ఈ కాంస్యం స్ఫూర్తిగా నిలుస్తుంది

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ మహిళల జట్టు సాధించిన కాంస్యం దేశంలో అమ్మాయిలు ఈ క్రీడలోకి వచ్చేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పేర్కొంది. ‘‘డబ్బులు కట్టి చెస్‌ చూసేందుకు అభిమానులు ముందుకు రావడం ఆనందం కలిగిస్తోంది.

Published : 13 Aug 2022 03:07 IST

చెన్నై: చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ మహిళల జట్టు సాధించిన కాంస్యం దేశంలో అమ్మాయిలు ఈ క్రీడలోకి వచ్చేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పేర్కొంది. ‘‘డబ్బులు కట్టి చెస్‌ చూసేందుకు అభిమానులు ముందుకు రావడం ఆనందం కలిగిస్తోంది. నిజానికి భారత్‌ లాంటి దేశంలో ఉచితంగా ప్రవేశం కల్పించినా అభిమానులు చెస్‌ గేమ్‌లు వీక్షించేందుకు రారు. దేశంలో చెస్‌ ఒలింపియాడ్‌ నిర్వహించడం వల్ల ఆటకు మరింత ఆదరణ లభించడం ఖాయం. ఈ టోర్నీలో మా జట్టు సాధించిన కాంస్యం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నా. యువ క్రీడాకారిణులు మరింత మంది రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత అమ్మాయిల్లో వైశాలి ప్రతిభావంతురాలు. ఇటీవల ఆమె ఆటలో ఎంతో పరిణతి సాధించింది. దివ్య దేశ్‌ముఖ్‌, సవిత శ్రీ లాంటి సత్తా ఉన్న అమ్మాయిలు కూడా తెరపైకి వస్తున్నారు. భారత పురుషుల చెస్‌లో మాదిరే మహిళల్లోనూ మరింత ఎక్కువ మంది చెస్‌ వైపు రావాలి’’ అని హంపి చెప్పింది. ఒలింపియాడ్‌లో చివరి రెండు రౌండ్లలో హారిక లేకపోవడం లోటు అయిందని హంపి పేర్కొంది. ‘‘టాప్‌ బోర్డులో హారిక, నాపై ఎక్కువ భారం ఉందని తెలుసు. కానీ నిండు గర్భిణిగా ఉండడంతో చివరి రెండు రౌండ్లలో హారిక ఆడలేకపోవడం మాకు లోటుగా మారింది. రెండున్నర ఏళ్ల తర్వాత క్లాసికల్‌ చెస్‌ ఆడాను. ద్వితీయార్థంలో మరింత మెరుగ్గా ఆడగలిగేదాన్నేమో’’ అని హంపి తెలిపింది. ఒలింపియాడ్‌లో భారత్‌-ఎ మహిళల జట్టు కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని