Kapil Dev: కోహ్లీ, రాహుల్‌, రోహిత్‌.. ఆ సమయానికి ఔటవుతారు..

పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్‌ ఇండియా తన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరముందని మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లి, రాహుల్‌, రోహిత్‌లలో 150పై స్ట్రైక్‌రేట్‌తో ఆడే సామర్థ్యం ఉందని, తాము స్ట్రైకర్‌ పాత్ర పోషించాలా లేదా యాంకర్‌ పాత్ర పోషించాలా

Updated : 07 Jun 2022 08:42 IST

ముంబయి: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్‌ ఇండియా తన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరముందని మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, రాహుల్‌, రోహిత్‌లలో 150పై స్ట్రైక్‌రేట్‌తో ఆడే సామర్థ్యం ఉందని, తాము స్ట్రైకర్‌ పాత్ర పోషించాలా లేదా యాంకర్‌ పాత్ర పోషించాలా అన్నది వాళ్లు నిర్ణయించుకోవాలని అన్నాడు. ‘‘పెద్ద పేరే ఉండొచ్చు. ఒత్తిడీ ఎక్కువే ఉండొచ్చు. కానీ భయం లేకుండా ఆడాలి. రోహిత్‌, కోహ్లి, రాహుల్‌ 150-160 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయగలరు. వాళ్లు చాలా పెద్ద ఆటగాళ్లు. కానీ పరుగులు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం ఔటవుతారు. ఊపందుకోవడానికి 10-12 బంతులాడితే అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్లు 25 బంతులు ఆడిన తర్వాత ఔటవుతున్నారు. జోరు పెంచాల్సిన సమయంలో వాళ్లు నిష్క్రమిస్తుండడంతో జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఆటగాళ్లు యాంకర్‌ పాత్ర అయినా పోషించాలి లేదా స్ట్రైకర్‌ పాత్రయినా పోషించాలి. అది వాళ్లు లేదా జట్టు నిర్ణయించాలి. రాహుల్‌నే తీసుకుందాం. అతడు 20 ఓవర్లు ఆడి 80-90 చేస్తే మంచిదే. కానీ 20 ఓవర్లు ఆడి 60తో వెనక్కి వస్తే జట్టుకు న్యాయం చేయనట్లే’’ అని కపిల్‌ చెప్పాడు. టీ20 క్రికెట్లో భారత జట్టు దృక్పథం మారాల్సిన అవసరముందా అన్న ప్రశ్నకు కపిల్‌ బదులిస్తూ.. ‘‘జట్టు దృక్పథం మారాలి. లేదంటే ఆటగాళ్లను మార్చాల్సి ఉంటుంది. పెద్ద ఆటగాళ్లు జట్టుపై ఎక్కువ ప్రభావం చూపాలి.వాళ్లు ఆ స్థాయి ప్రదర్శన చేయకపోతే దాని గురించి మనం మాట్లాడతాం’’ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని