Amritpal Singh: ఖలిస్థానీ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ నామినేషన్‌ దాఖలకు సహకరించాం: పంజాబ్‌ ప్రభుత్వం

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేశాడు. అతడికి నిబంధనల ప్రకారం సహకరించినట్లు పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది.  

Published : 10 May 2024 16:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ నేత, వారిస్‌ పంజాబ్‌ దే నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేయడానికి తాము సహకరించినట్లు పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు ఆ రాష్ట్ర హైకోర్టుకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్‌ అస్సాంలోని డిబ్రూగఢ్‌ జైల్లో ఉన్నాడు. శ్రీ ఖదూర్‌ సాహెబ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల అతడు న్యాయస్థానంలో పిటిషన్‌ వేశాడు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు తాత్కాలికంగా జైలు నుంచి విడుదల చేయాలని కోరాడు. తన నామినేషన్‌ దాఖలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ ఎన్నికల అధికారి,  డిప్యూటీ కమిషనర్‌ను కోరినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించాడు. 

పంజాబ్‌ ప్రభుత్వం శుక్రవారం అమృత్‌పాల్‌ నామినేషన్‌పై న్యాయస్థానానికి సమాచారం ఇచ్చింది. తాము డిబ్రూగఢ్‌ జైల్లో అతడు ప్రపోజర్‌, న్యాయవాదితో భేటీ అయ్యేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. చట్ట ప్రకారం దీంతోపాటు ప్రమాణపత్రాలను కూడా ఏర్పాటుచేసినట్లు పంజాబ్‌ డీఏజీ అర్జున్‌ షోయిరన్‌ పేర్కొన్నారు. మే 9వ తేదీన అమృత్‌పాల్‌ సింగ్‌ ఖదూర్‌ సాహెబ్‌ నియోజకవర్గానికి నామినేషన్‌ దాఖలు చేశాడు. 

అమృత్‌సర్‌ జిల్లా అజ్‌నాలా పోలీసులపై దాడి కేసులో అమృత్‌పాల్‌ పేరు దేశంలో మార్మోగింది. అతడు చాలాకాలం దుబాయిలో ఉన్నాడు. ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ వ్యవస్థాపకుడు దీప్‌సిద్ధూ మరణంతో అమృత్‌పాల్‌ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. నాటినుంచి ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్‌నే స్థావరంగా ఎంచుకున్నాడు. అజ్‌నాలా ఘటన తర్వాత దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో గడిపాడు. చివరికి జర్నైల్‌ సింగ్‌ గ్రామమైన రోడెవాల్‌లోని గురుద్వారాలో అతడిని అరెస్టు చేసి డిబ్రూగఢ్‌ జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని