాతియా (40 నాటౌట్‌; 21 బంతుల్లో 4×4, 2×6), రషీద్‌ ఖాన్‌ (31 నాటౌట్‌; 11 బంతుల్లో 4×6) చెలరేగడంతో లక్ష్యాన్ని గుజరాత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఉమ్రాన్‌ మాలిక్‌ (5/25) అద్భుతంగా బౌలింగ్‌ చేసినా ఫలితం లేకపోయింది. జాన్సన్‌ 63 పరుగులిచ్చి హైదరాబాద్‌  కొంప ముంచాడు.
సాహా ధనాధన్‌: ఛేదనలో వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ గుజరాత్‌ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేస్తే.. ఆఖర్లో ప్రతికూల పరిస్థితుల్లో తెవాతియా, రషీద్‌ ఖాన్‌ అద్భుత ముగింపునిచ్చారు. ఓపెనర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ (22; 24 బంతుల్లో 1×4, 1×6) పరుగుల కోసం శ్రమించినా.. సాహా మాత్రం స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించాడు. ఎడాపెడా ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఉమ్రాన్‌ మాలిక్‌ ఎనిమిదో ఓవర్లో గిల్‌ను బౌల్డ్‌ చేశాడు. తన తర్వాతి ఓవర్లో గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (10)నూ ఔట్‌ చేశాడు. కానీ సాహా జోరు కొనసాగడంతో గుజరాత్‌ లక్ష్యం దిశగా వడివడిగా సాగింది. 13 ఓవర్లలో 121/2తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. జోరుమీదున్న సాహా, దూకుడుగా ఆడగల మిల్లర్‌ (17) క్రీజులో ఉండగా.. చివరి ఏడు ఓవర్లలో 75 పరుగులు చేయాల్సిన స్థితిలోనూ గుజరాత్‌దే ఆధిపత్యం. కానీ ఉమ్రాన్‌ ఓ బుల్లెట్‌ బంతితో సాహాను బౌల్ట్‌ చేయడంతో ఆ జట్టుకు కళ్లెం పడ్డట్లయింది. పరుగుల వేగం తగ్గింది. పదునైన పేస్‌ బౌలింగ్‌ను కొనసాగించిన ఉమ్రాన్‌..  తన తర్వాతి ఓవర్లో (16వ) మిల్లర్‌, అభినవ్‌ మనోహర్‌ (0)లను ఔట్‌ చేసి హైదరాబాద్‌ను పైచేయిలో నిలిపాడు. 17 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 149/5. 18వ ఓవర్లో 12 పరుగులొచ్చినా.. తెవాతియా, రషీద్‌ ధాటిగా ఆడుతున్నా గుజరాత్‌కు కష్టమే అనిపించింది. ఎందుకంటే చివరి 2 ఓవర్లలో 35 పరుగులు చేయాలి. నటరాజన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో ఓ ఫోర్‌, సిక్స్‌ దంచిన తెవాతియా ఆ జట్టును రేసులో నిలిపాడు. అయినా చివరి ఓవర్లో గుజరాత్‌ 22 పరుగులు చేయాల్సిన స్థితిలో హైదరాబాద్‌కే మెరుగైన అవకాశాలు. కానీ జాన్సన్‌ పేలవ బౌలింగ్‌, రషీద్‌ సంచలన బ్యాటింగ్‌ హైదరాబాద్‌ ఆశలపై నీళ్లు చల్లాయి. చివరి ఓవర్‌ తొలి బంతికి సిక్స్‌ కొట్టిన తెవాతియా.. ఆ తర్వాత సింగిల్‌ తీశాడు. మూడో బంతికి రషీద్‌.. బౌలర్‌ తల మీదుగా సిక్స్‌ దంచేశాడు. నాలుగో బంతికి పరుగు రాలేదు. చివరి రెండు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సిన స్థితిలో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన రషీద్‌ హైదరాబాద్‌కు షాకిచ్చాడు.

అభిషేక్‌ అదరహో...: హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్‌ అభిషేక్‌ ఆటే హైలైట్‌. చక్కని ఫామ్‌ను కొనసాగించిన ఈ కుర్రాడు.. అదిరే బ్యాటింగ్‌తో తన జట్టు మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన అతడు.. ముచ్చటైన షాట్లతో అలరించాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌.. షమి ధాటికి త్వరగానే కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (5), త్రిపాఠి (16; 10 బంతుల్లో 2×4, 1×6) వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్లకు స్కోరు 44/2. అప్పటికి అభిషేక్‌ 12 బంతుల్లో 12 పరుగులే చేశాడు. కానీ ఆ తర్వాత వేగం పెంచాడు. అల్జారి జోసెఫ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతడు.. మార్‌క్రమ్‌ కలిసి చురుగ్గా సింగిల్స్‌, డబుల్స్‌ తీశాడు. 10 ఓవర్లకు స్కోరు 84/2 కాగా.. మార్‌క్రమ్‌ కూడా క్రమంగా జోరు పెంచాడు. జోసెఫ్‌ బంతిని ఫ్రంట్‌ ఫుట్‌పై స్టాండ్స్‌లోకి పుల్‌ చేశాడు. ఆ తర్వాత 12వ ఓవర్లో స్పిన్‌ మాంత్రికుడు రషీద్‌ బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌తో మిడ్‌వికెట్లోకి సిక్స్‌ దంచిన అభిషేక్‌.. మరో స్లాగ్‌ స్వీప్‌ సిక్స్‌తో అర్ధశతకం పూర్తి చేశాడు. మార్‌క్రమ్‌ కూడా తగ్గలేదు. 148 కిలోమీటర్ల వేగంతో ఫెర్గూసన్‌ వేసిన బంతిని అమాంతం బౌండరీ ఆవల పడేశాడు. ఈ ఇద్దరి జోరుతో హైదరాబాద్‌ 15 ఓవర్లలో 140/2తో బలమైన స్థితిలో నిలిచింది. అయినా అంత పెద్ద స్కోరు చేసేలా కనిపించలేదు. హైదరాబాద్‌  . ఎందుకంటే క్రీజులో కుదురుకున్న అభిషేక్‌, మార్‌క్రమ్‌ వికెట్లతో పాటు పూరన్‌ (3), వాషింగ్టన్‌ సుందర్‌ (3) వికెట్లను కోల్పోయిన  ఆ జట్టు 18.1 ఓవర్లలో 162/6తో నిలిచింది. కానీ ఆఖర్లో శశాంక్‌ సింగ్‌ చితక్కొట్టేశాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో సిక్స్‌ల మోత మోగించి ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చాడు. ఫెర్గూసన్‌ వేసిన 20వ ఓవర్‌ చివరి మూడు బంతులను అతడు సిక్స్‌లుగా మలిచాడు. తొలి బంతికి జాన్సన్‌ కూడా సిక్స్‌ దంచాడు. ఆ ఓవర్లో హైదరాబాద్‌  ఏకంగా 25 పరుగులు పిండుకుంది. 6, 0, 1, 6, 6, 6.. చివరి ఓవర్‌ సాగిన తీరిది.


అతనొక్కడు ఒకవైపు..

ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓడినా.. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ మాత్రం టీ20 చరిత్రలో నిలిచిపోయేదే. బంతులను బుల్లెట్లలా మార్చి అతను సంధిస్తుంటే.. గుజరాత్‌ బ్యాట్స్‌మెన్‌ దగ్గర సమాధానమే లేకపోయింది. మంచి టెక్నిక్‌ ఉన్న గిల్‌ను ఉమ్రాన్‌ బౌల్డ్‌ చేసిన తీరు చూసి తీరాల్సిందే. ఇక మిగతా హైదరాబాద్‌ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని గుజరాత్‌ను విజయం వైపు పరుగులు పెట్టించిన సాహాను 150 కిలోమీటర్లకు పైగా వేగంతో విసిరిన యార్కర్‌తో బౌల్డ్‌ చేసిన వైనం మ్యాచ్‌కే హైలైట్‌. మిల్లర్‌, మనోహర్‌లను సైతం కళ్లు చెదిరే బంతులతో బౌల్డ్‌ చేశాడతను. హార్దిక్‌ క్రీజులోకి అడుగు పెట్టగానే ఒక బౌన్సర్‌తో అతడి భుజాన్ని గాయపరిచిన మాలిక్‌.. ఇంకో రెండు బంతులకే అతణ్ని పెవిలియన్‌ చేర్చాడు. హైదరాబాద్‌ జట్టులో మిగతా నలుగురు బౌలర్లూ కలిపి 16 ఓవర్లలో 173 పరుగులిస్తే.. ఉమ్రాన్‌ 4 ఓవర్లలో 25 పరుగులే ఇచ్చాడు. గత మ్యాచ్‌ హీరోలైన జాన్సన్‌, నటరాజన్‌ వరుసగా నాలుగేసి ఓవర్లలో 63, 43 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని