Updated : 01 May 2022 06:53 IST

Gujarat: ప్లేఆఫ్స్‌కు గుజరాత్‌.. బెంగళూరుపై గెలుపు

రాణించిన తెవాతియా, మిల్లర్‌

ఆఖరి ఓవర్లో గెలుపు తీరాలకు చేరే అలవాటును గుజరాత్‌  కొనసాగిస్తోంది. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్న ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రాహుల్‌ తెవాతియా.. ఈ సారి మిల్లర్‌ జతగా పని పూర్తిచేశాడు. బెంగళూరుపై నెగ్గిన ఆ జట్టు.. వరుసగా అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొత్తం మీద ఎనిమిదో విజయం సాధించిన గుజరాత్‌ ప్లేఆఫ్స్‌ బెర్త్‌ సాధించినట్లే. మరోవైపు 10 మ్యాచ్‌ల్లో బెంగళూరుకిది అయిదో ఓటమి. కోహ్లి అర్ధశతకంతో ఫామ్‌ అందుకోవడం ఒక్కటే ఆ జట్టుకు ఊరటనిచ్చే విషయం.

ముంబయి

టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో గుజరాత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆ జట్టు శనివారం 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. కోహ్లి (58; 53 బంతుల్లో 6×4, 1×6), రజత్‌ పటిదార్‌ (52; 32 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకాలతో రాణించారు. పేలవ బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కుంటున్న కోహ్లి..  టీ20 లీగ్‌లో 14 మ్యాచ్‌ల తర్వాత తొలి అర్ధసెంచరీ అందుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో 2018 తర్వాత తొలి టీ20 లీగ్‌ మ్యాచ్‌ ఆడిన ప్రదీప్‌ సంగ్వాన్‌ (2/19) సత్తాచాటాడు. ఛేదనలో గుజరాత్‌ 4 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. రాహుల్‌ తెవాతియా (43 నాటౌట్‌; 25 బంతుల్లో 5×4, 2×6), మిల్లర్‌ (39 నాటౌట్‌; 24 బంతుల్లో 4×4, 1×6) అయిదో వికెట్‌కు అజేయంగా 79 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బెంగళూరు బౌలర్లలో షాబాజ్‌ అహ్మద్‌ (2/26), హసరంగ (2/28) రాణించారు. బ్యాటింగ్‌ చేస్తున్నపుడు అస్వస్థతగా కనిపించిన దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో అనుజ్‌ రావత్‌ సబ్‌స్టిట్యూట్‌ వికెట్‌కీపర్‌గా ఆడాడు.

అవే మెరుపులు..: ఛేదనలో గుజరాత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు సాహా (29), శుభ్‌మన్‌ గిల్‌ (31) తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించారు. గిల్‌ నిదానంగా మొదలెట్టగా.. సాహా మాత్రం ధాటిగా ఆడాడు. 7 ఓవర్లకు స్కోరు 50/0. ఆ దశలో స్పిన్నర్లు చకచకా నాలుగు వికెట్లు పడగొట్టి  బెంగళూరుని పోటీలోకి తెచ్చారు. మొదట సాహాను హసరంగ పెవిలియన్‌ చేర్చగా.. ఆ తర్వాత తన వరుస ఓవర్లలో గిల్‌, హార్దిక్‌ (3)ను షాబాజ్‌ ఔట్‌ చేసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. ఆ వెంటనే సుదర్శన్‌ (20) ఇన్నింగ్స్‌కు హసరంగ తెరదించాడు. 14 ఓవర్లకు 100/4తో  గుజరాత్‌.. అప్పుడు బెంగళూరుకే మంచి అవకాశాలున్నాయి. కానీ ప్రమాదకర మిల్లర్‌, తెవాతియా ధనాధన్‌ బ్యాటింగ్‌తో కథ మొత్తం మార్చేశారు. హసరంగ ఓవర్లో వరుసగా ఫోర్‌, సిక్సర్‌తో మిల్లర్‌ బాదుడు మొదలెట్టగా.. సిరాజ్‌ బౌలింగ్‌లో తెవాతియా మూడు ఫోర్లు రాబట్టాడు. దీంతో ఆ జట్టు విజయ సమీకరణం 4 ఓవర్లలో 43 పరుగులుగా మారింది. 17వ ఓవర్లో హర్షల్‌ 7 పరుగులే ఇవ్వడంతో ఉత్కంఠ రేగింది. కానీ ఓటమి బాటలో సాగుతున్న మ్యాచ్‌లను మలుపు తిప్పుతున్న తెవాతియా ఆ తర్వాతి ఓవర్లో (హేజిల్‌వుడ్‌) వరుసగా 6, 4.. మిల్లర్‌ ఓ ఫోర్‌ కొట్టడంతో పోరు గుజరాత్‌ వైపు మొగ్గింది. 19వ ఓవర్లో హర్షల్‌ తొలి అయిదు బంతులకు ఆరు పరుగులే ఇచ్చినా.. తెవాతియా చివరి బంతికి సిక్సర్‌ బాది విజయాన్ని ఖాయం చేశాడు. చివరి ఓవర్లో చెరో ఫోర్‌తో లాంఛనం పూర్తి చేశారు.

ఆ ఇద్దరు నిలబడి..: కోహ్లి, రజత్‌ అర్ధశతకాలతో భారీ స్కోరు దిశగా సాగిన బెంగళూరుకి ఆఖర్లో గుజరాత్‌ బౌలర్లు కళ్లెం వేశారు. అంతకుముందు నాలుగేళ్ల తర్వాత తిరిగి టీ20 లీగ్‌ ఆడిన ప్రదీప్‌ తన తొలి ఓవర్లోనే డుప్లెసిస్‌ (0)ను వెనక్కిపంపి షాకిచ్చాడు. కానీ చాలా కాలం తర్వాత కోహ్లి బ్యాట్‌ ఝుళిపించడం.. అతని తోడుగా రజత్‌ రెచ్చిపోవడంతో బెంగళూరుకి ఇబ్బంది లేకుండా పోయింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో దూకుడు ప్రదర్శించిన విరాట్‌.. ఫామ్‌ అందుకుంటూ పరుగుల వేటలో సాగాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆ జట్టు 43/1తో నిలిచింది. కానీ అక్కడి నుంచి వికెట్‌ కాపాడుకోవాలనే జాగ్రత్తతో విరాట్‌ నెమ్మదిగా ఆడినట్లు కనిపించాడు. ఫెర్గూసన్‌ (1/36) తొలి ఓవర్లో పరుగుల కోసం కష్టపడ్డ కోహ్లి.. అతని రెండో ఓవర్లో వరుసగా ఓ సిక్సర్‌, ఫోర్‌తో లెక్క సరిచేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన ఫుల్‌టాస్‌ను లాంగాన్‌లో స్టాండ్స్‌లో పడేశాడు. మరోవైపు రజత్‌ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. రషీద్‌ ఖాన్‌ (1/29)తో సహా ఏ బౌలర్‌నూ లక్ష్యపెట్టకుండా దంచికొట్టాడు. 14 ఓవర్లకు స్కోరు 110/1. చేతిలో తొమ్మిది వికెట్లు ఉండడంతో జట్టు భారీ స్కోరుపై కన్నేసిన దశ అది. కానీ గొప్పగా పుంజుకున్న గుజరాత్‌ బౌలర్లు ఆఖరి ఆరు ఓవర్లలో అయిదు వికెట్లు పడగొట్టారు. రజత్‌, కోహ్లి, దినేశ్‌ కార్తీక్‌ (2) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన మ్యాక్స్‌వెల్‌ (33).. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో రషీద్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు నిష్క్రమించాడు. ఆఖరి ఓవర్లో మహిపాల్‌ లామ్రోర్‌ (16) ఓ సిక్సర్‌, ఫోర్‌ కొట్టాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని