IND vs SA: విశాఖ విజయాన్నిచ్చేనా..

వరుసగా 12 విజయాలు.. ఇదీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు అంతర్జాతీయ టీ20ల్లో టీమ్‌ఇండియా ఘనత. మరో మ్యాచ్‌ గెలిస్తే ప్రపంచ రికార్డు. అదే జోరులో సొంతగడ్డపై సఫారీ సేననూ చిత్తు చేస్తుందని అంతా ఆశించారు.

Updated : 14 Jun 2022 06:44 IST

దక్షిణాఫ్రికాతో భారత్‌ మూడో టీ20 నేడు
సాయంత్రం 7 నుంచి

వరుసగా 12 విజయాలు.. ఇదీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు అంతర్జాతీయ టీ20ల్లో టీమ్‌ఇండియా ఘనత. మరో మ్యాచ్‌ గెలిస్తే ప్రపంచ రికార్డు. అదే జోరులో సొంతగడ్డపై సఫారీ సేననూ చిత్తు చేస్తుందని అంతా ఆశించారు. కానీ రెండు మ్యాచ్‌లు తిరిగే సరికి పరిస్థితి తలకిందులైంది. ప్రపంచ రికార్డు సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడింది భారత్‌. మూడో టీ20 నేడే. విశాఖపట్నంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌లో పంత్‌సేన పనైపోయినట్లే! మరి టీమ్‌ఇండియా ఏం చేస్తుందో?

విశాఖ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లేడు.. కీలక ఆటగాళ్లు కోహ్లి, బుమ్రా, షమి విశ్రాంతి తీసుకున్నారు. సిరీస్‌ ఆరంభానికి ముందే గాయాలతో కేఎల్‌ రాహుల్‌, కుల్‌దీప్‌ తప్పుకున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సత్తా ఉన్న కుర్రాళ్లతో నిండిన టీమ్‌ఇండియా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై చెలరేగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో వైఫల్యంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో భారత్‌ బోల్తా కొట్టింది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2తో వెనకబడ్డ జట్టు.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మూడో మ్యాచ్‌లో మంగళవారం దక్షిణాఫ్రికాను ఢీ కొడుతుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న సఫారీ సేనను అడ్డుకోవడం పంత్‌సేనకు సవాలే.

సమష్టిగా ఆడాలి: తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌ వైఫల్యంతో నిరాశపర్చిన జట్టు.. రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు భువనేశ్వర్‌ ప్రదర్శన మినహా బౌలింగ్‌లోనూ విఫలమైంది. గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో భువీ ఒక్కడే రాణించాడు. మిగతా వాళ్లు జోరు అందుకోకుంటే సిరీస్‌ గురించి టీమ్‌ఇండియా మరచిపోవాల్సిందే. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో ఢీలా పడిన జట్టును పంత్‌ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం. వ్యూహాలకు పదును పెట్టకపోతే కెప్టెన్‌గా తొలి సిరీస్‌ తనకు తీవ్ర పరాభవాన్ని మిగిల్చే ఆస్కారముంది. బ్యాటింగ్‌లోనూ అతను ఫామ్‌ అందుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో ఇషాన్‌, శ్రేయస్‌ నిలకడగా రాణిస్తున్నారు. దినేశ్‌ కూడా గత మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. కానీ జట్టు సమష్టిగా సత్తాచాటి భారీ స్కోర్లను నమోదు చేయాలి. ఆల్‌రౌండర్లు హార్దిక్‌, అక్షర్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌ కోసం బ్యాటింగ్‌ను బలంగా మార్చే దిశగా దీపక్‌ హుడాను ఆడిస్తారేమో చూడాలి. పేసర్‌ అవేశ్‌ స్థానంలో ఉమ్రాన్‌ లేదా అర్ష్‌దీప్‌ జట్టులోకి రావొచ్చు.

ఇక్కడే కొట్టేయాలని..: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా చాలా ఉత్సాహంతో ఉంది. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం ఆ జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. చేతి గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన ఆ జట్టు స్టార్‌ ఆటగాడు డికాక్‌.. సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌ల్లోనే ఆడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతణ్ని ఎలా కట్టడి చేయాలని ఆలోచించే బాధ భారత్‌కు తప్పినట్లే. కానీ  ఆ జట్టులో ప్రతి ఒక్కరూ ఇప్పుడు మ్యాచ్‌ విన్నర్లుగా మారారు. వాండర్‌ డసెన్‌, హెన్రిక్స్‌, మిల్లర్‌, క్లాసెన్‌, ప్రిటోరియస్‌తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ బలంగా ఉంది. రబాడ, పార్నెల్‌, నోకియాతో కూడిన పేస్‌ త్రయం.. షంసి, కేశవ్‌ మహారాజ్‌ స్పిన్‌ ద్వయం భారత్‌ను ఇబ్బంది పెడుతోంది. ఉత్తమ ఆటతో విజయాలు సాధిస్తున్న ఆ జట్టుకు కళ్లెం వేయాలంటే భారత్‌ అత్యుత్తమంగా ఆడాల్సిందే.


13

గత 14 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా సాధించిన విజయాలు. ఛేదనలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు.
* దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌ గెలిస్తే 2010 నుంచి భారత్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో అజేయంగా నిలుస్తున్న రికార్డును కొనసాగిస్తుంది.
* టీ20ల్లో సొంతగడ్డపై భారత్‌ చివరగా 2018-19లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడు సిరీస్‌లు నెగ్గింది.


పిచ్‌ ఎలా ఉంది?

చివరగా ఇక్కడ 2019 డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో వన్డే జరిగింది. ఇక టీ20 మ్యాచ్‌ జరిగి మూడేళ్లు (2019 ఫిబ్రవరి) గడిచిపోయింది. ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన రెండు టీ20ల్లోనూ స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. 2016లో శ్రీలంకను భారత్‌ 82కే ఆలౌట్‌ చేసి గెలిచింది. 2019లో ఆస్ట్రేలియాతో పోరులో 126/7కే పరిమితమైన టీమ్‌ఇండియా ఓటమి మూటగట్టుకుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఛేదన చేసిన జట్లే గెలిచాయి. ఈ సారి టాస్‌ గెలిచిన జట్లు ఛేదనకే మొగ్గుచూపొచ్చు. పిచ్‌ పేసర్లతో పాటు స్పిన్నర్లకూ సహకరిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని